భారత రాజ్యాంగ పీఠికలో భారతదేశాన్ని సామ్యవాద దేశంగా ప్రకటించుకున్నాము. ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 39సి సంపద కేంద్రీకరణ కాకుండా చూడాలని సూచించింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75వ సంవత్సరంలో అడుగుపెట్టిన ఈ తరుణంలో సంపద కేంద్రీకరణపై ప్రపంచ అసమానతల ల్యాబ్, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి సంస్థ సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలోని అంశాలు రాజ్యాంగ లక్ష్యాలకు వ్యతిరేక దిశలో దేశం ఎంతవేగంగా పయనిస్తుందో తెలియజేస్తోంది. దిగువ 50 శాతం మంది తలసరి ఆదాయం మొదటి పది శాతం మంది తలసరి ఆదాయం కన్నా 20రెట్లు తక్కువగా ఉంది. మొత్తం జాతీయాదాయంలో మొదటి 10శాతం దగ్గర 57శాతం, మొదటి ఒక శాతం మంది దగ్గర 22 శాతం సంపద పోగుబడింది. ప్రపంచంలోనే అత్యంత అసమానతల దేశంగా పేదలు(22.89 కోట్లు)ఎక్కువగా ఉన్న దేశంగా భారతదేశం మారిపోయింది. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, 2030 నాటికి ఏడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు మారుస్తామని గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు పెరిగిన సంపద దేశ ప్రజలకు పంపిణీ చేయడంలో శ్రద్ధ వహించడం లేదు.మొదటి పదిశాతం మంది వద్ద మూడింట రెండు వంతుల సంపద చేరితే అది దేశ అభివృద్ధి అవుతుందా?సంపదను సృష్టిస్తున్న అధిక శాతం మంది ప్రజల వద్దకు ఈ సంపద చేరకుండా దేశ అభివృద్ధి సాధ్యమా? నాడు ‘దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనుషులని’ గురజాడ అంటే నేటి పాలకులు దేశమంటే ఆ పది శాతం మందే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వారి కోసమేనా సంస్కరణలన్నీ?
బ్రిటీష్ ప్రభుత్వ కాలంలో (1858-1947) మొదటి 10శాతం మంది వద్ద దాదాపుగా 50శాతం సంపద కేంద్రీకరించబడింది. స్వాతంత్య్రానంతరం సామ్యవాద స్ఫూర్తితో అమలు చేసిన పంచవర్ష ప్రణాళికలు ఈ సంపద కేంద్రీకరణను 35 శాతానికి తగ్గించాయి.కానీ 1990 నుంచి ప్రారంభించిన నూతన ఆర్థిక సంస్కరణలు ఈ 34 సంవత్సరాల అమలులో అసమానతల్ని తీవ్రంగా పెంచాయి.ఈ సంస్కరణల వలన లబ్ధి పొందింది మొదటి ఒక శాతం బిలియనీర్లు మాత్రమే. దిగువ, మధ్యతరగతి ప్రజల అభివృద్ధి చాలా మందకొడిగా ఉందని నివేదికలు తెలియజేస్తున్నాయి దిగువ 50 శాతం మంది వద్ద 6శాతం సంపద ఉంటే మొదటి 10శాతం దగ్గర 65శాతం ,మొదటి ఒక శాతం దగ్గర 33శాతం సంపద పోగుబడిందంటే ఈ సంస్కరణలు సంపన్నులకు ఏ విధంగా ఉపయోగపడ్డాయో అర్థం చేసుకోవచ్చు.2023లో విడుదల చేసిన ఆక్స్ఫామ్ నివేదిక కూడా మొదటి 30 శాతం మంది వద్ద 90 శాతం సంపద చేరిందని పేర్కొంది. ఇదే కాలంలో బిలినియర్ల సంఖ్య 2020లో 102 నుంచి 2022 నాటికి 166కి చేరింది. మొదటి వందమంది ధనవంతుల మొత్తం సంపద రూ.54.12 లక్షల కోట్లు, మొదటి పదిమంది ధనవంతుల రూ.27.52 లక్షల కోట్లకు చేరింది.వీరి సంపద 2021 నుండి 32.8శాతం పెరిగింది.
