యూనివర్సిటీ పరిధిలో కాన్వకేషన్ ఫీజు పెంచడం దుర్మార్గం

– యూనివర్సిటీలకు నిధులు కేటాయించకుండా సర్టిఫికెట్స్ రూపంలో విద్యార్థుల నుండి వసూలు చేయడం సిగ్గుచేటు
– తే.యూ పీ.డీ.ఎస్.యూ
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కాన్వకేషన్ ఫీజు రూ.700 నుంచి ఏకంగా రూ.3500 పెంచడం దుర్మార్గమని , యూనివర్సిటీలకు అధిక నిధులు కేటాయించకుండా విద్యార్థుల నుండి సర్టిఫికెట్స్ ల రూపంలో వసూలు చేయడం సిగ్గుచేటని దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పీ.డీ.ఎస్.యూ యూనివర్సిటీ కార్యదర్శి జయంతి అన్నారు . శనివారం పీ.డీ.ఎస్.యూ తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో అడ్మిన్ బిల్డింగ్ ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జయంతి మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ వీసీ ఇష్టం వచ్చినట్లు సర్టిఫికెట్స్ ఫీజులు పెంచడం సరైంది కాదని, దీనివలన పేద మధ్యతరగతి విద్యార్థులు సర్టిఫికెట్స్ తీసుకోలేని పరిస్థితి ఏర్పడిందని, యూనివర్సిటీ పరిధిలో చదువుతున్న వేలమంది విద్యార్థులపై  అదనపుబారం పడిందని , యూనివర్సిటీలకు బడ్జెట్లు కేటాయించకుండా  సర్టిఫికెట్స్ రూపంలో విద్యార్థుల నుండి వసూలు చేయడం ఏంటని, తక్షణమే పెంచిన ఫీజులను తగ్గించాలని లేనిచో పీ.డీ.ఎస్.యూ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తే. యూ పీ.డీ.ఎస్.యూ నాయకులు ప్రిన్స్, రవీందర్, అక్షయ్,ఆకాష్, హన్మండ్లు,మహేష్, తదితరులు పాల్గొన్నారు.