పార్లమెంటులో కుంభస్థలం కొట్టిన ‘ఇండియా’

'India' hit Kumbhasthalam in Parliamentనరేంద్రమోడీ మూడోసారి ప్రధాని అయ్యారనీ, ఏది ఏమైనా చివరకు బీజేపీ మాటకు తిరుగులేదనీ వాదించేవారికి పార్లమెంటు తొలి సమావేశాలే పెద్ద సమాధాన మిచ్చాయి.మారిన బలాబలాల పొందికతో లౌకిక ప్రజాస్వామిక శక్తులు నిలదొక్కుకుంటున్న తీరుకు అద్దం పట్టాయి.ఇప్పటికీ మతతత్వ నిరంకుశ రాజకీయాల సవాలు తొలగిపోయిం దని కాదు గాని ప్రతిఘటించే ప్రతిపక్షశక్తులు కూడా ప్రభావశీలంగా అవతరించాయనే వాస్తవం అందరూ అంగీకరించక తప్పలేదు. గతంలో కేవలం అవహేళనలకు గురవుతూ వచ్చిన కాంగ్రెస్‌ నాయకుడు ప్రస్తుత ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ తనదైన శైలిలో చేసిన ప్రసంగంపై చర్చ ఇందుకు సంకేతమైంది.ఆ ప్రసంగంలో ఇతరాంశాలు అలా వుంచి హిందూత్వకు మోడీత్వను జోడు చేసి బీజేపీ సాగిస్తున్న మాయ నాటకం బదాబదలైంది. మొదటి సమావేశాల్లో, మొదటి ప్రసంగంలోనే నేరుగా ఈ మత రాజకీయాలపై చర్చ మొదలవుతుందని రాజకీయ పరిశీలకులు కూడా ఊహించలేదని చెప్పాలి. ప్రజల తీర్పులోనే అంతర్లీనంగా మత రాజకీయాలు అసహనాలపై విముఖత స్పష్టమైంది గనక రాహుల్‌ వాటిని ప్రస్తావించడంపై రభస చేయాలనుకున్న బీజేపీ ఎత్తుగడలు కూడా ఫలించలేదు. కొన్ని పార్టీలు తమ అస్తిత్వం కోసం బీజేపీతో చేతులు కలిపినా, రకరకాల కారణాలతో బడా మీడియా మోడీకే జై కొట్టినా ఈ రాజకీయాల వల్ల ముప్పును ప్రజలు అర్థం చేసుకున్నారు గనకే ఎన్నికల్లో మెజార్టీ నిరాకరించారు. ఆ కారణంగానే సభలో వచ్చిన విమర్శలను మతకోణంలోకి మళ్లించే దుస్సాహసం బీజేపీ చేయలేకపోయింది. కొంతమంది నాయకులు వరుసగా ట్వీట్లు పెట్టి ఆ ప్రయత్నం చేసినా ఫలితం రాలేదు. దాంతో బడా మీడియా కూడా వెనక్కు తగ్గింది. లేకపోతే ఈ దేశంలో మరో విధమైన చర్చ జరిగివుండేదనడంలో సందేహం లేదు. కీలక రాజకీయ కథనం(నారేటివ్‌) మారిందనడానికి ఇదే నిదర్శనం. అయితే అదే సమయంలో మతభావాలను రెచ్చగొట్టే శక్తులను తక్కువ అంచనా వేయడం కూడా పొరబాట వుతుంది. ఎందుకంటే తర్కంతో, సత్యంతో నిమిత్తం లేని మోసపూరిత రాజకీయం వారిది. ఇలా అన్నారట, అలా చేశారట, ఇదే జరిగిందట ఇలాంటి ప్రచారాలను తప్పుడు పద్ధతిలో ముందుకు తెచ్చి దావానలంలా వ్యాప్తి చేసే ముప్పు ఎప్పుడూ పొంచి వుంటుంది. పార్లమెంటు సాక్షిగా ప్రధాని మోడీ చేసిన విఫలయత్నం అదే. రాజ్యసభ చైర్మన్‌ ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌ మరింత బాహాటంగా ఆ పని చేయడం కూడా గమనిం చవచ్చు. దక్షిణ భారతంలో బీజేపీకి అంత బలం లేదు గనక మతతత్వ రాజకీయాలను ఎదుర్కొవడం పెద్ద సవాలు కాదన్నట్టు కొందరు మాట్లాడుతుంటారు. కాని ఒకప్పుడు ఉత్తరాదిలో కాంగ్రెస్‌ బలహీనపడినప్పుడు దక్షిణాది సీట్లు ఆదుకున్నట్టే ఇప్పుడు బీజేపీ కూడా ఈ సీట్లతోనే అధికారం నిలబెట్టుకోగలిగిందని గుర్తు చేసుకుంటే ఇక్కడా ఆ సవాలు తీవ్రంగానే వుందని తెలుస్తుంది.కనుకనే సభలోపలా, వెలుపలా ఉత్తర దక్షిణా లతో నిమిత్తంలేకుండా మత రాజకీయాలను అందులోనూ హిందూత్వ పేరుతో దేశంలోని పెద్ద మతానుయాయులను పక్కదోవపట్టించే కుటిల రాజకీయా లను నిశితంగా ఎదుర్కొవడం నిరంతర కర్తవ్యంగానే వుంటుంది. పార్లమెంటులో జరిగిందదే. హిందూత్వ, హిందూ మతం ఒకటి కాదనేది ఈ చర్చలో కీలక సారాంశం.
