ఈఆగష్టు 15న డెబ్బయి ఎనిమిదో స్వాతంత్య్రంలోకి అడుగుపెట్టాం. సమకాలిన ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే సాధించ వలసిన ప్రగతి ఎంతగానో ఉంది. స్వాతంత్రోద్యమ లక్ష్యాలైన వ్యవసాయరంగంలో స్వయం సమృద్ధి సాధించడం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం, శాస్త్ర సాం కేతిక రంగాలు, అందరికీ విద్యా, వైద్యం, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పనలో సాధించిన ప్రగతి ఏమిటి? లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడు కోవడంలో ఎదురవుతున్న సవాళ్లు మనకు నేర్పుతున్న పాఠమేంటి? ఆర్థిక, సామాజిక అసమానతలు చెబుతున్న వాస్తవలేంటి? ఈ కోణంలో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ప్రస్తుతం దేశానికి కాషాయికరణ ప్రమాదం పొంచివుంది. ఆరెస్సెస్-బీజేపీ విభజించు, పాలించు విధానంతో దేశం ఆందోళనకరంగా తయా రైంది. బ్రిటీష్ కబంధ హస్తాల నుండి దేశాన్ని విముక్తి చేసుకున్న ప్రజలు, ఇప్పుడు మతోన్మాదంపై పోరాడాల్సిన అనివార్యత ఏర్పడింది. జాతీయ లక్ష్యాల సాధన కృషి అందులో భాగమే.
స్వాతంత్రోద్యమంతో పాటే పెంపొందిన పైన పేర్కొనబడిన ఆకాంక్షలు సాధించడానికి, మొదటి దశాబ్ది కాలంలో భారత్, సోషలిస్టు రష్యా సహకారంతో బలమైన పునాదులు ఏర్పడ్డాయి. వ్యవ సాయానికి వెన్నెముకగా నిలిచే భారీ నీటిపారుదల ప్రాజెక్టులు బాక్ర-నంగల్ మొదలుకొని నాగార్జునసాగర్ వరకు అనేక సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగాయి. వేల ఎకరాల బీడు భూములు సాగులోకి వచ్చాయి. ఐకార్‌ను బలోపేతం చేయడంతో పాటు, రాష్ట్రస్థాయిలో అగ్రికల్చర్ యూనివర్సిటీల ఏర్పాటు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్‌లను ఏర్పాటు చేయడం,తద్వారా హరిత విప్లవం, ఆహార ఉత్పత్తుల స్వయం సమృద్ధికి దోహదం చేశాయి.
భిలాయి, బొకారో ఉక్కు కర్మాగారాలు సోవియట్ రష్యా సహ కారంతో నిర్మాణం జరిగింది. ఆ తర్వాతనే దుర్గాపూర్, రూర్కెలా ఉక్కు కర్మాగారాలకు బ్రిటిష్, జర్మనీలు సహకారం అందించాయి. స్టీల్ ఉత్పత్తితో పాటు సిమెంట్, విద్యుత్, రైల్వేల నిర్మాణం దేశ పారిశ్రామిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయి. ప్రజల్లో చిన్న మొ త్తాల పొదుపును (పోస్ట్ ఆఫీస్, ఎల్‌ఐసి, బ్యాంకింగ్) ప్రోత్స హించడం ద్వారా భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి కావలసిన పెట్టు బడులు ప్రజల నుండి పోగుచేయబడ్డాయి. 1991 నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాల అమలు ముందు వరకు వాటి ప్రయోజ నాలను ప్రజలు పొందారు. నీటి పారుదల ప్రాజెక్టుల వలన కొత్తగా వేల ఎకరాల భూములు సాగులోకి వచ్చాయి. గ్రామీణ ప్రాంతంలో కొనుగోలు శక్తి పెరిగింది. భూస్వాములతో పెట్టుబడిదారి వర్గం రాజీ పడకుండా భూ పంపిణీ చేసి ఉంటే… ప్రయోజనం మరింత విప్ల వాత్మకంగా ఉండేది. కానీ భారత పెట్టుబడుదారి వర్గ పాలకులు ఆ పని చేయలేదు. ప్రభుత్వ రంగ పరిశ్రమలు వేలాది మందికి ఉపాధిని కల్పించాయి. గౌరవప్రదంగా జీవించేందుకు అవసర మైన వేతనాలు, సౌకర్యాలు, వివిధ సామాజిక తరగతులకు రిజర్వేషన్లు కల్పించ బడ్డాయి.వాటి ఉత్పత్తులు, సేవలు ప్రజలకు చౌకధరలకే అందించబడ్డాయి.
