– ఈ సారి 159వ స్థానం
– పాలస్తీనాకు 157వ ర్యాంకు
– మనకంటే టర్కీ, పాక్, శ్రీలంక బెటర్
– రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ‘ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్’
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ పాలనలో భారత్‌లో పత్రికా స్వేచ్ఛ ఎలా పడిపోయిందనటానికి ఇది మరొక ఉదాహరణ. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్(ఆర్‌ఎస్‌ఎఫ్) ఏటా ప్రచురించే ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్-2024 ఎడిషన్‌లో భారత్ 159వ స్థానంలో ఉన్నది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినం నాడు ఈ నివేదిక విడుదలైంది. కాగా, భారత్‌తో పోల్చుకుంటే పలు అంశాల్లో వెనకబడిన దేశాలుగా బీజేపీ చెప్పే టర్కీ, పాకిస్థాన్, శ్రీలంకలు మాత్రం పత్రికా స్వేచ్ఛలో మనకంటే ముందున్నాయి. టర్కీ 158వ స్థానంలో నిలవగా.. పాక్ 152, శ్రీలంక 150వ ర్యాంకులను సాధించాయి. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ సమాచారం ప్రకారం.. ఇజ్రాయిల్ అతి దారుణ యుద్ధంతో తీవ్రంగా నష్టపోతున్న పాలస్తీనాలో అనేక మంది జర్నలిస్టులు ఇప్పటికే మరణించారు. అయినప్పటికీ, ఆ దేశం పత్రికా స్వేచ్ఛలో ఒకే స్థానం దిగజారి 156 నుంచి 157కి చేరింది.
ఈ ర్యాంకింగ్ రాజకీయ సందర్భం, చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్, ఆర్థిక సందర్భం, సామాజిక సాంస్కృతిక సందర్భం, జర్నలిస్టుల భద్రత అనే ఐదు సూచికలపై ఆధారపడి ఉంటుంది. టర్కీ, బంగ్లాదేశ్, యూఏఈ, భారతదేశం, రష్యాతో సహా 22 దేశాల కంటే మెరుగ్గా ఉన్న పాలస్తీనా కేవలం ఒక ర్యాంక్‌ను ఎలా మార్చుకున్నదనేది ఆశ్చర్యకరంగా అనిపించొచ్చనీ, అయితే ఇజ్రాయిల్ దాడి కారణంగానే పాలస్తీనాలో అశాంతి కనిపించినా.. అక్కడ పత్రికా స్వేచ్ఛకు అంతగా భంగం వాటిల్లలేదని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. 2023లో, ఇజ్రాయిల్-గాజా యుద్ధంలో ప్రపంచవ్యాప్తంగా మరణించిన జర్నలిస్టులు, మీడియా ఉద్యోగులలో మూడొంతుల మంది మరణించారనీ, వారిలో ఎక్కువ మంది పాలస్తీనియన్లు గాజాపై ఇజ్రాయిల్ దాడుల్లో చనిపోయారని గుర్తు చేశారు. ఇక ఖతార్ 84వ స్థానంలో ఉన్నది.కేంద్రంలోని మోడీ సర్కారు ఇటీవల మరింత క్రూరమైన చట్టాలను అవలంబించిందనీ, ఇప్పటికీ ”ప్రజాస్వామ్యానికి అనర్హమైనది” అని ఆర్‌ఎస్‌ఎఫ్ పేర్కొన్నది. ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛకు ”దాని హామీదారులుగా ఉండవలసిన వ్యక్తులు, రాజకీయ అధికారులతో ముప్పు వాటిల్లుతున్నదని వివరించింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో పత్రికా స్వేచ్ఛ పరిస్థితి మరింత దిగజారిందనీ, 2024 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో 32 దేశాలు, భూభాగాల్లో 26 స్కోర్లు పడిపోయాయని ఆర్‌ఎస్‌ఎఫ్ వివరించింది. నియంతృత్వ ప్రభుత్వాలు పెరుగుతున్న శక్తితో వార్తలు, సమాచారంపై తమ పట్టును కఠినతరం చేస్తున్నా యని పేర్కొన్నది. ఇక హాంకాంగ్(135), కంబో డియా(151), ఫిలిప్పీన్స్(134) వంటి దేశాలు భారత్ కంటే ముందుండటం గమనార్హం.