రెండూ ఒకటి కాదు
మతాల పుట్టుక, పరిణామం చర్చ సుదీర్ఘమైంది. ఇక్కడ రాజకీయ కోణం మాత్రం చూద్దాం. హిందూమతం ప్రాథమికంగా అహింసకూ, సత్యానికి ప్రతీక అనేది రాహుల్‌గాంధీ లేవనెత్తిన వాదన. మీరు ప్రచారం చేసే ద్వేషం, అసహనం హిందూ మత స్వభావానికే విరుద్దమని చెప్పడానికి ప్రయత్నించారు. తమను తాము హిందువులు గా చెప్పుకునేవారు ద్వేషం పెంచుతున్నారని ఆయన అన్నది బీజేపీ,ఆరెస్సెస్‌ గురించి అని అందరికీ తెలుసు. అన్ని మతాలు కూడా అహింస వద్దనే చెబుతాయంటూ ఆయన సిక్కు,ఇస్లాం,క్రెస్తవ మతాలను ప్రస్తావించారు. ఈశ్వరుడు త్రిశూలం ధరించడంగాక వెనక భాగంలో వుంటుందని చెప్పారు. ఇందుకోసం ఒక చిత్రాన్ని ప్రదర్శించారు.ఈ విధంగా చిత్రాలు, ప్లకార్డులు సభలో చూపడం నిబంధన లకు విరుద్ధమని స్పీకర్‌ ఓం బిర్లా అభ్యంతరం పెట్టారు. దాంతో రాహుల్‌గాంధీ శివ్‌జీ చిత్రం చూపకూడదా? అని ఎదురు ప్రశ్నవేయడంతో స్పీకర్‌ ఇరకాటంలో పడిపో యారు. చూపకూడదని చెబితే బీజేపీ రాజకీయాలకు కష్టం. అదొక్కటి చూపి ఇతర మతాలవి చూపకూడదని చెప్పడం కుదరదు.ఈ చిక్కుముడి నుంచి బయట పడటానికే మోడీ దేశంలో వున్న కోట్లాది మంది హిందువు లను ఆవమానించారనే పల్లవితో సభను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో బీజేపీ సభ్యులు తప్ప ఇతరులు గొంతు కలిపే అవకాశం లేనట్టే కనిపించింది.
సభలో ఎన్డీయేతో ఇంచుమించు ఢ కొట్టగల బలం సంపాదించుకున్న ఇండియా వేదిక సభ్యులు కూడా వెనక్కు తగ్గ కుండా తలపడ్డారు. ప్రతిపక్షం పీకనొక్కేసి ఇష్టాను సారం సభలో విద్వేష ప్రసంగాలు సాగించిన గత పరిస్థితికి ఇది పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపించింది. బీజేపీ- అరెస్సెస్‌లను రాజకీయంగా విమర్శిస్తే మొత్తం హిందూ సమాజాన్ని అన్నట్టు కాదనేది మొదటి రోజునే గట్టిగా చర్చ జరగడం విశేషం. ఆ తప్పు వాదనే ఆరెస్సెస్‌,సంఫ్‌ు పరివార్‌ ఆయువు పట్టు. ఇతర మతాల్లా హిందూమతం మిలిటెంటు మతం కాదనేది వారి ఫిర్యాదు. ఆ విధంగానేే గోల్వాల్కర్‌, సావర్కార్‌ వంటివారు హిందూత్వ సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. సావర్కార్‌ ప్రయోగించిన హిందూత్వనుా ఆలస్యంగానైనా నేరుగా బీజేపీనెత్తిన ఎత్తుకుంది. వివేకానందుడు, అరవిందుడు వంటివారెవరూ ఈ పదాన్ని గానీ, ఈ వాదనలను గానీ సమర్థించిన దాఖలాలు లేవు. మోడీ నాయకత్వంలో మొదట గుజరాత్‌ మారణకాండ తర్వాత వరస విజయాలు సాధించిన బీజేపీ కార్పొరేట్‌ ఇండియా మద్దతుతో ఆయన్ను ప్రధానిని చేసింది గనక హిందూత్వ ఆరెస్సెస్‌ తెరచాటు నుంచి సూటిగా బయటకొచ్చి దిశానిర్దేశం మొదలుపెట్టింది.
