– ముస్లిం సమాజంపై పెరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు
– గో రక్షణ, లవ్ జిహాద్ పేరుతో దాష్టీకాలు
– దిగజారుతున్న మైనారిటీల ఆర్థిక పరిస్థితులు
– క్రైస్తవులనూ వేధిస్తున్న హిందూత్వ శక్తులు
న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ పాలనలో ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, ఇతర వెనుకబడిన తరగతుల వారు అన్ని రకాలుగా అణచివేతకు గురయ్యారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో 14.2 శాతం మంది ముస్లింలు ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ వంటి పెద్ద పెద్ద మాటలు ఎన్ని చెబుతున్నప్పటికీ వారి అణచివేత స్పష్టంగా కన్పిస్తోంది.
బీజేపీలో ఒక్క ముస్లిం ఎంపీ లేరు
ప్రస్తుతం పార్లమెంట్ ఉభయసభల్లో బీజేపీకి 395 మంది సభ్యులు ఉన్నారు. అయితే వీరిలో ఒక్క ముస్లిం కూడా లేరు. మోడీ క్యాబినెట్‌లోని 57 మందిలో ఒక్కరు కూడా ముస్లిం మంత్రి లేరు. ఇక గత పది సంవత్సరాల్లో ముస్లింలపై జరిగిన దౌర్జన్యాల విషయానికి వస్తే 2019లో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన హింసను ప్రధానంగా ప్రస్తావించాలి. అప్పుడు నూతన పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ ప్రకారం ఆ నిరసన అనంతరం చెలరేగిన హింసాకాండలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 38 మంది ముస్లింలే.
లెక్కే లేని ‘లవ్ జిహాద్’ ఉదంతాలు
ఇక ‘లవ్ జిహాద్’ ఉదంతాలకైతే లెక్కే లేదు. హిందూ బాలికలను వివాహం చేసుకున్న ముస్లిం యువకులు, వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. బీజేపీ ప్రభుత్వం హిందూ జాతీయతావాద గ్రూపులకు పెత్తనం ఇచ్చిందని, అవి ముస్లింలను బెదిరించడం, వేధించడం, వారిపై దాడి చేయడం వంటి చర్యలకు పాల్పడ్డాయని హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ తెలిపింది. పోలీసులు, న్యాయస్థానాలు వంటి స్వతంత్ర సంస్థలు కూడా అధికార పార్టీ చెప్పినట్లు నడుచుకున్నాయని ఎత్తిచూపింది.
దిగజారిన ఆర్థిక స్థితిగతులు
మైనారిటీ ముస్లింల ఆర్థిక పరిస్థితులను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మోదీ పాలనలో వారి ఆర్థిక స్థితిగతులు బాగా దిగజారాయి. 2006లో రాజేందర్ సచార్ కమిటీ ముస్లింల ఆర్థిక పరిస్థితిని ఓ పద్ధతి ప్రకారం మదింపు చేసింది. ఆ కమిటీ ఏం చెప్పిందంటే…దేశంలో ముస్లింలు అత్యంత పేదరికంలో జీవిస్తున్నారు. మొత్తం మీద వారి పరిస్థితి ఎస్సీ, ఎస్టీల కంటే కొంచెం మెరుగ్గా ఉంది. పట్టణ ప్రాంతాల్లో మాత్రం దారుణంగా ఉంది. ఎన్‌ఎస్‌ఎస్‌ఓ గణాంకాల ప్రకారం 2004-05లో దేశ జనాభాలో 22.7 శాతం మంది అంటే 25.1 కోట్ల మంది పేదలే. ఎస్సీ, ఎస్టీల్లో 35 శాతం మంది, ముస్లింలలో 31 శాతం మంది పేదరికంతో బాధపడుతున్నారు. అన్ని మతాల వారు జీవించే ప్రాంతాల్లో ముస్లింలకు నివాస గృహాలు దొరకడమే కష్టమవుతోంది’… 2006 కంటే ఇప్పుడు పరిస్థితులు మరింత దిగజారాయని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.
హిందూత్వ శక్తుల ఆగడాలు
క్రైస్తవ సమాజం కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 1999లో గ్రహం స్టీవర్డ్ స్టెయిన్స్ అనే పాస్టర్‌ను సజీవ దహనం చేశారు. ఒడిషాలోని కాంధమాల్‌లో 2008లో అత్యంత క్రూరమైన ఘటనలు జరిగాయి. హిందూత్వ శక్తులు బరితెగించి క్రైస్తవ సమాజంపై దాడి చేశాయి. దీనిపై విచారణ కోసం రిటైర్డ్ న్యాయమూర్తి ఏపీ షా నేతృత్వంలో నేషనల్ పీపుల్స్ ట్రిబ్యునల్ ఒక జ్యూరీని నియమించింది. కాంధమాల్‌లో జరిగిన ఘటనలు దేశానికే తలవంపులు తెచ్చాయని, అక్కడ మానవత్వం పూర్తిగా మంటగలిసిందని జ్యూరీ తెలిపింది. ఆ హింసాకాండలో సుమారు 100 మంది క్రైస్తవులు ప్రాణాలు కోల్పోగా 300 చర్చిలు ధ్వంసమయ్యాయి.
23 రాష్ట్రాల్లో ఈ తరహా హింసాత్మక ఘటనలు జరిగాయని, మూడు రాష్ట్రాల్లోని 13 జిల్లాల్లో భయానక వాతావరణాన్ని సృష్టించారని, క్రైస్తవాన్ని ఆచరించాలంటేనే భయపడే పరిస్థితి కల్పించారని సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ సంస్థ తెలిపింది. క్రైస్తవులు నివసించడానికి అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన దేశాల్లో భారత్ 10వ స్థానంలో ఉన్నదని ఓపెన్ డోర్స్ సంస్థ చెప్పింది.
బుజ్జగింపు రాజకీయాలు
క్రైస్తవుల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు ప్రధాని మోడీ గత సంవత్సరం బుజ్జగింపు ప్రయత్నాలు ప్రారంభించారు. కొందరు క్రైస్తవ మత గురువులను డిసెంబర్ 25న ఆహ్వానించి వారితో చర్చలు జరిపారు. క్రైస్తవ సమాజం చేస్తున్న సేవలను కొనియాడారు. దేశంలో అట్టడుగు వర్గాల వారిని వలలో వేసుకోవడానికి బీజేపీ పలు అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసింది. దళితులను ఆకర్షించడానికి ఏర్పాటు చేసిన సామాజిక్ సంరాష్ట్ర మంచ్ వాటిలో ఒకటి. ముస్లింలలోని షియాలు, పస్మందాలు, సుఫీ తెగల వారి ఓట్ల కోసం రాష్ట్రీయ ముస్లిం మంచ్ అనే సంస్థను కూడా స్థాపించింది. బీజేపీ నేతలు ఎన్ని హామీలు ఇచ్చినప్పటికీ అట్టడుగు వర్గాల వారు వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. వారి ఆగ్రహం లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
గో రక్షణ పేరుతో…
మాంసం రవాణా, విక్రయాలు చేసిన ముస్లింలపై గో సంరక్షణ పేరిట దేశంలో పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. దాద్రీ నుండి జునాయిడ్ వెళుతున్న ఓ రైలులో ఓ వ్యక్తిపై దాడి చేసి హింసించారు. ఆ తర్వాత ఇలాంటి కేసులు సుమారు వంద వరకూ నమోదయ్యాయి. ఇలాంటి దాడుల్లో 97 శాతం నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014 మేలో అధికారంలోకి వచ్చిన తర్వాతే జరిగాయని బిజినెస్ స్టాండర్డ్ పత్రిక తెలిపింది. గో సంబంధమైన 63 కేసులు నమోదైతే వాటిలో 32 ఘటనలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చోటుచేసుకున్నవేనని ఆ పత్రిక వివరించింది.