పెరిగిన బంధన్‌ బ్యాంక్‌ లాభాలు

హైదరాబాద్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో ప్రయివేటు రంగంలోని బంధన్‌ బ్యాంక్‌ నికర లాభాలు 47 శాతం పెరిగి రూ.1,063 కోట్లకు చేరాయి. మొండి బాకీలు తగ్గడంతో మెరుగైన ఫలితాలు నమోదు చేసినట్లు ఆ బ్యాంక్‌ తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.721 కోట్ల లాభాలు ప్రకటించింది. ఇదే సమయంలో రూ.4,908 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం.. క్రితం క్యూ1లో రూ.6,063 కోట్లకు చేరిందని తెలిపింది. 2024 జూన్‌ ముగింపు నాటికి బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు 4.23 శాతానికి పరిమితమయ్యాయి. గతేడాది ఇదే కాలం నాటికి 6.76 శాతంగా జిఎన్‌పిఎ చోటు చేసుకుంది. నికర నిరర్థక ఆస్తులు 2.18 శాతం నుంచి 1.15 శాతానికి పరిమితమయ్యాయి.