నాలుగేండ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌

నాలుగేండ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌– 5 ట్రిలియన్‌ డాలర్లకు చేరొచ్చు
– 2047 నాటికి అభివృద్థి చెందిన దేశం
– ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడి
గాంధీనగర్‌ : నాలుగేండ్లలో ప్రపంచంలోనే భారత ఆర్థిక వ్యవస్థ మూడో అతిపెద్దదిగా అవతరించనుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. 2027-28 ఆర్థిక సంవత్సరం నాటికి భారత జీడీపీ ఐదు ట్రిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.415 లక్షల కోట్లు)గా ఉండొచ్చని అంచనా వేశారు. బుధవారం గాంధీనగర్‌లో జరిగిన వైబ్రెంట్‌ గుజరాత్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో మంత్రి సీతారామన్‌ మాట్లాడుతూ.. భారత్‌ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం భారతదేశం దాదాపు 3.4 ట్రిలియన్ల డాలర్ల (దాదాపు రూ.282 లక్షల కోట్లు) జీడీపీతో ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందన్నారు. అమెరికా, చైనా, జపాన్‌, జర్మనీలు భారత్‌ కన్నా ముందున్నాయన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం వృద్థి రేటు నమోదయ్యే అవకాశాలున్నాయన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.2 శాతం పెరిగిందన్నారు. దేశంలో 2014 నాటికి 15 కోట్ల బ్యాంక్‌ ఖాతాలు ఉండగా.. ప్రస్తుతం 50 కోట్ల మందికి పైగా బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్నారన్నారు. గడిచిన 23 ఏండ్లలో భారత్‌కు 919 బిలియన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయన్నారు. ఈ ఎఫ్‌డీఐలో 65శాతం అంటే 595 బిలియన్‌ డాలర్లు గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల్లో వచ్చాయన్నారు. తయారీలోనే కాకుండా సర్వీస్‌ సెక్టార్‌లోనూ ఎఫ్‌డీఐలు వస్తున్నాయన్నారు. 2047 నాటికి భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 100 ఏండ్లు పూర్తికానున్న అమృతకల్‌ సందర్భంగా కొత్త పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కోవిడ్‌ అనంతర సవాళ్లను భారతదేశ ప్రజలు ఎదుర్కొన్నారన్నారు. 2047 నాటికి దేశ జీడీపీ 30 ట్రిలియన్‌ డాలర్లకు చేరి.. అభివద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారనుందన్నారు.