వైసీపీ, టీడీపీ, బీఆర్‌ఎస్‌ వంటిపార్టీల నాయకులు, కొన్నిసార్లు దిగ్విజరు సింగ్‌ వంటి కాంగ్రెస్‌ నేతలు కూడా హిందూత్వ అనే మాటను రాజకీయ ప్రయోగంగా వాడటం చూశాం. బడా మీడియా కూడా దానికి కారణమైంది. ఇప్పుడా వైరుధ్యం ప్రహసనం పార్లమెంటు సాక్షిగా బద్దలు కావడం స్వాగతించదగిన పరిణామం. కనీసం విద్యాధికులు తమను తాము లౌకిక వాదులుగా పరిగణించుకునే వారెవరైనా దీన్ని హర్షిస్తారని ఆశించాలి. కాని రాజ్యసభలో ఇందుకు పూర్తి భిన్నమైన మాటలు విన్నాం, స్పీకర్‌ బిర్లాకు వున్నపాటి సంకోచం లేకుండా ఛైౖర్మన్‌ జగదీప్‌ ధన్‌కర్‌ వ్యవహరించడమే ఇందుకు కారణం. రాజ్యాంగ సైద్ధాంతిక కోణాల్లో చూస్తే రాజ్యసభలో సంఘర్షణ తీవ్రత మీడియాలో అంతగా ప్రతిబింబించలేదంటే ఛైర్మన్‌ వైఖరి ఒక కారణం. అసలే స్వంత బలంలేని ఆ సభలో పరిస్థితిని ప్రచారంలోకి రానివ్వకూడదనే బీజేపీ వ్యూహం రెండవ కారణం. మతతత్వం, నిరంకుశత్వం కార్పొరేట్‌ ప్రయోజనాలను కలబోసిన బీజేపీపై విమర్శలకు రాజకీయ సమాధానం ఇవ్వకుండా కాంగ్రెస్‌పైనా, గాంధీ కుటుంబంపైనా దాడితో సరిపెట్టడం ఆ వ్యూహంలో భాగమే. రాహుల్‌వి పిల్లచేష్టలంటూ తీసిపారేసేందుకు మోడీ చేసిన ప్రయత్నం అలాంటిదే. గతంలోవలె అది పనిచేయక పోవడమే ఈసారి ప్రత్యేకత.అసలు రాహుల్‌గాంధీ మాట్లాడుతుంటే అడ్డుకోవడానికి మోడీ లేవాల్సిరావడమే వింత. మోడీ జీవ పదార్థం కాదు, పరమాత్మ నేరుగా మోడీ ఆత్మతో మాట్లాడతారని ఎద్దేవా చేసే పరిస్థితి వస్తుందని గతంలో ఎవరూ అనుకోలేదు. ఇదేదో మోడీ, రాహుల్‌ వ్యక్తిగత స్పర్థ అన్నట్టు చిత్రించే రాతలు కూడా కొన్ని మీడియాలో వచ్చాయి. కానీ అవేవీ కూడా నిలబడలేదు. సభలో వామపక్ష సభ్యులు,సమాజ్‌వాది, తృణమూల్‌ పార్టీల ఎంపీలు కూడా బీజేపీని తీవ్రంగా నిలవరించగలిగారు.
