– సెంచరీతో రాణించిన కెప్టెన్ మహ్మద్ అమన్
– జపాన్‌పై 211 పరుగుల తేడాతో ఘన విజయం
షారాజ: అండర్-19 ఆసియా కప్‌లో భారత్ బోణీ కొట్టింది. జపాన్‌పై యువ భారత్ 211 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారీ లక్ష్యఛేదనలో జపాన్ 50 ఓవర్లలో 128/8కి పరిమితమైంది. దీంతో భారత్‌కు భారీ విజయం సొంతమైంది. ఓపెనర్ హ్యూగో కెల్లీ (50: 111 బంతుల్లో) టాప్ స్కోరర్. ఛార్లెస్ హింజ్ (35) రాణించాడు. మిగతా బ్యాటర్లెవరూ పెద్ద స్కోర్లు చేయలేదు. భారత బౌలర్లలో హార్దిక్ రాజ్, కార్తికేయ, చేతన్ శర్మ తలో రెండు వికెట్లు తీయగా.. యుధజిత్ ఒక వికెట్ పడగొట్టాడు.
అదరగొట్టిన అమన్ :
భారత కెప్టెన్ మహ్మద్ అమన్ (122 : 118 బంతుల్లో 7 ఫోర్లు) శతకం బాదడంతో జట్టుకు భారీ స్కోరు దక్కింది. ఓపెనర్ ఆయుష్ మాత్రే (54 : 29 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. వైభవ్ సూర్యవంశీ (23 : 23 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. కార్తికేయ (57 : 50 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకంతో మెరిశాడు. చివర్లో హార్దిక్ రాజ్ (25 : 12 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. యువ భారత్ తన తర్వాతి మ్యాచ్ డిసెంబరు 4న యుఎఇతో ఆడనుంది.