దేశానికి ఇండియా వేదికే ప్రత్యామ్నాయం

దేశానికి ఇండియా వేదికే ప్రత్యామ్నాయం– వైసీపీ టీడీపీలతో రాష్ట్రానికి హోదా రాదు
– మోడీతో జగన్‌, బాబు ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ : న్యాయ్ యాత్ర సభల్లో వైఎస్‌.షర్మిల విమర్శ
విశాఖ : దేశానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి పనికిరాదని, ఇండియా వేదికనే సరైన ప్రత్యామ్నాయమని ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్‌.షర్మిల అన్నారు. మోడీతో చంద్రబాబు పొత్తు, జగన్‌ తొత్తు అని… వీరు ముగ్గురిదీ ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ అని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీతో చంద్రబాబు ప్రత్యక్షంగా, జగన్‌ పరోక్షంగా జతకట్టి వారి స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శిం చారు. ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణకు, యువతకు ఉపాధి కల్పనకు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చేందుకు ఇండియా వేదికలోని కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), సీపీఐ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎపి న్యారు యాత్రలో భాగంగా విశాఖ జిల్లా అక్కయ్యపాలెంలోనూ, శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోనూ ఆదివారం జరిగిన బహిరంగ సభల్లో ఆమె మాట్లాడారు.జగన్‌ గత ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినవేవీ అమలు చేయలేదన్నారు. 42 నీటి పారుదల ప్రాజెక్టులను నవరత్నాల్లో పెట్టి ఏ ఒక్కటీ అమలు చేయలేదని వివరించారు. మద్యనిషేధం హామీని తుంగలో తొక్కారన్నారు. రాష్ట్రంలో మూడు రాజధానులని చెప్పి విశాఖలో కూడా రాజధాని పెట్టలేక పోయారని విమర్శించారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనలో చంద్రబాబు, జగన్‌ ఇద్దరూ విఫలమయ్యారన్నారు. గంగవరం పోర్టును ప్రభుత్వంలో కలిసేలా వైఎస్‌.రాజశేఖరరెడ్డి అగ్రిమెంట్‌ చేస్తే, అయన కొడుకైన జగన్‌… అదానీకి అమ్మేయడం దారుణమన్నారు. విశాఖ ఎంపీగా 2019లో గెలిచిన వైసీపీ వ్యక్తి భూకబ్జాలతో ఎంపీ పదవిని భ్రష్టు పట్టించారని విమర్శించారు. విశాఖ ఎంపీగా కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్న సత్యారెడ్డిని గెలిపిస్తే ఇక్కడి ప్రజల తరుఫున పార్లమెంట్‌లో గళం వినిపిస్తారని తెలిపారు.