న్యూఢిల్లీ : భారత్, పాకిస్తాన్ తమ దేశాల్లోని అణు స్థావరాల జాబితాను పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా పాటించాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒక దేశంలోని అణు కేంద్రాలపై మరో దేశం దాడి చేయకూడదనే ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఈ జాబితాను అందజేసుకున్నాయి. ఇరుదేశాలు ఏకకాలంలో ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ”దౌత్యమార్గాల ద్వారా భారత్, పాకిస్తాన తమ అణు స్థావరాల జాబితాను పంచుకున్నాయి. ఏకకాలంలో ఈ ప్రక్రియ పూర్తయ్యింది. కాశ్మీర్ సమస్యతో పాటు ఉగ్రవాదంపై కూడా రెండు దేశాల మధ్య జాబితా మార్పిడి జరిగింది. ఈ జాబితాను ఇలా ఇచ్చిపుచ్చుకోవడం ఇది వరుసగా 34వ సారి” విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.1988 డిసెంబర్ 31న అణు స్థావరాలపై దాడులకు వ్యతిరేకంగా ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ వివరాలను పరస్పరం అందజేసుకుంటున్నాయి. ఒప్పందం ఆర్టికల్-2 నిబంధన ప్రకారం ప్రతి సంవత్సరం అణు స్థావరాల సమాచారం అందజేసుకోవాలి. దీని ప్రకారం 1992 జనవరి 1 నుంచి ప్రతి సంవత్సరం అదే రోజు అణు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాయి.