నేటి నుంచి జూనియర్‌ డాక్టర్ల నిరవధిక సమ్మె

– అత్యవసర సేవలకు మినహాయింపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె నోటీస్‌ను అందజేసినా..ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో జూనియర్‌ డాక్టర్లు సోమవారం నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నారు. రాష్ట్రంలోని దాదాపు 17 ప్రభుత్వ బోధనాస్పత్రులు, ఇతర ఆరోగ్య సేవల్లో 6 వేల నుంచి 7 వేల మంది వరకు జూనియర్‌ డాక్టర్లు సేవలందిస్తున్నారు. నిర్దేశిత సమయంలో ఉపకార వేతనాల విడుదల, పెండింగ్‌ స్టయిఫండ్‌ విడుదల, సూపర్‌ స్పెషాలిటీ సీనియర్‌ రెసిడెంట్లకు గతంలో ఒప్పుకున్న మేరకు స్టయిఫండ్‌, ఆంధ్రప్రదేశ్‌ సీట్లలో తెలంగాణ విద్యార్థులకు 15 శాతం రిజర్వేషన్‌, ప్రభుత్వాస్పత్రుల్లో భద్రత, పోస్ట్‌ గ్రాడ్యుయేట్లకు సరిపడేలా కొత్త హాస్టళ్ల నిర్మాణం, ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రికి కొత్త భవన నిర్మాణం తదితర డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎన్నికలకు ముందే సమ్మె నోటీస్‌ అందజేసినప్పటికీ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో అధికారుల సూచన మేరకు తాత్కాలికంగా సమ్మె వాయిదా వేశారు. సాధారణ ఎన్నికల ఫలితాల అనంతరం మరోసారి రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు డాక్టర్‌ వాణిని కలిసి ఈ నెల 24 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నట్టు సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఆశించిన మేరకు సానుకూల నిర్ణయం రాకపోవడంతో నల్లరిబ్బన్లు ధరించడం, నల్ల దుస్తులు ధరించడం, కండ్లకు గంతలు కట్టుకుని ప్రదర్శన తదితర రూపాల్లొ గత కొన్ని రోజులుగా నిరసనలు తెలిపారు. అయినా సర్కారు స్పందించకపోవడంతో తమ డిమాండ్ల సాధనకు నిరవధిక సమ్మె ఒక్కటే పరిష్కారమని భావిస్తున్నట్టు తెలంగాణ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు డాక్టర్‌ సీహెచ్‌.జి.సాయి శ్రీహర్ష, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జె.ఐజాక్‌ న్యూటన్‌ తదితరులు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే పేద రోగులను దృష్టిలో ఉంచుకుని అత్యవసర సేవలను మాత్రం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.