ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌

ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌–  కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి
–  రావల్‌ కోల్‌, సైదోనిగడ్డ తండాలో ‘వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర’ పరిశీలన
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు. మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలోని రావల్‌కోల్‌, సైదోనిగడ్డ తండా గ్రామ పంచాయతీల్లో బుధవారం జరిగిన వికసిత భారత్‌ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సమాచార డిజిటల్‌ వాహనాన్ని వీక్షించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ సమాచారంతో కూడిన ఐఈసీ మెటీరియల్‌ను మంత్రి ఆవిష్కరించారు. రావల్‌ కోల్‌, సైదోని గడ్డతండా గ్రామ పంచాయతీల లో ఏర్పాటు చేసిన వివిధ కేంద్ర ప్రభుత్వ స్టాళ్లను సందర్శించారు. అనంతరం ప్రహ్లాద్‌ జోషి మాట్లాడు తూ.. దేశం ఆజాదీ కా అమృత్‌ మహౌత్సవ్‌ జరుపుకుంటున్న ఈ సమయంలో, మనం వికసిత భారత్‌ సంకల్ప యాత్రను జరుపుకుంటున్నామ న్నారు. 2008, 2009 సమయంలో భారత్‌ ఆర్థిక వ్యవస్థని ఐదు బలహీన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా చూసేవారని, ప్రధాని మోడీ సమర్థ పరిపాలన ఫలితంగా బలమైన ఐదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నేడు దేశం నిలిచిందన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి మారుతోందని, దాని ఫలం ప్రతి పేదవాడికీ చేరువవ్వాలన్నారు. ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిం చడంతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకం ప్రయోజనా లను పొందని వారికి అందజేయడమే ఈ డిజిటల్‌ వాహనం ఉద్దేశమని వివరించారు.
గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌లో తెలంగాణ రాష్ట్రానికి రూ.2.5 లక్షల కోట్లు ఇచ్చినట్టు తెలిపారు. రహదారుల అభివృద్ధికి రూ.93,000 కోట్లు, రైల్వేల అభివృద్ధికి ఐదేండ్లలో రాష్ట్రానికి రూ.4,500 కోట్లు ఇచ్చినట్టు చెప్పారు. పీఎం ఉజ్వల యోజన ద్వారా పదేండ్లలో 9.5 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చామని, దీని వల్ల దేశంలో మనం పొగ రహిత వంటిల్లు చూస్తున్నాం అన్నారు. గ్యాస్‌ మన దగ్గర ఉత్పత్తి బాగా తక్కువగా ఉందని, బయటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. అయినా పీఎం ఉజ్వల ద్వారా రూ.600కే గ్యాస్‌ను కేంద్రం అందజేస్తున్నట్టు తెలిపారు. మన ఇరుగు పొరుగు దేశాల్లో ఇంత చౌకగా దొరకదని చెప్పారు. గ్రామాలకు నీటిని సరఫరా చేయాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీలది, రాష్ట్ర ప్రభుత్వానిది అని, కానీ ప్రతి గ్రామాన్నీ చేరుకోవడానికి హర్‌ ఘర్‌ నల్‌ జల్‌, జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా ప్రతి ఇంటికీ మంచి నీటి కుళాయి ఏర్పాటు చేసినట్టు తెలిపారు. చిన్న వ్యాపారస్తులకు ఎలాంటి గ్యారంటీ లేకుండా రుణాలు ఇవ్వడం కేంద్రం సులభతరం చేసింద న్నారు. వీధి వర్తకులకు రుణాలు మంజూరు చేసి వారి ఉన్నతికి కట్టుబడి ఉందన్నారు.