ఏకలవ్య ఛైర్మన్‌ విపరీతాలు
రాజ్యసభలోనూ మణిపూర్‌ మంటలు, నీట్‌ కుంభకోణం వంటి అంశాలపై చర్చ కోరిన ప్రతిపక్షానికి అవకాశం నిరాకరించడమే గాక పూర్తిస్థాయిలో మోడీ కీర్తనకు ఛైైర్మన్‌ జగదీప్‌ ధన్‌కర్‌ సిద్ధమయ్యారు. మొదట చర్చను ప్రారంభించిన ఖర్గే నీట్‌ కల్లోలంపై మాట్లాడుతూ అన్ని వ్యవస్థలను ఒక సంస్థ గుప్పిట్లో పెట్టుకున్నదని, ఆరెస్సెస్‌-బీజేపీ కలిసి వాటిని నాశనం చేశాయని విమర్శించినపుడు కూడా ఛైైర్మన్‌ రంగంలోకి దిగారు. ‘ఏదైనా ఒక సంస్థలో వుండటం నేరమా? ఆరెస్సెస్‌ దేశం కోసం పనిచేసే సంస్థ. దానికి అంతర్జాతీయంగా ప్రతిష్ట వుంది’ అని కీర్తించడంతో సభలో నిరసనలు మార్మోగాయి. రెండు రోజుల తర్వాత అదే ధన్‌కర్‌ ఆ సంస్థపై తన భక్తి ప్రతిపత్తిని మరింత బాహాటంగా చెప్పుకున్నారు. సభా నాయకుడుగా నూతనంగా నియమితుడైన జేపీ నడ్డా మాట్లాడుతుంటే ఛైర్మన్‌ తన భక్తిని ఆపుకోలేక మధ్యలో జోక్యం చేసుకున్నారు. ‘నడ్డాజీ మీకన్నా పాతికేళ్ల ముందే, పాతికేళ్ల నుంచి నేను ఆరెస్సెస్‌ ఏకలవ్య శిష్యుడిగా వున్నాను’ అని ప్రకటించారు. కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చాక తాను ఆ వైపు వెళ్లానని, అప్పటివరకూ ఆలస్యం జరిగినందుకు విచారించానని, ఆరెస్సెస్‌ నాయకులు తనకు రుషుతుల్యుల్లా కనిపిస్తారని కూడా గొప్పగా చెప్పుకున్నారు. అంకిత భావం గల దేశభక్తి సంస్థగా ఆరెస్సెస్‌ను అభివర్ణించారు. వ్యక్తిగతంగా ధన్‌కర్‌ ఆరెస్సెస్‌ భక్తుడవడం వేరే విషయం..కానీ రాజ్యాంగ పదవిలో వుండి ఒక సంస్థపై అంతగా పక్షపాతం ప్రకటించడం,విమర్శలు చేయొద్దని ప్రతిపక్షాన్ని అడ్డుకోవడం మాత్రం ఆ స్థానానికీ సభకూ తగని పని. ‘మీరు ఆరెస్సెస్‌ భజన మానుకోవాలని’ ఖర్గే వ్యాఖ్యా నించారు. చివరగా మోడీ సమాధానం సమయంలో నిరసన తెలుపుతూ వాకౌట్‌ చేసిన ప్రతిప క్షంపై ఆయన అధికారపార్టీ భాషలో విరుచుకు పడ్డారు. ప్రతిపక్షాల వాకౌట్‌ తనను మోడీని మాత్రమే గాక రాజ్యాంగాన్ని అవమానించిందన్నారు! ఇంతకన్నా రాజ్యాం గానికి అవమానం వుండదంటూ వాకౌట్‌ను తీవ్రభాషలో ఖండించారు. రాజ్యాంగం అంటే ఏదో చేతుల్లో పట్టుకునేది కాదు, జీవన విధానమంటూ ఉక్రోషం వెలిబుచ్చారు. అంతకుముందు జరిగిన చర్చను కూడా దృష్టిలో పెట్టుకుని ఖర్గే, ఆరెస్సెస్‌ రాజ్యాంగాన్ని గౌరవించడం లేదంటూ ప్రకటించిన సందర్భాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. మొత్తంపైన అటు లోక్‌సభలో మత విద్వేషాలపై చర్చ, ఇటు రాజ్యసభలో రాజ్యాంగ విలువలు ఆరెస్సెస్‌ పాత్రపై చర్చ ప్రజలిచ్చిన తీర్పుకు సరైన కొనసాగింపు అనే చెప్పాలి. ప్రాం తీయ పాక్షిక రాజకీయా ల్లోనే తలమునకలవుతూ దేశానికి ప్రజాస్వా మ్యానికి సంబంధించిన విశాల అంశాలను విస్మరిస్తున్న నాయకులు, పార్టీలూ కూడా కళ్లు తెరవాలి.
– తెలకపల్లి రవి