చెరిగిపోని కళా సంతకం ‘శ్యాం బెనగల్‌’

An indelible art signature 'Shyam Benegal'ఆయన సినిమాలు సామాన్యుల కోసం కాకపోయినా, అతి సామాన్యుల మానసిక స్థితి గతులను, వారి జీవన విధానాలను స్ఫూర్తిగా తీసుకున్న కథల గాథలు. బతుకు వెతలు.  ముఖ్యంగా, ఆయన సినిమాల్లో ఏ ఒక్క చిత్రమూ వ్యాపారాలతో ముడిపడినది కాదు. చాలా చిత్రాలు అర్థం కావు. కేవలం, అత్యున్నత ఆలోచనా దక్పథం కలిగిన వారికే ఆయన  భాష అర్థమవుతుంది. చాలా మంది దష్టిలో ఆయన కేవలం అవార్డుల కోసమే ఇటువంటి సినిమాలు నిర్మిస్తున్నారా అనే దక్పథం నెలకొని ఉంది. భారత చలన చిత్రాల్లో కేవలం ఇటువంటి దర్శకులు నలుగురు, అయిదుగురు కంటే ఎక్కువ మంది ఉండరు. ఆయన సినిమా అంటే అవార్డు అక్కున చేరినట్టే. ఇంతకూ ఆ గొప్ప దర్శకుడు ఎవరంటే 90 ఏండ్ల జీవితం గడిపి, ఈ మధ్యనే తన గొప్ప చిత్రాల జ్ఞాపకాలు వదలి వెళ్లిన ‘శ్యాం బెనగల్‌’.
14, డిసెంబర్‌, 1934 మన హైదరాబాద్‌ తిరుమలగిరిలో జన్మించిన బెనగళ్ళ శ్యాం సుందరరావు (శ్యాం బెనగల్‌ అసలు పేరు), 23, డిసెంబర్‌, 2024 న ముంబాయిలో జీవితం చాలించాడు. ఆయన నిర్మించినవి దాదాపు అన్నీ ఒక ‘మార్క్‌’ సినిమాలు. క్లాసికల్స్‌.. వ్యధార్ధ జీవుల యధార్థ గాథలకు దశ్యరూపం కల్పించిన శ్యాం బెనగల్‌ సినిమాల్లో సెట్టింగ్స్‌ ఉండవు. సహజ లొకేషన్స్‌, పూరి గుడిసెలు.. ‘దేశం లోని దరిద్రమంతా ఈయన సినిమాల్లోనే కనిపిస్తుంది. విదేశాల్లో ఇండియా ఇలా ఉంటుందా అనే చులకన భావం కలుగు తుంది’ ఇటువంటి కామెంట్స్‌ ఆ రోజుల్లో వినపడేవి. అయినా ఆయన దక్పథం ఆయనది. ఆయన ఆలోచనా విధానం నుంచి ఆయన ఎప్పుడూ వైదొలగలేదు.
సినిమా ప్రస్థానం
శ్యాం బెనగల్‌ దర్శకత్వం వహించినవి రెండు పదుల చిత్రాలు. వాటిల్లో దాదాపు ప్రతి చిత్రం జాతీయ స్థాయి, ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులను సొంతం చేసుకోవడం గమనార్హం. 1974లో తొలి చిత్రం ‘అంకుర’ తో ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. ఈ చిత్రం రెండవ ఉత్తమ చలనచిత్రంగా జాతీయస్థాయి అవార్డును సొంతం చేసు కుంది. ఆ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల జాబితా ఇది :
1975 – చరందాస్‌ చోర్‌, నిశాంత్‌
1976 – మంధన్‌
1977 – భూమిక
1978 – అనుగ్రహం (తెలుగు)
1979 – జునూన్‌
1981 – కలియుగ్‌
1982 – ఆరోహన్‌
1983 – మండి
1985 – త్రికాల్‌
1987 – సుస్మాన్‌
1991 – అంతర్నాడ్‌
1993 – సూరజ్‌ కా సత్యాన్‌ మోడా
1994 – మమ్మో
1996 – సర్దారీ బేగం, ది మేకింగ్‌ ఆఫ్‌ మహాత్మా
1999 – సమర్‌
2000 – హరి – భరి
2001 – జుబేదా
2005 – నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌-ది ఫర్‌ గాటేన్‌ హీరో
2008 – వెల్‌ కమ్‌ టు సజ్జన్‌ పూర్‌
2010 – వెల్‌ డన్‌ అబ్బా
2023 – ముజీబ్‌ – ది మేకింగ్‌ ఆఫ్‌ ఎ నేషన్‌
ఇన్ని సినిమాల్లో అగ్రభాగాన నిలబడిన చిత్రాలు అంకుర్‌, నిషాంత్‌, మంధన్‌, భూమిక, అనుగ్రహం.. ఆయన దర్శకత్వంలో వెలుగు చూసిన ప్రతి సినిమా వాస్తవికతకు అద్దం పట్టిన చిత్రమే! ప్రతి సినిమా అవార్డు కు అర్హమైనదే!
