వ్యవసాయ రంగంలో.. భారత్ గణనీయ పురోగతి సాధించింది

– సింజెంటా గ్లోబల్ సీఈవో జెఫ్ రోవ్

నవతెలంగాణ హైదరాబాద్: భారతదేశం వ్యవసాయ రంగంలో గణనీయమైన పురోగతి సాధించిందని సింజెంటా గ్లోబల్ సీఈవో జెఫ్ రోవ్ తెలిపారు. సింజెంటా ఆధ్వర్యంలో లక్ష మంది గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చేందుకు తలపెట్టిన ప్రతిష్ఠాత్మక ఐ రైజ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‌భారతదేశంలో గ్రామీణ శ్రేయస్సు ఒక భద్రతా వలయంగా మారుతుందని చెప్పారు. వ్యవసాయంలో గ్రామీణ యువతకు శిక్షణ ఇవ్వడం, నిమగ్నమవ్వడంపై దృష్టి సారిస్తుందన్నారు. గ్రామాల నుంచి యువత వలసలను అరికట్టడానికి, నైపుణ్యం కలిగిన వ్యవసాయ సిబ్బంది తగ్గిపోతున్న సవాలును పరిష్కరించడానికి ఇది రూపొందించబడిందని తెలిపారు. యువతను శక్తివంతం చేయడానికి ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమం ఇందుకు ఊతమిస్తున్నాయన్నారు. ‘స్టార్ట్ – అప్ ఇండియా నుంచి స్టాండ్ అప్ ఇండియా, స్కిల్ ఇండియా, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ మిషన్ కొత్త మార్గాలను అందించడంపై దృష్టి సారిస్తున్నాయని చెప్పారు. గ్రామీణ యువతకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించడం ద్వారా వ్యవసాయ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ఈ అజెండాకు మద్దతు ఇవ్వడానికి రూపొందించబడిందని తెలిపారు.
‌ఈ సందర్భంగా సింజెంటా ఇండియా కంట్రీ హెడ్, మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ కుమార్ మాట్లాడుతూ భారతదేశంలో యువ జనాభా అధికంగా ఉందన్నారు. ప్రపంచ పవర్‌హౌస్‌గా, నైపుణ్య కేంద్రంగా మార్చడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని తెలిపారు. 35 ఏళ్లలోపు జనాభాలో 65 శాతం ఉన్న ఈ యువ శ్రామిక శక్తి దేశ అభివృద్ధి, ఆర్థిక వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లగలదన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామీణ యువతను వ్యవసాయంలో నిమగ్నం చేసేందుకు, స్థిరమైన ఆదాయాన్ని ఆర్జించే అవకాశాలను అన్వేషించడానికి తగిన నైపుణ్యాలను అందించడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో 35 ఏళ్లలోపు గ్రామీణ యువతకు అవకాశం ఉందన్నారు. కనీసం 10వ తరగతి విద్యార్హత ఉండాలన్నారు. వ్యవసాయానికి సంబంధించి సమగ్రమైన 30 రోజుల తరగతి గది శిక్షణ, రెండు నెలల ఇంటర్న్‌షిప్‌ను ఉంటుందన్నారు. తరువాత, అధునాతన శిక్షణను పొందవచ్చన్నారు. వ్యవసాయ కార్యకలాపాలలో ఉపాధిని పొందవచ్చన్నారు. శిక్షణ, మార్గదర్శకత్వం ద్వారా వ్యవసాయంలో యువతకు అవగాహన కల్పించడం, ఉపాధి, వ్యవస్థాపక అవకాశాల ద్వారా నిమగ్నం చేయడం, ఆదాయాన్ని పెంచడం అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డీఎంఐ డాక్టర్ సహదేవ్ సింగ్, డైరెక్టర్ ఎక్స్‌టెన్షన్ డాక్టర్ శైలేష్ మిశ్రా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్‌సి అగర్వాల్, పీఏయూ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ డాక్టర్ టీఎస్ రియర్, వసంత్ రావ్ నాయక్ (మరాఠ్వాడా కృషి విశ్వవిద్యాలయ) వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఇంద్ర మణి, సింజెంటా ఫౌండేషన్ ఇండియా కంట్రీ డైరెక్టర్ రాజేంద్ర జోగ్ తదితరులు పాల్గొన్నారు.