అసమానతల భారతం

India of inequalities– విలాస వస్తువుల కొనుగోలులో సంపన్నులు బిజీ
– కుటుంబ భారాన్ని మోయలేక చతికిలపడుతున్న బడుగులు
– దాన్నే అభివృద్ధి అంటూ మోడీ సర్కారు ప్రగల్భాలు
దేశంలో అత్యంత ఖరీదైన, విలాసవంతమైన గడియారాలను విక్రయించే ఎథోస్‌ కంపెనీ అమ్మకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో 44శాతం పెరిగాయి. దాని నికర లాభం ఏకంగా 262శాతంపెరిగిందని బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రిక ఇటీవల తెలిపింది. ఈ కంపెనీ ఒమేగా, లికల్టర్‌, పనెరారు, లాంగినెస్‌, బార్న్‌ అండ్‌ మెర్సియర్‌, టిస్సోట్‌, రేమండ్‌ వెయిల్‌ వంటి గడియారాలను ఉత్పత్తి చేస్తుంది. వీటి ధర ఒక్కోటి లక్షల రూపాయలు పలుకుతుంది. అయితే ఇది నాణానికి ఓ వైపు కన్పిస్తున్న దృశ్యం. మరోవైపు చూస్తే తొలి త్రైమాసిక కాలంలోనే దేశంలో అండర్‌వేర్‌ అమ్మకాలు పడిపోయాయి. ద్విచక్ర వాహనాల అమ్మకాలు సైతం తగ్గి 2012 స్థాయికి చేరాయి. మరోవైపు బీఎండబ్ల్యూ కార్ల అమ్మకాలు 2022లో 37శాతం పెరిగాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ప్రపంచ ఆసమానతల నివేదిక-2022 మన దేశాన్ని ‘పేద, అత్యంత అసమానతలున్న దేశం’గా అభివర్ణించింది.
న్యూఢిల్లీ : ఎగువ మధ్య తరగతి ప్రజలు, సంపన్నులు కోవిడ్‌ కష్టకాలంలో దాచుకున్న సొమ్మును ఇప్పుడు విలాసవంతమైన వస్తువుల కొనుగోలుకు ఖర్చు చేస్తున్నారు. అదే సమయంలో జనాభాలో అత్యధిక భాగం ప్రజలు కోవిడ్‌ సమయంలో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. చిన్నా చితకా ఉద్యోగాలు చేసినా చాలీచాలని వేతనాలతో బతుకు భారమైంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం తోడవడంతో వారి జీవితాలు దుర్భరంగా మారాయి. విలాసాల మాట అటుంచి కనీస అవసరాలు సైతం తీర్చుకోలేని దుస్థితిలో మగ్గిపోతున్నారు. దేశంలో పెరిగిపోతున్న అసమాతనతలకు ఈ పరిణామాలు అద్దం పడుతున్నాయి.
ఏ కోణంలో చూసినా…
కోవిడ్‌ నుండి దేశం ఇంకా పూర్తిగా కోలుకోలేదని చెప్పడానికి అనేక కోణాలు కన్పిస్తాయి. కోవిడ్‌ అనంతర ం స్టాక్‌ మార్కెట్‌ లాభాల బాట పట్టింది. అయితే ఆర్థిక వ్యవస్థ కూనారిల్లిపోతోంది. కొద్ది మంది మాత్రం స్టాక్‌ మార్కెట్‌లోనూ, బాండ్లలోనూ పెట్టుబడి పెట్టి లాభపడ్డారు.
పెరుగుతున్న పేదలు
ఇక రెండో కోణం…లిస్టెడ్‌ కంపెనీల లాభాలు ఏడేళ్ల గరిష్ట స్థాయికి చేరాయి. మరోవైపు వేతనాలు తగ్గిపోయాయి. ఉద్యోగాల కల్పన కూడా పడిపోయింది. మూడో కోణం… సంఘటిత రంగం, ప్రభుత్వ పర్యవేక్షణలో నడిచే వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలు కొద్ది కాలం మినహా మంచి పనితీరు కనబరిచాయి. మరి అసంఘటిత రంగం? వరుస దెబ్బలతో సతమతమై పోయింది. ఒక దాని తర్వాత మరొకటిగా ప్రభుత్వం అవలంబించిన విధానపరమైన తప్పిదాలు ఆ రంగం పాలిట శాపంగా మారాయి. పెద్ద నోట్ల రద్దు, 2017 జూలైలో వస్తువులు-సేవలపై పన్ను యోచన, దేశవ్యాప్తంగా 600 కంటే తక్కువ కోవిడ్‌ కేసులు నమోదైన సమయంలో కేవలం నాలుగు గంటల సమయం ఇచ్చి లాక్‌డౌన్‌ విధింపు వంటి తప్పుడు విధానపరమైన నిర్ణయాలతో అసంఘటిత రంగం కుదేలైంది. వరుస దెబ్బలతో ఈ రంగంతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా రంగాలు కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. అందుకే నిరుద్యోగం 50 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది. 2020లో దేశంలో నాలుగున్నర కోట్ల మంది ప్రజలు వ్యవసాయ రంగంలో చేరారు. దేశం కోవిడ్‌ దెబ్బ నుండి కోలుకోలేదని చెప్పడానికి ఇది నాలుగో కోణం. 2021లో మరో 70 లక్షల మంది ఈ రంగంలో ఉపాధి పొందారు. 2022లో కూడా వీరి సంఖ్య తగ్గలేదు. అయితే అదే సమయంలో ఉత్పాదక రంగంలో ఉపాధి అవకాశాలు పెరగలేదు. అవి స్థిరంగా ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే 2004-2014 మధ్య సంవత్సరానికి 8% వృద్ధి నమోదు చేసిన ఆర్థిక రంగం ఆ తర్వాత దానిని కొనసాగించలేకపోయింది. ఆర్థిక వృద్ధి పెరగకపోగా అది వెనకపట్టు పట్టింది.