‘మేడిన్ ఇండియా’ను..మేకిన్ ఇండియా’గా మార్చారు!
నాడు ‘మేడ్ ఇన్ ఇండియా’ను సాధించేందుకు ఆధునిక విద్యాలయాలు, యూనివర్సిటీలు, ఐఐటీలు స్థాపనకు పునాది పడ్డాయి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్‌కు ప్రాధాన్యత సంతరించు కుంది. గుడులకంటే బడులకు ప్రాధాన్యత ఇవ్వబడింది. ప్రజా రోగ్యం, వైద్యం విషయంలో అనేక పరిమితులు ఉన్నప్పటికీ ప్రభుత్వం చేతనే ప్రధానంగా అందించబడింది. ప్రజలకు తక్కువ ధరకే మందులందించే లక్ష్యంతో ఏర్పాటు చేయబడిందే ఐడిపిఎల్. పాలకులు దీన్ని ఉద్దేశ పూర్వకంగా మూసివేశారు. నేడు రెడ్డి ల్యాబ్ లాంటి అనేక ఫార్మా కంపెనీలు ప్రజల రక్తాన్ని డబ్బు రూపంలో జలగల్లా పీలుస్తు న్నాయి. ప్రజల స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో వచ్చింది మేడిన్ ఇండియా అయితే, స్వదేశీ, విదేశీ పెట్ట బడిదారుల ప్రయోజనాల కోసం, నేటి పాలకులు అవలంబిస్తున్నది ‘మేకిన్ ఇండియా’. స్వతహాగా టెక్నాలజీని అభివృద్ధి చేసి, స్వయం సమృద్ధి, దేశ స్వావలంబన, మెరుగైన జీతభత్యాలు, పర్మనెంట్ ఉద్యోగత కల్పించడం మేడిన్ ఇండియా ఉత్పత్తి లక్ష్యం. కాగా, విదేశీ టెక్నాలజీ, భారతీయ నిరుద్యోగులను కట్టు బానిసలుగా మార్చి అతి తక్కువ వేతనాలతో బహుళ జాతి సంస్థల ఉత్పత్తు లను దేశంలో ఉత్పత్తి చేయడమే మేకిన్ ఇండియా ఉద్దేశం. ఆధు నిక రఫేల్ యుద్ధ విమానాలను స్వయంగా తయారు చేసు కోవ డం కాదు,అధిక రేట్లకు దిగుమతి చేసుకోవడమే గొప్ప. సెమీ కండ క్టర్లు, చిప్ డిజైన్లు అభివృద్ధి చేసుకోవడం కాదు, సెల్ఫోన్ల అసెంబ్లీ దేశంలో చేస్తే సరిపోతుందనేది నేటి పాలకవర్గాల విధానం.
నాటి నుంచి నేటి వరకు అవే విధానాలు!
ఒక దేశ అభివృద్ధి ఆ దేశంలో లభించే సహజ వనరులు, భౌగోళిక స్థితిగతులు, వాతావరణం, శీతోష్ణస్థితి, మానవ వనరుల నైపుణ్యత, ఉత్పత్తిలో వినియోగించే పనిముట్ల స్థాయిపై ఆధారపడి ఉంటాయి. మన దేశమనే గర్వంకాదు కానీ, ప్రపంచంలో ఏ దేశానికి లేనంత సహజ వనరులు, భౌగోళిక, వాతావరణ పరిస్థితులు, మానవవనరులు శీఘ్రగతిన భారతదేశం అభివృద్ధి చెందడానికి దోహదం చేసే విధంగా ఉన్నాయి. కానీ, చిత్తశుద్ధి లేని పరిపాలన వ్యవస్థ, పెట్టుబడిదారి, భూస్వామ్య వర్గాల ప్రయోజనకరమైన విధానాలే ఈరోజు అనేక రంగాల్లో దేశం సాధించాల్సిన ప్రగతికి ఎంతో దూరంగా ఉండిపోవడానికి కారణమైంది. స్వాతంత్య్రం వచ్చిన నాటితో పోల్చుకుంటే ఎంతోకొంత అభివృద్ధి చెందింది. కానీ దానికి కొలమానం గతంతో పోల్చు కోవడం కాదు, సమకాలీన ప్రపంచంలో మనమెక్కడున్నామనేదే ఇప్పుడు వేసు కోవాల్సిన ప్రశ్న? నాటి స్వదేశీ ఉద్యమం అప్పుడే పుట్టి నడక నేర్చు కుంటున్న భారత పెట్టుబడిదారుల అభివృద్ధికి బాగా తోడ్పడింది. బాంబే ప్లాన్ 1944 మౌలిక రంగంలో అభివృద్ధికి పెట్టుబడులు ప్రభుత్వాని(ప్రజలవి)వి. వాటిని ఉపయోగించుకొని, నిరంతర వినిమయ వస్తుత్ప త్తుల పరిశ్రమలు పెట్టుబడిదారులవి (ఉదా: బట్టలు, సబ్బులు, టూత్ పేస్టులు). తక్కువ కాలంలో ఎక్కువ టర్నో వర్లు, ఎక్కువ లాభాలు భారత పెట్టుబడిదారులకు అభయ హస్తం అందించింది. రాజీవ్ కాలంలో అడుగులుపడి పీవీ నర్సింహారావు, మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో తెరలేసిన నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు మోడీ, షా నేతృత్వoలో ప్రభుత్వరంగ సంస్థలు, సహజ వనరులు లీజుకు లేదా నామమాత్రం ధరలకు బడా కార్పొరేట్లకు అప్పగిస్తు ప్రజల ఆస్తులను లూటీ చేస్తున్నారు.