విశిష్టత గల అవార్డులు
అంకుర్‌ అనంతరం నిషాంత్‌, మంథన్‌, అరోహన్‌, సూరజ్‌ కా సత్యన్‌ మోడా, సమర్‌, జూబెదా వంటివి జాతీయ స్థాయిలో ఉత్తమ హిందీచిత్రాలుగా అవార్డులు అందుకున్నాయి. మంథన్‌ ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా కూడా అవార్డు పొందింది.
భూమిక, జునూన్‌, కలియుగ్‌ చిత్రాలు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు పొందాయి. హిందీ, తెలుగు భాషల్లో నిర్మించబడిన అనుగ్రహం (హిందీలో కొండూర) 1979 బెర్లిన్‌ ఇంటర్నే షనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఇండియన్‌ పనోరమా లో ప్రదర్శనకు ఎంపికయింది. మండి, సుస్మాన్‌ చిత్రాలు లండన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు అర్హత సాధించాయి. త్రికాల్‌ మూవీ ద్వారా శ్యాంబెనగల్‌ ఉత్తమ దర్శకుడు అవార్డును సాధించారు. సర్ధారీ బేగం ఉర్దూ భాషలో ఉత్తమ జాతీయ స్థాయి అవార్డును, ది మేకింగ్‌ ఆఫ్‌ మహాత్మా ఆంగ్లంలో ఉత్తమ జాతీయ స్థాయి అవార్డులను సాధించాయి. హరి – భరీ చిత్రం కుటుంబ సంక్షేమంపై ఉత్తమ చలనచిత్ర అవార్డును సాధించగా, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ – ఫర్‌ గాటెన్‌ హీరో చిత్రం జాతీయ సమగ్రత పై నర్గీస్‌ దత్‌ అవార్డును సొంతం చేసుకున్నాయి. చివరి చిత్రం ముజీబ్‌ – ది మేకింగ్‌ ఆఫ్‌ ఎ నేషన్‌ బంగ్లాదేశ్‌ ఫిల్మ్‌ డెవెలప్‌మెంట్‌ సహకారంతో నిర్మించ బడింది.
దూరదర్శన్‌ ధారావాహికలు
శ్యాం బెనగల్‌ దూరదర్శన్‌ కోసం సుమారు నాలుగు కార్యక్రమాలు రూపొందించారు. సత్యం శంకరమంచి రచించిన ‘అమరావతి కథలు’ను తెలుగు, హిందీ భాషల్లో రూపొందించగా, హిందీ భాషలో భారత్‌ ఏక్‌ భోజ్‌, కథాసాగర్‌, యాత్ర లను రూపొందించారు.
విభిన్న చిత్రాలు
సాధారణంగా శ్యాం బెనగల్‌ చిత్రాలు లింగ పక్షపాతం, గహహింస, సామాజిక దురభిమానాలు, మహిళలపై అఘాయిత్యాలు ఇత్యాది అంశాలను సజించేవి. మమ్మో, సర్దారీ బేగం, జుబేదా చిత్రాలు ముస్లిం మహిళల దుస్థితులను ప్రతిబింబించాయి.
తన మీద ఎవరి ప్రభావం పడకూడదని, ఏ దర్శకుని దగ్గరా శిష్యరికం చేయని శ్యాం బెనగల్‌ స్క్రిప్ట్‌ చాలా విభిన్నంగా ఉండేది. అందుకే మేధావుల మన్ననలు ఆయనకు దక్కాయి.
