– ఆ దేశ పౌరులకు వీసాలు నిలిపివేత..
– ఖలిస్తానీ ఉగ్రవాది హత్యపై కెనడా ఎలాంటి ఆధారాలూ సమర్పించలేదు : భారత్
న్యూఢిల్లీ: కెనడా ప్రధాని ఆ దేశ పార్లమెంట్ సాక్షిగా ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు ఇండియా కారణం అంటూ ఆరోపణలు చేశారు. అంతే కాకుండా సీనియర్ భారత దౌత్యవేత్తను దేశం నుంచి బహిష్కరించారు. అయితే ఇందుకు ప్రతిగా భారత్ కూడా కెనడియన్ సీనియర్ దౌత్యవేత్తను 5 రోజుల్లో ఇండియా వదిలి వెళ్లాలని ఆదేశించింది. కెనడా ఆరోపణల్ని అసంబద్ధ, ప్రేరేపిత ఆరోపణలుగా ఖండించింది. ఇదిలా ఉంటే కెనడాకు భారత్ షాక్ ఇచ్చింది. కెనడా పౌరులకు భారతీయ వీసాలను సస్పెండ్ చేసింది. తదుపరి నోటీసులు వచ్చే వరకు వీసాల ప్రక్రియను నిలిపేసింది. ఆపరేషనల్ కారణాల వల్ల వీసాలను సస్పెండ్ చేస్తున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ వార్తలపై విదేశాంగ శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కెనడియన్ల వీసా దరఖాస్తులను ప్రాథమికంగా పరిశీలించేందుకు ఏర్పాటైన ప్రైవేటు ఏజెన్సీ మాత్రం తన వెబ్ సైట్ లో ఈ విషయాన్ని ప్రకటించింది. నిర్వహణ కారణాల వల్ల సెప్టెంబర్ 21 నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చయే వరకు భారత వీసాలను సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ని ఈ ఏడాది జూన్ నెలలో కెనడా సర్రే ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అప్పటి నుంచి కెనడా, భారత్ పై గుర్రుగా ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ట్రూడో ప్రభుత్వం ఖలిస్తాన్ మద్దతుదారుల మద్దతుతో నడుస్తోంది. దీంతో ఓటు బ్యాంకు రాజకీ యాలకు తలొగ్గిన ప్రభుత్వం భారత్ పై నిందులు వేస్తోంది. మరోవైపు బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా ఈ విషయంలో భారత్ ని తప్పుపట్టా లని కెనడా కోరింది. అయితే వీరంతా భారత్ కి మద్దతు తెలుపుతున్నాయి. సరైన ఆధారాలతో ఆరోపణలు చేయాలని కోరాయి. మరోవైపు ఇరు దేశాలు కూడా తమ పౌరులకు ఎమర్జెన్సీ అడ్వైజరీ జారీ చేశాయి. జాగ్రత్తగా ఉండాలని సూచించాయి.
అమెరికాలోని భారత కాన్సులేట్‌పై దాడి ఘటన నిందితుల ఫొటోలు విడుదల
న్యూఢిల్లీ: అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై గత మార్చిలో దాడి చేసిన ఖలిస్థానీ సానుభూతిపరులలో 10 మంది నిందితుల ఫొటోలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) గురువారం విడుదల చేసింది. దాడికి పాల్పడిన వారిపై అప్పట్లో ‘చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యుఎపిఎ) సహా ఆయా సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, ఎన్‌ఐఎ విచారణ ప్రారంభించింది. నిందితులను గుర్తించేందుకు సహకరించాలని, వారి గురించి ఏమైనా సమాచారం ఉంటే తమతో పంచుకోవాలని ప్రజలను కోరింది. ఈ క్రమంలోనే తాజాగా అక్కడి భారత దౌత్యకార్యాలయంపై దాడులకు పాల్పడినట్లు భావిస్తున్న నిందితుల ఫొటోలు విడుదల చేసింది. ఇదిలా ఉండగా.. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై దాడి జరిగిన సమయంలోనే.. కెనడాలోని దౌత్య కార్యాల యం వద్ద కూడా ఖలిస్థానీ మద్దతుదారులు దుశ్చర్యలకు పాల్పడ్డారు. దీనిపై స్థానిక కెనడా హైకమిషనర్‌నుంచి భారత్ వివరణ కోరింది. తాజాగా ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
కెనడాలో మరో ఖలిస్తానీ ఉగ్రవాది హత్య
కెనడాలో మరో ఖలిస్తానీ ఉగ్రవాది సుఖా దున్‌కె హత్యకు గురయ్యాడు. విన్నిపెగ్‌లో బుధవారం ప్రత్యర్థి గ్యాంగ్ జరిపిన దాడిలో అతను మరణించినట్లు ఎన్‌ఐఎ వర్గాలు తెలిపాయి. తామే సుఖా దున్‌కెను హత్య చేసినట్లు లారెన్స్ బిష్ణోరు ముఠా ప్రకటించింది. దున్‌కె 2017లో నకిలీ పాస్‌పోర్ట్‌తో కెనడా పారిపోయినట్లు ఎన్‌ఐఎ తెలిపింది. గ్యాంగ్‌స్టర్ అర్షదీప్ దల్లా ముఠాలో దల్లాకు అత్యంత సన్నిహితుడని, ఖలిస్తానీ ఉద్యమంలోనూ సుఖా కీలకంగా వ్యవహరిస్తున్నాడని పేర్కొంది. ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ అధ్యక్షుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ ఈ ఏడాది జూన్‌లో కెనడాలో హత్యకు గురయ్యాడు. అతని హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్లకు సంబంధం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో ఆరోపించిన సంగతి తెలిసిందే.
