పెంచిన ధర్మశాలల, ఆర్జిత సేవలు, ప్రసాదాల ధరలను తగ్గించాలి..

– దేవాలయాన్ని వ్యాపార కేంద్రంగా మార్చొద్దు..
– విశ్వహిందూ పరిషత్ పట్టణ అధ్యక్షుడు చిక్కుడు మల్లేశం, నాయకులు గడప కిషోర్..
నవతెలంగాణ – వేములవాడ
రాజన్న క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా భక్తి భావం ఉట్టిపడేలా భక్తులకు వసతులు కల్పించి శీఘ్రదర్శనాలు జరిగే విధంగా చూడాలి కాని రాజన్న దర్శనానికి వచ్చే పేద భక్తులను ఆర్థికంగా ఇబ్బంది పడే విధంగా ధర్మశాలల, ఆర్జిత సేవ టికెట్లు, ప్రసాదాల ధరలను అధికంగా పెంచి పేద భక్తులపై భారంపడేలా చేయడం దేవాలయ అధికారులకు ఇది సమంజసం కాదని, తగ్గించడం ఎడల పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని విశ్వహిందూ పరిషత్ పట్టణ అధ్యక్షులు చిక్కుడు మల్లేశం, నాయకులు గడప కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని వ్యాపార కేంద్రంగా మార్చి సామాన్య, పేద భక్తులకు దేవున్ని దర్శించుకునే భాగ్యాన్ని దూరం చేస్తున్నారని ఆలయ అధికారులపై మండిపడ్డారు. దేవాలయంలో ధర్మశాలలు, ఆర్జితసేవలు, ప్రసాదాల ధరలను  ఎలాంటి పేపర్ ప్రకటన ఇవ్వకుండా భక్తులకు, పట్టణ ప్రజలకు అభిప్రాయం తెలుసుకోకుండా  ధరలు పెంచడం హేయమైన చర్య అని అన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించి సామాన్య పేద భక్తులకు దేవున్ని దర్శించుకునే భాగ్యాన్ని కల్పించాలని లేనియెడల పెద్ద ఎత్తున విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.