పెరిగిన ‘రవాణా’ రాబడి

Increased 'transportation' revenue– 2023-24 ఆర్థికంలో రాష్ట్ర రవాణా శాఖ ఆదాయం రూ.6,972కోట్లు
– గ్ర్రేటర్‌ జిల్లాల ఇన్‌కమ్‌ రూ.4,449 కోట్లు
– లైఫ్‌, క్వార్టర్లీ ట్యాక్స్‌, ఫీజుల ద్వారా పెరిగిన ఆదాయం
నవతెలంగాణ- సిటీబ్యూరో
రవాణాశాఖ వార్షిక ఆదాయం పెరిగింది. గతేడాదితో పోల్చితే చూస్తే.. 2023-24లో రూ.500కోట్లకుపైగా ఆదాయం ఎక్కువగా నమోదైంది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే లైఫ్‌ ట్యాక్స్‌(జీవితకాలపు పన్ను)తో పాటు క్వార్టర్లీ, గ్రీన్‌ ట్యాక్స్‌, ఎన్స్‌ఫోర్స్‌మెంట్‌, ఫీజులు, సర్వీస్‌ చార్జీల ద్వారా వసూలయ్యే పన్నుల్లో స్వల్పంగా వృద్ధి నమోదైంది. ఇందులో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో కొత్త వాహనాలపై జీవితకాల పన్ను రూపంలోనే రవాణాశాఖకు రూ.3617.87 కోట్ల ఆదాయం లభించగా, క్వార్టర్లీ, ఫీజులు, సర్వీస్‌ చార్జీలు, గ్రీన్‌ ట్యాక్స్‌, ఎన్స్‌ఫోర్స్‌మెంట్‌ ద్వారా మొత్తం రూ.4,449.14 కోట్ల ఆదాయం లభించింది. గత సంవత్సరం గ్రేటర్‌లోని మూడు జిల్లాల్లో జీవితకాల పన్నుతో పాటు అన్ని రకాల ఫీజుల రూపంలో సుమారు రూ.3989 కోట్లకుపైగా మాత్రమే వచ్చింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం రాష్ట్ర వ్యా ప్తంగా రవాణాశాఖ రూ.6400 కోట్లు వసూలు చేయ గా.. ఈసారి 6,972 కోట్లు సాధించింది. ఈ లెక్కన గ్రేటర్‌వ్యాప్తంగా భారీగా ఆదాయం సాధించినప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా ఆశించిన స్థాయిలో వృద్ధి లేదనిపిస్తోంది.
2022-2023 ఆర్థిక సంవత్సరంలో వివిధ పన్నులను రవాణాశాఖ సవరించింది. దీంతో ఆ సంవత్సరం ఆదాయం రెండింతలైంది. అదే ఊపులో 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను సుమారు 8-9వేల కోట్ల వరకు టార్గెట్‌ను ఫిక్స్‌ చేసినట్టు తెలిసింది. కానీ ఆర్టీఏ ఉన్నతాధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అయితే, ఆయా జిల్లాలకు ఇవ్వాల్సిన టార్గెట్లను మాత్రం ఇచ్చేశారు. ఇందులో గ్రేటర్‌లోని మూడు జిల్లాలు మాత్రమే మంచి ప్రతిభ కనబర్చాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా రెవెన్యూ సాధించి మొదటిస్థానంలో నిలిచాయి. ఇందులో రంగారెడ్డి టాప్‌ ప్లేస్‌లో నిలిచింది.
ఆదాయంపై ‘కొత్త సర్కారు’ ఎఫెక్ట్‌!
ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చే శాఖల్లో రవాణాశాఖ అత్యంత కీలకమైంది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే లైఫ్‌ ట్యాక్స్‌, త్రైమాసిక పన్ను, ఫీజులు, సర్వీసు చార్జిలు, డిటెక్షన్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ద్వారా ఏటా కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి ఆర్జించి పెడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రవాణాశాఖకు మొత్తం 54 కార్యాలయాలుండగా.. గ్రేటర్‌లోని మూడు జిల్లాల పరిధిలో 11 ఆఫీసులున్నాయి. వీటి పరిధిలో రోజూ మొత్తం 5వేలకు పైగా లావాదేవీలు జరుగుతుండగా.. ఒక్క గ్రేటర్‌ పరిధిలో ప్రతిరోజూ వెయ్యి నుంచి పదిహేను వందల వరకు వాహనాల రిజిస్ట్రేషన్‌ జరుగుతుంటాయి. అయితే ప్రతి కొత్త వాహనం కొనుగోలు సమయంలో టూవీలర్‌కు 9 నుంచి 12శాతం, రూ.10లక్షల లోపు విలువ చేసే కారు కొనుగోలు చేస్తే గతంలో 12 నుంచి 14శాతం ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారు. ఇదొక్కటే కాదు.. గ్రీన్‌ ట్యాక్స్‌ సైతం భారీగా పెంచారు. దాంతో హైదరాబాద్‌లో జీవితకాల పన్ను రూపేణ రూ.1209.76 కోట్లు, రంగారెడ్డి జిల్లాలో రూ.1376.41 కోట్లు, మేడ్చల్‌లో రూ.1031.70 కోట్లు లభించింది. లైప్‌ట్యాక్స్‌తో పాటు అన్ని రకాలుగా రవాణాశాఖకు ఆదాయాన్ని ఆర్జించడంలో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంది.
ఇకపోతే రవాణా వాహనాలపైన ప్రతి మూడు నెలలకొకసారి విధించే త్రైమాసిక పన్నుల ద్వారా రంగారెడ్డిలో రూ.160.99 కోట్లు, మేడ్చల్‌లో రూ.134.47 కోట్లు, హైదరాబాద్‌లో రూ.76.94 కోట్లు వచ్చాయి. మిగతా అన్ని రకాల పన్నులు, ఫీజులు, సర్వీస్‌చార్జీలు కలుపుకొని ఈ ఆర్థిక సంవత్సరం హైదరాబాద్‌లో రూ.1462.04 కోట్లు లభించగా, రంగారెడ్డిలో రూ.1688.78 కోట్లు, మేడ్చల్‌లో రూ.1298.33 కోట్ల చొప్పున ఆదాయం రాబట్టింది. మొత్తంగా గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది స్వల్పంగానే ఆదాయం పెరుగుదల నమోదైంది. ఇందుకు అనేక కారణాలను అధికారులు చెబుతున్నారు. గతేడాది డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత కొత్త ప్రభుత్వం కొలువుదీరడం, అనంతరం అన్నిశాఖలతో పాటు రవాణాశాఖలో బదిలీలు, ప్రమోషన్లతోపాటు ఇతర కారణాల వల్ల అనుకున్న స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించలేకపోయారని ఆర్టీఏ అధికార వర్గాలు పేర్కొనాయి.
రాష్ట్ర ఆదాయంలో 44శాతం మాదే..
మామిండ్ల చంద్రశేఖర్‌ గౌడ్‌, ఉపరవాణాశాఖ కమిషనర్‌, ఉమ్మడి రంగారెడ్డి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, వికారాబాద్‌ జిల్లాలకు సంయుక్తంగా రూ.3,143 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్ధేశించగా.. రూ.3,067 కోట్లు సాధించాం. గత సంవత్సరం ఆదాయంతో పోలిస్తే 9.9 శాతం వృద్ధి రేటు సాధించాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ లక్ష్యాన్ని సాధిస్తాం.
గ్రేటర్‌ పరిధిలో 2023-24 వార్షిక ఆదాయం ఇలా..
జీవితకాలపు పన్ను 3617.87 కోట్లు
త్రైమాసిక పన్ను 372.40కోట్లు
ఫీజులు 296.10 కోట్లు
సర్వీసు ఫీజు 66.46కోట్లు
గ్రీన్‌ట్యాక్స్‌ 35.93కోట్లు
ఎన్‌ఫోర్స్‌మెంట్‌ 60.40 కోట్లు
(డిటెక్షన్‌)