1974లో విడుదలైన మొదటి చిత్రం ‘అంకుర్‌’ లోనే తన శైలి ఇది అని చెప్పిన వ్యక్తి శ్యాం బెనగల్‌. ఈ చిత్రానికి ముందుగా శారద అనుకున్నారు. తర్వాత సూచిత్రాసేన్‌ కూడా వప్పుకోలేదు. ఈ ఇద్దరు గొప్ప నటీమణులు భాషకు డబ్బింగ్‌ విషయంలో వెనకడుగు వేస్తే, ఆ పాత్ర షబానా ఆజ్మీ పరమైంది. ఈ చిత్రం ఆమెకు చాలా మంచి పేరు తెచ్చి పెట్టింది. ఒక వ్యసనపరుడు అయిన వ్యక్తికి భార్యగా, వేరొకరి అవసరానికి ఉపయోగపడిన పాత్ర అది. అనంతనాగ్‌ హీరో. స్మితా పాటిల్‌, సుస్మితాసేన్‌, నసీరుద్దీన్‌ షా లు ప్రధాన పాత్రధారులుగా నటించిన ‘నిశాంత్‌’ కథా వస్తువు ఒక లైంగికదాడికి గురైన వివాహితకు సంబంధించినది. ఈ చిత్రం తెలంగాణాలోని భూదాన్‌ పోచంపల్లి లొకేషన్‌లో నిర్మాణం చేసారు.
కుల రాజకీయాలు గురించి ‘మంధన్‌’ చిత్రంలో అద్భుతంగా వివరించారు. ఈ చిత్రంలో స్మితా పాటిల్‌, గిరీష్‌ కర్నాడ్‌, నసీరుద్దీన్‌ షా లు నటించారు. స్మితా పాటిల్‌ దేవదాసిగా నటించిన ‘భూమిక’ కథ కూడా విభిన్నమైనదే. ఇక తెలుగులో శ్యాంబెనగాల్‌ దర్శకత్వం వహించిన ‘అనుగ్రహం’ లో వాణిశ్రీ కథానాయికగా నటించడం విశేషం. అసలు మేక్‌ అప్‌ లేకుండా ఆమె అద్భుతంగా నటించింది. 16 జూన్‌, 1978 న విడుదలైన ఈ చిత్రం కథ చాలామందికి నచ్చలేదు. ఒక నమ్మకానికి మనిషి లొంగిపోతే, అది అతని జీవితాన్ని పూర్తిగా ఆక్రమించు కుంటుంది అనేది కథా కాస్తువు హేతువాదానికి ఈ కథ వ్యతిరేకంగా ఉండటం వల్ల నెగెటివ్‌ ఫలితం వచ్చింది. ద్విభాషా చిత్రమైన ఈ అనుగ్రహం హిందీ భాషలో కొండూర పేరుతో విడుదల అయింది.
వారే తారాగణం
శ్యాం బెనగల్‌ చిత్రాల్లో సాధారణంగా కొద్దిమంది తారాగణం పలు చిత్రాల్లో వారే నటించడం యాదచ్చికం అయినా, ఆయన తీసే ఆర్ట్‌ ఫిలింస్‌ కు వారే సరియైన వారుగా ప్రేక్షకులు కూడా భావించారు. స్మితా పాటిల్‌, నసీరుద్దీన్‌ షా లు శ్యాం బెనగల్‌ ‘నిశాంత్‌’ చిత్రం ద్వారానే పరిచయం అయ్యారు. ఇంకా షబానా అజ్మీ, అనంత నాగ్‌, అమోల్‌ పాలేకర్‌, గిరీష్‌ కర్నాడ్‌, అమ్రిష్‌ పూరి.. ఇత్యాది తారలకు మంచి స్కూల్‌ మాష్టర్‌ శ్యాం బెనగల్‌.
జాతీయ ఖ్యాతి
శ్యాం బెనగల్‌ తన సినిమా జీవితంలో, బహు కొద్దిచిత్రాలకే దర్శకత్వం వహించినా అనితర సాధ్యమైన ఖ్యాతిని ఆర్జించారు. 2003లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం అందుకున్న ఈ దర్శకుడు మొత్తం 18 వరకు జాతీయ, ఫిలింఫేర్‌, నంది అవార్డులను తన చిత్రాలకు సాధించి పెట్టారు.
అందుకే శ్యాం బెనగల్‌ భారత చలనచిత్రాల్లో చెరిగిపోని కళా సంతకం. మూస చిత్రాలకు అతీతమైన చిత్రాలు నిర్మించిన ఆయన పేరు శాశ్వతం.. ఆయన కీర్తి అజరామరం.
పంతంగి శ్రీనివాసరావు
9182203351