– ఆసియా చాంపియన్స్ ట్రోఫీ వశం
బీజింగ్ (చైనా): హాకీ ఇండియా ఆసియా రారాజుగా నిలిచింది. పారిస్ ఒలింపిక్స్‌లో పోటీపడిన ఏకైక ఆసియా జట్టుగా నిలిచిన భారత్.. భారీ అంచనాల నడుమ రికార్డు స్థాయిలో ఐదోసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. సోమవారం ఇక్కడ జరిగిన టైటిల్ పోరులో ఆతిథ్య చైనాపై 1-0తో విజయం సాధించింది. 2023లో నాల్గోసారి ఈ టైటిల్ సాధించిన భారత్.. విజయవంతంగా టైటిల్‌ను నిలబెట్టుకుంది. 2016, 2018లోనూ భారత్ వరుసగా టైటిళ్లను దక్కించుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఆఖరు పది నిమిషాల ఆటలో జుగ్‌రాజ్ సింగ్ (51వ నిమిషం) గోల్‌తో భారత్ విజయం సాధించింది. ఆసియా విజేతలకు హాకీ ఇండియా రూ. 3 లక్షల చొప్పున నగదు బహుమతి ప్రకటించింది. సహాయక సిబ్బందికి రూ.1.5 లక్షల నజరానా అందించనుంది.