ప్రజల దృష్టిని పక్కదారి పట్టిస్తున్న పాలకులు
స్వాతంత్రోద్యమకాలంలోనే మూడు ప్రధాన స్రవంతులు ఏర్పడ్డాయి. ఒకటి: పాశ్చాత్య ఆధునిక పెట్టుబడిదారీ విధాన అభి వృద్ధి పంతాన్ని ఎంచుకున్న జాతీయ బూర్జువా వర్గం. దానికి నాయ కత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ. రెండు: వామపక్షం, రష్యన్ విప్లవ స్ఫూర్తి, మార్క్సిజం, లెనినిజం ఆశయ సాధనంతో కార్మికవర్గ రాజ్యం, సోషలిస్టు వ్యవస్థ ఏర్పాటు చేయడం. మూడు: భారతదేశ ప్రాచీన వ్యవస్థ, ధర్మశాస్త్రం, పుక్కిటి పురాణాలు, మనుధర్మ శాస్త్రం ప్రబో ధంగా ఆరెస్సెస్ హిందుత్వ శక్తులు. ఈ మూడు ప్రధాన సవం త్రులలో నేడు మూడో ధోరణి కలవారు గత పదకొండేండ్లుగా దేశంలో రాజ్యాధికారం చేస్తున్నారు. వీరి నీతి బ్రిటిష్ నీతి. వీరి లక్ష్యం సహజ వనరులను లూటీ చేసి స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకు దోచిపెట్టడం. స్వాతంత్య్ర ఉద్యమం నుండి ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకు నాడు బ్రిటిష్ పాలకులు విభజించు, పాలించు లక్ష్యంతో హిందూ, ముస్లిం మత ఘర్షణలు సృష్టించారు. బెంగాల్ ను మత ప్రాతిపదికన తూర్పు, పశ్చిమ బెంగాల్‌గా విడదీయడానికి యత్నించారు. అనేక సందర్భాలలో మత వైషమ్యాలు రగిలించారు. నేటి బీజేపీ పాలకులు బ్యాంకులు, రైల్వేలు, ఎల్‌ఐసి, సింగరేణి, బొగ్గుగనులు, విద్యుత్తు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, జాతీయ రహ దారులు, స్పెక్ట్రం, విద్య, వైద్యం అన్నింటినీ లూటీచేసే విధంగా బడా పెట్టుబడిదారులకు ప్రయోజనం చేసే విధానాలు అవలంభిస్తు న్నారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రతి అంశాన్ని, సందర్భాన్ని మతానికి ముడిపెడుతూ మత ఘర్షణలను ప్రోత్సహిస్తున్నారు, పెం పొందిస్తున్నారు. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో లౌకిక ప్రజాస్వామ్య రక్షణ, దేశ సహజ వనరుల రక్షణ, ప్రజా వనరుల దోపిడీ నిర్మూలన, ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ, విద్యా, వైద్యం ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక, కర్షక, ఉద్యోగ, మేధావివర్గం మరో స్వాతంత్య్ర పోరాటానికి నడుం బిగించాల్సిన అవసరం ఉన్నది.
గీట్ల ముకుందరెడ్డి
9490098857