భారత్‌, ఆసీస్‌ సూపర్‌8 సవాల్‌

భారత్‌, ఆసీస్‌ సూపర్‌8 సవాల్‌– ఒకే గ్రూప్‌లో నిలిచిన అగ్ర జట్లు
న్యూయార్క్‌ : ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ రసవత్తరంగా మారుతుంది. గ్రూప్‌ దశ మ్యాచుల్లోనే ఊహాకందని ట్విస్ట్‌లు అభిమానులను షాక్‌కు గురి చేయగా.. సూపర్‌8లోనూ అంతకుమించిన పోటీ ఉండనుంది. నాలుగు గ్రూప్‌ల నుంచి ఇప్పటివరకు ఆరు జట్లు సూపర్‌8కు చేరుకున్నాయి. గ్రూప్‌-బి, గ్రూప్‌-డి నుంచి రెండో బెర్త్‌ ఖరారు కావాల్సి ఉంది. ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్‌ ఆ బెర్త్‌లను అందుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. జూన్‌ 17 వరకు గ్రూప్‌ దశ మ్యాచులు కొనసాగనుండగా.. జూన్‌ 19 నుంచి సిసలైన మజా అందించే సూపర్‌ 8 మ్యాచులు షరూ కానున్నాయి. ప్రీ టోర్నమెంట్‌ సీడింగ్‌తో ఏ జట్టు ఏ గ్రూప్‌లో ఉండనుందో ఇప్పటికే తేలిపోయింది.
గ్రూప్‌-1లో ఏ1, బీ2, సీ1, డీ2 ఉండనుండగా.. గ్రూప్‌-2లో ఏ2, బీ1, సీ2, డీ1 ఆడనున్నాయి. గ్రూప్‌-ఏలో భారత్‌కు ఏ1 సీడింగ్‌ లభించగా.. ఆస్ట్రేలియాకు గ్రూప్‌-బిలో బీ2 సీడింగ్‌ దక్కింది. దీంతో గ్రూప్‌-1లో భారత్‌, ఆస్ట్రేలియాతో పాటు అఫ్గనిస్థాన్‌ (సీ1) ఉండనుంది. గ్రూప్‌-డి నుంచి డీ2గా బంగ్లాదేశ్‌ అర్హత సాధించే అవకాశం ఉంది. భారత్‌ సూపర్‌8 వేటను అఫ్గనిస్థాన్‌తో మ్యాచ్‌తో మొదలెట్టనుంది. జూన్‌ 20న బ్రిడ్జ్‌టౌన్‌లో ఈ మ్యాచ్‌ షెడ్యూల్‌ చేశారు. జూన్‌ 22న బంగ్లాదేశ్‌ (అధికారికం కాదు)తో నార్త్‌సౌండ్‌లో ఆడనుంది. కీలక ఆస్ట్రేలియాతో సమరం జూన్‌ 24న గ్రాస్‌ఐలెట్‌లో జరుగనుంది. సూపర్‌8లో మూడు మ్యాచులను భారత్‌ ఆరు రోజుల వ్యవధిలో ఆడనుంది. గ్రూప్‌-1లో టాప్‌-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. జూన్‌ 27న సెమీఫైనల్స్‌.. జూన్‌ 29న ఫైనల్‌ జరుగనుంది.