మూలిగే నక్కపై…
నిరుద్యోగం పెరగడంతో వినియోగ డిమాండ్‌ పడిపోయింది. 2022-23లో సగటు తలసరి ఆదాయం స్వల్పంగా పెరిగి 2019 స్థాయికి చేరింది. ఆదాయాలు స్థిరంగా ఉండడంతో ఇటీవలి సంవత్సరాలలో జీడీపీలో కుటుంబ పొదుపు తగ్గిపోయింది. అయితే ఇక్కడ ఓ విషయాన్ని గ్రహించాల్సి ఉంది. ఎగువ మధ్య తరగతి ప్రజలు, సంపన్నులు కోవిడ్‌ సమయంలో కూడబెట్టిన సొమ్మును విలాసవంతమైన వస్తువుల కొనుగోలుకు వెచ్చిస్తున్నారు. అదే సమయంలో జనాభాలో అత్యధికులు కోవిడ్‌ సమయంలో ఉపాధి కోల్పోయి ఇప్పటికీ అష్టకష్టాలు పడుతున్నారు. అధిక ద్రవ్యోల్బణం, పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌పై ప్రభుత్వ పన్నుల కారణంగా వారి పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది. విలాసాల మాట దేవుడెరుగు…కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని దుస్థితిలో విలవిలలాడుతున్నారు.
ఆ ఐదుగురికే లాభాల పంట
ఆర్థికేతర రంగాల మొత్తం ఆస్తులలో దేశంలోని ఐదు అతి పెద్ద సంస్థల వాటా 10శాతం (2018) నుండి 18శాతానికి (2021) పెరిగింది. అయితే తర్వాతి స్థానంలో ఉన్న ఐదు వ్యాపార సంస్థల వాటా 18శాతం (1992) నుండి 9శాతానికి పడిపోయింది. మరో విధంగా చెప్పాలంటే చిన్న సంస్థలతో పాటు 6-10 స్థానాలలో ఉన్న సంస్థల ప్రయోజనాలను సైతం ఫణంగా పెట్టి పెద్ద సంస్థలు ప్రయోజనం పొందాయి. ఆ విధంగా ప్రయోజనం పొందిన సంస్థలలో ముకేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ గ్రూప్‌, టాటా గ్రూప్‌, ఆదిత్య బిర్లా గ్రూప్‌, అదానీ గ్రూప్‌, భారతీ టెలికం ఉన్నాయని ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ విరల్‌ ఆచార్య తెలిపారు.
తేరుకోని భారత్‌
దేశంలో ఎస్‌యూవీ అమ్మ కాలు పెరగ్గా ఎంట్రీ లెవల్‌ కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు పడిపో యాయి. కోవిడ్‌కు ముందు కాలం తో పోలిస్తే వీటి అమ్మకాలు ఇప్పుడు మరీ తగ్గిపోవడం గమనార్హం. ఈ గణాంకాలన్నీ మనల్ని ఆశ్చర్యంలో ముంచేస్తున్నాయి కదూ! కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రజలను నమ్మించేందుకు ఓ మాట చెబుతూ ఉంటుంది. కోవిడ్‌ దెబ్బ నుండి దేశం కోలుకున్న దని, ప్రపంచం లోనే వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తోందని డాంబికాలు పలుకుతోంది. అయితే  ప్రభుత్వంతో సంబంధం లేని ఆర్థికవేత్తలు మాత్రం ఈ వాదనలో నిజం లేదని, వాస్తవానికి దేశం ఇంకా కోవిడ్‌ షాక్‌ నుండి కోలుకోలేదని చెబుతున్నారు. బ్రిటన్‌ను అధిగమించి ప్రపంచంలో ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం ఆవిర్భవించిందన్న వాస్తవాన్ని ఈ తరహా గణాంకాలు నిరూపిస్తున్నాయా?