భారత్‌ అజేయం

భారత్‌ అజేయం– గ్రూప్‌ దశలో భారత్‌ 9వ విజయం
– 160 పరుగులతో నెదర్లాండ్స్‌ చిత్తు
– శ్రేయస్‌ అయ్యర్‌, రాహుల్‌ శతకాలు
– ఐసీసీ 2023 ప్రపంచకప్‌
నవతెలంగాణ-బెంగళూర్‌
భారత్‌ అజేయం. ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో వరుసగా తొమ్మిదో విజయం. అజేయ జైత్రయాత్రతో సెమీఫైనల్‌కు సిద్ధమైన టీమ్‌ ఇండియా ఆదివారం చిన్నస్వామిలో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. బ్యాటర్లు, బౌలర్లు రాణించటంతో 160 పరుగుల తేడాతో డచ్‌ జట్టును దంచికొట్టారు. శ్రేయస్‌ అయ్యర్‌ (128 నాటౌట్‌, 94 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లు), కెఎల్‌ రాహుల్‌ (102, 64 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీలకు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (61, 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుభ్‌మన్‌ గిల్‌ (51, 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), విరాట్‌ కోహ్లి (51, 56 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ సెంచరీలతో తోడవటంతో తొలుత భారత్‌ 50 ఓవర్లలో 4 వికెట్లకు 410 పరుగులు చేసింది. ఛేదనలో నెదర్లాండ్స్‌ 47.5 ఓవర్లలో 250 పరుగులకు కుప్పకూలింది. తేజ నిడమనూరు (54, 39 బంతుల్లో 1 ఫోర్‌, 6 సిక్స్‌లు), సైబ్రాండ్‌ (45, 80 బంతుల్లో 4 ఫోర్లు) ఆకట్టుకున్నారు. బుమ్రా, కుల్దీప్‌ రెండేసి వికెట్లతో మెరువగా.. శ్రేయస్‌ అయ్యర్‌ ‘ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు.
పరుగుల మోత
టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌.. భారీ స్కోరు దిశగా దంచికొట్టింది. ఓపెనర్లు రోహిత్‌ (61), గిల్‌ (51) దూకుడుతో పవర్‌ప్లేలోనే భారత్‌ 91/0తో నిలిచింది. ఓపెనర్లు ఇద్దరూ అర్థ సెంచరీలు బాదటంతో డచ్‌ బౌలర్లు తేలిపోయారు. విరాట్‌ కోహ్లి (51) సైతం అర్థ శతకంతో మెరిశాడు. కానీ టాప్‌-3 బ్యాటర్లు అర్థ సెంచరీ తర్వాత వికెట్‌ కోల్పోవటంతో అభిమానుల్లో కాస్త అసంతృప్తి!. ఆ లోటు శ్రేయస్‌ అయ్యర్‌ (128 నాటౌట్‌), కెఎల్‌ రాహుల్‌ (102) తీర్చారు. ఆరు ఫోర్లతో 48 బంతుల్లో అర్థ సెంచరీ బాదిన అయ్యర్‌..9 ఫోర్లు, రెండు సిక్సర్లతో 84 బంతుల్లో ప్రపంచకప్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. ఇక కెఎల్‌ రాహుల్‌ ఇన్నింగ్స్‌ రెండెంచెల్లో సాగింది. ఏడు ఫోర్లతో 40 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన రాహుల్‌.. శతకానికి ఎన్నో బంతులు తీసుకోలేదు. మరో 22 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. డెత్‌ ఓవర్లలో రాహుల్‌ విధ్వంసంతో భారత్‌ 400 మార్క్‌ దాటేసింది. 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి భారత్‌ 410 పరుగులు చేసింది.
డచ్‌ పోరాటం
రికార్డు లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్‌ ఫర్వాలేదు అనిపించే ప్రదర్శన చేసింది. తెలుగు కుర్రాడు తేజ (54), సైబ్రాండ్‌ (45)లు మాత్రమే చెప్పుకోదగిన పరుగులు చేశారు. తేజ ఏకంగా ఆరు సిక్సర్లతో డచ్‌ శిబిరాన్ని అలరించాడు. బుమ్రా, కుల్దీప్‌ రెండేసి వికెట్లు పడగొట్టగా.. నెదర్లాండ్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌పై రోహిత్‌ శర్మ పార్ట్‌టైమ్‌ బౌలర్లను ప్రయోగించాడు. రోహిత్‌, కోహ్లి, గిల్‌, సూర్యలు సైతం బంతి అందుకుని వికెట్ల వేట సాగించారు. 47.5 ఓవర్ల పాటు భారత్‌ను విజయం కోసం ఎదురుచూసేలా చేసిన నెదర్లాండ్స్‌..గ్రూప్‌ దశలో ఏడో పరాజయంతో ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. పది జట్లు పోటీపడిన ప్రపంచకప్‌లో 9, 10 స్థానాల్లో నిలిచిన శ్రీలంక, నెదర్లాండ్స్‌ మాత్రమే ఐసీసీ 2025 చాంపియన్స్‌ ట్రోఫీకి అర్హత సాధించలేదు. టాప్‌-8లో నిలిచి అఫ్గనిస్థాన్‌, ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్‌లు చాంపియన్‌ ట్రోఫీకి అర్హత సాధించాయి.
స్కోరు వివరాలు :
భారత్‌ ఇన్నింగ్స్‌ : 410/4 (శ్రేయస్‌ 128, రాహుల్‌ 102, లీడె 2/82, వాండర్‌మెర్వె 1/53)
నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్‌ : 250/10 (తేజ 54, సైబ్రాండ్‌ 45, బుమ్రా 2/33, కుల్దీప్‌ 2/41)