ఆసియా కప్‌ ఫైనల్లో భారత్‌

ఆసియా కప్‌ ఫైనల్లో భారత్‌– సెమీస్‌లో 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం
– మంధాన అర్ధ శతకం, రాణించిన రేణుక,రాధ
దంబుల్లా: మహిళల ఆసియా కప్‌ టీ20 టోర్నమెంట్‌లో విజేతగా నిలిచేందుకు భారత్‌ ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఈ టోర్నీలో అద్భుతంగా రాణిస్తున్న భారత అమ్మాయిలు అజేయంగా ఫైనల్‌కు చేరుకున్నారు. మరోసారి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో సత్తా చాటిన భారత్‌ శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించి టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. తొలుత బౌలింగ్‌లో పేసర్‌ రేణుకా సింగ్‌ (3/10)… బ్యాటింగ్‌లో ఓపెనర్‌ స్మతి మంధాన (39 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్లతో 55 నాటౌట్‌) అజేయ అర్ధ సెంచరీతో విజంభించడంతో ఈ పోరులో బంగ్లాను చిత్తు చేసింది. టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 80/8 స్కోరు మాత్రమే చేయగలిగింది. నిగర్‌ సుల్తానా (32), షోర్నా అక్తర్‌ (19 నాటౌట్‌) తప్ప మిగతా బ్యాటర్లంతా నిరాశ పరిచారు. రేణుకకు తోడు రాధా యాదవ్‌ (3/14) కూడా సత్తా చాటడంతో బంగ్లా క్రమం తప్పుకుండా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు దిలార అక్తర్‌ (6), ముర్షిదా ఖాటున్‌ (4)తో పాటు ఇష్మా తంజిమ్‌ (8)ను ఆరంభంలోనే పెవిలియన్‌ చేర్చిన రేణుక బంగ్లాను కోలుకోలేని దెబ్బకొట్టింది. ఒక ఎండ్‌లో కెప్టెన్‌ నిగర్‌ పోరాడినా మరో ఎండ్‌లో వికెట్ల పతనం ఆగలేదు. రుమాన అహ్మద్‌ (1), రబేయా ఖాన్‌ (1), రితు మోని (5) కూడా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితం అయ్యారు. చివర్లో షోర్న పోరాటంతో బంగ్లా ఆమాత్రం స్కోరు చేయగలిగింది. లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ 11 ఓవర్లలోనే 83/0 స్కోరు చేసి సులువుగా గెలిచింది. ఓపెనర్‌ షెఫాలీ వర్మ (26 నాటౌట్‌) స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూ సాయం చేయగా.. మరో ఎండ్‌లో స్మతి మంధాన భారీ షాట్లతో ఆకట్టుకుంది. 38 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఆమె భారత్‌కు పది వికెట్ల విజయం అందించింది. ఈ క్రమంలో టీ20ల్లో భారత్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచింది. 3433 పరుగులు చేసిన మంధాన కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (3415 పరుగులు)ని వెనక్కునెట్టింది. రేణుకకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.
సంక్షిప్త స్కోర్లు
బంగ్లాదేశ్‌: 20 ఓవర్లలో 80/8 (నిగర్‌ 32, రేణుక సింగ్‌ 3/10, రాధ యాదవ్‌ 3/14)
భారత్‌: 11 ఓవర్లలో 83/0 (మంధాన 55 నాటౌట్‌, షెఫాలీ 26 నాటౌట్‌).