కెనడా వేదికగా..ఖలిస్తానీ ఉగ్రసంస్థలతో పాక్ ఐఎస్‌ఐ రహస్య సమావేశం..
ఒట్టావా(కెనడా): భారతదేశాన్ని చికాకు పెట్టిందుకు, అస్థిర పరిచేందుకు దాయాది దేశం పాకిస్తాన్ ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలడం లేదు. తాజాగా ఇండియా-కెనడాల మధ్య తీవ్రస్థాయిలో దౌత్యవివాదం చెలరేగుతోంది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్‌లో ప్రకటించడం వివాదాస్పదం అయింది. కెనడా, భారత సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరించింది. ఇదే విధంగా భారత్ కూడా కెనడా దౌత్యవేత్తను దేశం వదిలి వెళ్లాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే తాజాగా పాకిస్తాన్ గూఢాచర సంస్థ ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్‌ఐ)’ కెనడా వేదికగా ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థలు, కీలక వ్యక్తులతో రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. కెనడాలోని వాంకోవర్ లో ఈ సమావేశం జరిగింది. భారతదేశానికి వ్యతిరేకంగా మరింత ప్రచారం చేసేలా ప్రోత్సహించినట్లు తెలుస్తోంది. ఖలిస్తానీ గ్రూపులకు ఎప్పటి నుంచో ఐఎస్‌ఐ ఫండింగ్ ఇస్తోంది. 5 రోజుల క్రితం జరిగిన ఈ సమావేశానికి సిక్ ఫర్ జస్టిస్(ఎస్‌ఎఫ్‌జే) చీఫ్, ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూతో సహా ఖలిస్తానీ సంస్థల అధినేతలు హాజరయ్యారని నిఘా వర్గాలు తెలిపాయి. ‘ప్లాన్-కే’ పేరుతో ఐఎస్‌ఐ ఖలిస్తాన్ ఉగ్రసంస్థలకు భారీగా నిధులను సమకూరుస్తోంది. భారత్ కి వ్యతిరేకంగా నిరసనలను నిర్వహించేలా ప్రజల్ని రెచ్చగొడుతోంది. భారత వ్యతిరేక ప్రచారానికి పోస్టర్లు, బ్యానర్లను వినియోగిస్తున్నారు. జూన్ నెలలో కెనడాలోని బ్రిటీష్ కొలంబియా సర్రే ప్రాంతంలో ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అయితే ఈ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని, దీనిపై కెనడా ఎజెన్సీలు విచారిస్తున్నాయని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. ఈ ఆరోపణలు రాజకీయ పూరితమైన అసంబద్ధ వ్యాఖ్యలుగా భారత్ కొట్టిపారేసింది. కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని భారత విదేశాంగ శాఖ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ప్రస్తుతం కెనడాలో 20 మంది ఖలిస్తానీ-గ్యాంగ్‌స్టర్లు తలదాచుకుంటున్నారని ఎన్‌ఐఏ ప్రకటించింది.
ఖలిస్తానీ ఉగ్రవాది హత్యపై కెనడా ఎలాంటి ఆధారాలూ సమర్పించలేదు : భారత్
భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న క్రమంలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యో దంతంలో ఎలాంటి ఆధారాలను కెనడా సమర్పించలేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం పేర్కొంది. నిజ్జర్‌ను కెనడా భూభాగంలో భారత్ హత్య చేసిందని కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యల అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమకు ఎలాంటి నిర్ధిష్ట సమాచారం అందించినా పరిశీలించేందుకు సిద్ధమని చెప్పామని, ఇప్పటివరకూ కెనడా నుంచి నిర్ధిష్ట సమాచారం, ఆధారాలు అందలేదని విదేశీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి పేర్కొన్నారు. కెనడా భూభాగం నుంచి వ్యక్తుల నేర కార్యకలాపాలకు సంబంధించి తమవైపు నుంచి నిర్ధిష్ట సమాచారాన్ని కెనడాతో పంచుకున్నామని చెప్పారు. ఈ సమాచారం ఆధారంగా కెనడా ఇప్పటివరకూ చర్యలు చేపట్టలేదని తెలిపారు. రాజకీయ కోణంలోనే కెనడా ఈ ఆరోపణలు చేసిందని బాగ్చి వ్యాఖ్యానించారు. హర్దీప్ నిజ్జర్ హత్య విషయంలో భారత్ ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధాని ఆరోపణల అనంతరం భారత్-కెనడాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇరు దేశాలు దౌత్యవేత్తలను పరస్పరం బహిష్కరించగా, కెనడాలో వీసా సర్వీసులను భారత్ నిలిపివేసింది.