న్యూఢిల్లీ : ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఏడో ఎడిషన్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సదస్సులో ప్రధాని మాట్లా డుతూ కాంగ్రెస్‌ను ‘కాలం చెల్లిన ఫోన్’తో పోల్చుతూ విమర్శలు చేశారు. 2014లోనే ప్రజలు ఆ ఫోన్లను వదిలేసి.. దేశ గతిని మార్చే ప్రభుత్వాన్ని ఎంచుకున్నారని అన్నారు. ‘కాలం చెల్లిన ఫోన్లలో స్తంభించిన స్క్రీన్లపై.. ఎన్నిసార్లు స్వైప్ చేసినా, ఎన్ని బటన్లు నొక్కినా ఫలితం ఉండదు. రీస్టార్ట్ చేసినా, బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టినా.. చివరకు బ్యాటరీ మార్చినా ఆ ఫోన్లు పనిచేయవు. గత ప్రభుత్వం కూడా అలాంటి స్థితిలోనే ఉండేది. 2014లోనే ప్రజలు అలాంటి కాలం చెల్లిన ఫోన్లను వదిలించుకున్నారు. ఈ దేశానికి సేవ చేసేందుకు మాకు అవకాశం కల్పించారు. 2014 కేవలం తేదీ మాత్రమే కాదు. అదో పెను మార్పు’ అని మోడీ తెలిపారు. అలాగే సాంకేతిక రంగంలో భారత్ సాధించిన విజయాలను ప్రధాని గుర్తుచేశారు. ‘భారత్ ఇప్పుడు 6జీ దిశగా వేగంగాా అడుగులు వేస్తోంది. బ్రాడ్‌బ్యాండ్ వేగంలో భారత్ గతంలో 118 ర్యాంక్‌లో ఉండగా.. ఇప్పుడు 43వ ర్యాంక్‌కు ఎగబాకింది. ఇటీవలే గూగుల్.. భారత్‌లో పిక్సెల్ ఫోన్‌ను తయారు చేయనున్నట్లు ప్రకటించింది. శామ్‌సంగ్ ఫోల్డ్ 5, యాపిల్ ఐఫోన్ 15 ఇప్పటికే దేశంలో తయారవుతున్నాయి’ అని చెప్పారు. టెక్ విప్లవంలో యువత పాత్ర కీలకమని అన్నారు. అంతరిక్ష రంగంలో భారత్ వేగంగా వృద్ధి చెందుతోందని తెలిపారు.
జియో స్పేస్ పైబర్ ఆవిష్కరణ
ఈ సదస్సులో ముకేష్ అంబానికి చెందిన రిలయన్స్ జియో దేశంలో తొలి శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను ప్రధాని మోడి లాంచనంగా ఆవిష్క రించారు. జియో స్పేస్ ఫైబర్ పేరుతో భారత్‌లో ఇప్పటి వరకు ఇంటర్నెట్ సదుసాయం లేని ప్రాంతాలకు, ప్రతి ఇంటికీ డిజిటల్ సేవలను చేరువ చేయ డానికి జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ వంటి బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులతో పాటు జియో స్పేస్ ఫైబర్‌ను కూడా ప్రారంభించామని సంస్థ తెలిపింది.