జోరు మీదున్న భారత్‌

India on the rise– సిరీస్‌ కాపాడుకునేందుకు పర్యాటక జట్టు యత్నం
– రాత్రి 7 నుంచి స్పోర్ట్స్‌-18లో లైవ్‌
ఢిల్లీ : స్వదేశంలో బంగ్లాదేశ్‌పై మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతున్న భారత క్రికెట్‌ జట్టు.. బుధవారం ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా జరుగబోయే రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. గ్వాలియర్‌లో తొలి టీ20 నెగ్గిన ఊపులో ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌ నేతత్వంలోని యువ భారత్‌.. ఢిల్లీలోనూ గెలిచి మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ను ఒడిసిపట్టుకోవాలని భావిస్తోంది. రిషభ్‌, అక్షర్‌, బుమ్రా, గిల్‌, జైస్వాల్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు అందుబాటులో లేకున్నా అభిషేక్‌, మయాంక్‌, నితీశ్‌ లాంటి యువ క్రికెటర్లతోనే సత్తా చాటింది. మరోవైపు తమకంటే తక్కువ అనుభవం ఉన్న జట్టుతో ఆడి తొలి టీ20లో దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న బంగ్లాదేశ్‌.. ఢిల్లీలో అయినా గెలిచి సిరీస్‌ ఆశలు నిలుపుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం నాటి మ్యాచ్‌ రసవత్తరంగా సాగనుంది. ఢిల్లీ పిచ్‌ బ్యాటర్లకు అనుకూలించే అవకాశాలు మెండుగా ఉండటంతో భారీ స్కోర్లు నమోదయ్యే చాన్స్‌ ఉంది.
సంజూ, అభిషేక్‌ ఏం చేసేనో?
రెగ్యులర్‌ ఓపెనర్లు గిల్‌, జైస్వాల్‌కు విరామంతో గ్వాలియర్‌లో ఓపెనర్లుగా వచ్చిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌, యువ సంచలనం అభిషేక్‌ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఈ ఇద్దరూ ఇన్నింగ్స్‌ను ధాటిగానే మొదలుపెట్టినా వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా శాంసన్‌కు వరుసగా అవకాశాలిస్తున్నా విఫలమవుతుండటం ఆందోళన కలిగించేదే. ఈ నేపథ్యంలో అతడికి నేటి మ్యాచ్‌ కీలకం కానుంది. అభిషేక్‌ భారీ ఇన్నింగ్స్‌ బాకీ ఉన్నాడు. తొలి మ్యాచ్‌లో కెప్టెన్‌ సూర్య, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా దూకుడుగా ఆడగా ఢిల్లీలోనే అదే ప్రదర్శనను పునరావతం చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. వీళ్ల దూకుడుతో టార్గెట్‌ను భారత్‌ 12 ఓవర్లలోనే ఊదేసింది. యువ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ రెడ్డి ఫర్వాలేదనిపించినా జట్టులో స్థానాన్ని కాపాడుకోవాలంటే ఇంకా మెరుగ్గా రాణించాల్సి ