– డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం
– కివీస్‌కు టెస్టు సిరీస్ కోల్పోయిన ఫలితం
ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్స్ 2021, 2023లలో ఫైనల్స్‌కు చేరుకున్న టీమ్ ఇండియా.. రెండు సార్లూ రన్నరప్‌గానే నిలిచింది. వరుసగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్లో పోటీపడేందుకు రంగం సిద్ధం చేసుకున్న రోహిత్ సేనకు న్యూజిలాండ్ గట్టి ఝలక్ ఇచ్చింది. బెంగళూర్, పుణె టెస్టుల్లో పరాజయం చవిచూసిన టీమ్ ఇండియా ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
నవతెలంగాణ-ముంబయి
ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025 పాయింట్లలో అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చిన టీమ్ ఇండియా.. స్వదేశంలో అనూహ్యంగా వరుసగా రెండు టెస్టు మ్యాచుల్లో పరాజయం పాలైంది. గెలుపు శాతం 70కి పైగా కొనసాగించిన భారత్.. న్యూజిలాండ్ చేతిలో రెండు టెస్టుల్లో ఓటమితో గెలుపు శాతం 60ల్లోకి పడిపోయింది. బెంగళూర్, పుణె టెస్టుల్లో ఓడినా పాయింట్ల పట్టికలో భారత్ ఇప్పటికీ అగ్రస్థానం లోనే కొనసాగుతుంది. కానీ వరుసగా మూడోసారి ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్లో పోటీపడే అవకాశాలు సన్నగిల్లాయి. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు భారత్ సమీకరణం చాలా సులువుగా కనిపించింది. ఎనిమిది టెస్టుల్లో నాలుగింట విజయాలు సాధిస్తే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశం ఉండేది. కానీ రెండు టెస్టుల్లో ఓటమితో సమీకరణం మారిపోయింది. ఆరు టెస్టుల్లో కనీసం నాలుగు మ్యాచుల్లో విజయాలు సాధించాల్సి ఉంది. అందులో ఐదు టెస్టులను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. మరో టెస్టు మ్యాచ్‌ను స్వదేశంలో నవంబర్ 1 నుంచి ముంబయి వేదికగా న్యూజిలాండ్‌లో ఆడనున్నారు.
కఠిన సవాల్ : 2023 వన్డే వరల్డ్‌కప్ సహా 2023 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో ఓటమి ఎదురుకాగా.. 2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్ విజయంతో భారత క్రికెట్‌లో మళ్లీ వెలుగులు తీసుకొచ్చాడు రోహిత్‌శర్మ. ఐదు రోజుల ఆటలో అందని ద్రాక్షగా మిగిలిన ఐసీసీ డబ్ల్యూటీసీ టైటిల్‌ను సైతం సొంతం చేసుకుని.. ఐసీసీ టైటిల్స్‌లో మిగిలిన ట్రోఫీని సొంతం చేసుకోవాలని రోహిత్‌సేన తపించింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ విజయాల శాతం 62.82గా ఉంది. ఆస్ట్రేలియా 62.50 శాతంతో, శ్రీలంక 55.56 శాతంతో, న్యూజిలాండ్ 50.00 శాతంతో రేసులో ఉన్నాయి. భారత్ ముంబయి టెస్టులో న్యూజిలాండ్‌పై విజయం సాధిస్తే.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ముచ్చటగా మూడోసారి 3-2తో దక్కించుకోవాల్సి ఉంటుంది. ముంబయి టెస్టులోనూ ఓడితే.. ఇక ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై ఏకంగా 4-1తో ఓడించాల్సి ఉంటుంది. ఇదేమీ అంత సులువు కాదు. ఆ సంగతి భారత జట్టుకు బాగా తెలుసు. న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే.. ఆస్ట్రేలియాలో ఓ విజయం సాధించినా సరిపోతుందనే దీమా రోహిత్‌సేనలో గతంలో కనిపిం చేంది.కానీ ఇప్పుడు సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి ఆసీస్‌కు బాగా కలసివచ్చింది. ఇప్పుడు ఆ జట్టు భారత్‌తో సిరీస్‌ను 3-2తో నెగ్గితే సరిపోతుంది.కానీ అంతకు ముందు శ్రీలంకతో టెస్టు సిరీస్‌ను సైతం కనీసం 1-0తో నెగ్గిగా సరిపోతుంది. శ్రీలంకలో ఆసీస్ సిరీస్ ఓడినా.. భారత్‌ను స్వదేశంలో 4-1తో ఓడిస్తే సరిపోతుంది. సొంతగడ్డ పరిస్థితుల్లో ఆడటం ఆసీస్‌కు ఉపకరించనుంది. స్వదేశీ టెస్టు సీజన్ ముంబయి మ్యాచ్‌తో ముగియనుంది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలకు భారీగా గండి పడింది.