– నూతన ఆవిష్కరణలకు ప్రధాని మోడీ గ్యారంటీ
– హైదరాబాద్ ఐఐటీలో ఆర్ అండ్ డీ ఇన్నోవేషన్ ఫెస్ట్ ప్రారంభం
– విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరం :కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ఇన్నోవేషన్‌లో భారత్ ముందడుగు వేస్తుందని, ఇన్వెంటివ్-2024 దేశంలోని ఉన్నత శ్రేణి విద్యాసంస్థలతో నిర్వహించబడుతున్న పరిశోధనలు, ఆవిష్కరణలు మన దేశ పురోభివృద్ధికి దోహద పడతాయని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో నిర్వహించబడుతున్న ఆర్ అండ్ డీ ఇన్నోవేటివ్ ఫైర్ ఇన్వెంటివ్ 2024 రెండో ఎడిషన్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. శాస్త్ర, సాంకేతిక, పారిశ్రామిక రంగాల్లో తెలివైన దూరదృష్టి కలిగిన ఆవిష్కరణలు అవసరమన్నారు. ఆత్మనిర్బర్ భారత్, వికసిత్ భారత్ దృష్టిని సాకారం చేయడంలో విద్య కీలక పాత్రను గుర్తించామని తెలిపారు. ట్రాన్స్పా ర్మేటివ్ ఎడ్యుకేషన్ కోసం ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన అనుకూల వాదన ఐఐటీల చొరవతో సజావుగా సాగుతుందన్నారు. ఐఐటీహెచ్‌లో నిర్వహిస్తున్న కార్యక్రమాలు కేవలం విద్యా సంస్థలు, పరిశ్రమల సమావేశ స్థలం మాత్రమే కాదని, ఇది మన దేశ ఆర్థిక వృద్ధికి, ఉద్యోగ కల్పనకు, ఆవిష్కరణలు, వ్యవస్థాపకత సంస్కృతిని పెంపొం దించే పవర్ హౌస్ అని తెలిపారు. మన దేశం పథాన్ని రూపొందించడంలో ఐఐటీల ఆవిష్కరణలు కీలకమవుతున్నాయన్నారు. ఈ అడుగు పరివర్థనా మార్పునకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుందన్నారు. కొత్త అవకాశాలకు తలుపు తెరచి ఉజ్వలమైన, సంపన్నమైన భవిష్యత్ వైపు నడిపిస్తుందని నమ్ముతున్నామని చెప్పారు. ఇలాంటి ఇన్నోవేటివ్ కార్యక్రమాలు సమాజం, పరిశ్రమ, విద్యా సంస్థలు.. మరింత పురోగమించడానికి ఉపయోగపడతాయని తెలిపారు.
విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరం
దేశంలోని ఉన్నత శ్రేణి విద్యాసంస్థలైన ఐఐటీల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు బాధాకరమైనవని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఐఐటీహెచ్‌లో ఇన్వెంటివ్-2024ను ప్రారంభించడానికి వచ్చిన సందర్భంగా విలేకర్లతో ఆయన మాట్లాడారు. దేశంతో పాటు ఐఐటీ హైదరాబాద్‌లో ప్రతి ఏటా పలువురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారన్నారు. సమాజంలో ఎవరు ఆత్మహత్య చేసుకున్నా అది తప్పేనని తెలిపారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడకుండా కౌన్సిలింగ్ ఇచ్చేందుకు విద్యా సంస్థల్లో కమిటీలు వేశామన్నారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి, ప్రొఫెసర్లు సుభాసిస్ చౌధురి, బి.రవి, డైరెక్టర్ సూరత్కల్, డాక్టర్ ప్రశాంత్ గార్గ్, ఎల్వీ ప్రసాద్, రాజీవ్ అహుజా, రోపర్, డాక్టర్ శ్రీదేవి, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.