ఈ సంపద కేంద్రీకరణను తగ్గించడం కోసం పన్నుల విధానంలో మార్పులు చేయవలసిన అవసరం ఉంది.కానీ ప్రస్తుత పాలకుల పన్నుల విధానం అసమానతలు తగ్గించకపోగా మరింత పెంచేలా ఉన్నాయి. సంపన్నులపై పన్నులు వేయడం ద్వారా వచ్చిన ఆదాయం విద్య ,వైద్యం, ఉపాధి వంటి ప్రజా అవసరాలపై ఖర్చు చేయడం ద్వారా ప్రజల ఆదాయాన్ని పెంచవచ్చు. కానీ పాలకులు ఒకవైపు పేదలపై పన్నులు ఎక్కువగా వేయడం, ప్రజా అవసరాలపై ఖర్చును తగ్గించడం, మరోవైపు కార్పొరేట్లకు రాయితీలివ్వడం, రుణమాఫీలు చేయడం, ప్రభుత్వ ఆస్తులను కారుచౌకగా కట్టబెట్టడం వంటి విధానాల ద్వారా కార్పొరేట్ల వైపు నిలబడుతున్నారు. ఈ విధానాలు ప్రజల జీవితాలలో వెలుగులు నింపకపోగా కారు చీకట్లను అలుముకునేలా చేశాయి. ప్రజలు వాడుకునే నిత్యావసరాలపై పన్నులు పెంచడమనేది అసమానతలకు దారితీస్తుంది.పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌పై ఎక్సైజ్ డ్యూటీని పెంచడం ద్వారా 2014-15లో రూ.99 వేల కోట్ల నుండి 2021 నాటికి 3.73 లక్షల కోట్ల రూపాయలను (277శాతం పెరుగుదల) ప్రజల నుంచి వసూలు చేశారు. పెట్రోలు 79 శాతం, డీజిల్ 101 శాతం, వంట గ్యాస్ 300శాతం ధరలు పెంచడమనేది ఒక ఉదాహరణ మాత్రమే. పేదలు వారి సంపాదనలో అధిక భాగం పన్నులకు చెల్లించవలసి వస్తుంటే వారి జీవన ప్రమాణాలు ఏరకంగా మెరుగవుతాయి? దిగువ 50శాతం మంది మొదటి 10 శాతం మంది కంటే ఆరు రేట్లు ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నారు. ఆహార, ఆహారేతర ఉత్పత్తులపై పన్నులలో 64.3శాతం పన్నులు దిగువ 50 శాతం మంది ప్రజలు నుండే వసూలు చేస్తున్నారు.
మొత్తం జీఎస్టీలో మూడింట రెండువంతుల పన్నును దిగువ 50 శాతం మంది నుండి ,మొదటి 10 శాతం మంది నుంచి 3శాతం నుంచి 4శాతం పన్నులు మాత్రమే రాబెట్టేలా పన్ను విధానాన్ని రూపొందించారు. పేదరిక స్థాయిని తగ్గించి చూపడం ద్వారా పేదలు తగ్గినట్లు చెబుతున్న లెక్కలలో బూటకాన్ని పోషక ఆహారంపై, విద్యా, వైద్యంపై వినియోగ స్థాయిని బట్టబయలు చేస్తున్నాయి. పోషకాహార లోపంతో కూడిన వ్యాధులతో ప్రతి సంవత్సరం1.7 మిలియన్ల ప్రజలు చనిపోతున్నారంటేనే దేశంలోని పేదరికం ఏ స్థాయిలో విజృంభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలోని బిలినియర్లపై మూడు శాతం పన్నుల ద్వారా దేశం మొత్తం జాతీయ ఆరోగ్య పథకానికి మూడేండ్లకు అవసరమైన (37,800 కోట్ల)నిధులను సేకరించవచ్చు.
మొదటి 10 శాతం మందిపై కేవలం 5 శాతం పన్ను ద్వారా ఐదేండ్ల పాటు దేశంలోని గిరిజనులందరి ఆరోగ్యాన్ని అందించవచ్చు. దేశంలోని బిలియనీర్లపై కేవలం రెండు శాతం పన్ను ద్వారా మూడేండ్ల పాటు ఒక్కరికి కూడా పోషకాహార లోపం లేకుండా చేయవచ్చు. మొదటి 100మంది పై 2శాతం పన్ను ద్వారా జీడీపీలో ఆరోగ్య రంగంపై 3శాతం నిధులను ఖర్చు పెట్టవచ్చు. మొదటి పదిమందిపై కేవలం 5శాతం పన్నుల ద్వారా దేశంలో బడిబయట పిల్లలందరినీ పాఠశాలలోచేర్చి విద్య అందించవచ్చు. మొదటి 10 మందిపై కేవలం ఒక శాతం పన్ను ద్వారా 13ఏండ్ల పాటు ప్రాథమిక పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలన్నీ భర్తీ చేసి నాణ్యమైన విద్యనందించవచ్చు. కానీ దీనికి విరుద్ధంగా కార్పొరేట్ పన్నును 30 శాతం నుండి 22 శాతానికి తగ్గించారు,14.5 లక్షల కోట్ల కార్పొరేట్ల రుణాలను నిరార్ధక ఆస్తుల పేరుతో రద్దు చేశారు.
దేశ సంపదను సంపద సృష్టించే వారికి చేర్చకుండా ప్రజల జీవన ప్రమాణాలను, ఆనందాన్ని ఎలా పెంచగలం? దేశంలో వెలుగులను ఎలా నింపగలరు? అందుకే దేశ ప్రజలుపెరిగిన సంపదలో మా వాటా ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు? ఈ అసమా నతలు దేశంలో వారి ఆనందాన్ని ఆవిరిచేశాయి. అందువలన గ్యాలప్ వరల్డ్ పోల్ సంస్థ వారు విడుదల చేసిన ఆనందదాయక దేశాల జాబితా-2024లో భారతదేశం 149 దేశాలలో 126వ స్థానంలో ఉంది. మన పొరుగునే ఉన్న పాకిస్తాన్, నేపాల్ కన్నా దిగువన ఉన్నాము.సంపదలో మా వాటా మాకేనని ఈ అసమానతలకు కారణమైన నూతన ఆర్థిక సంస్కరణలు, ప్రయివేటీకరణ విధానాలపై ప్రజలు పోరాడుతున్నారు.
జి వెంకటేశ్వరరావు
9966135289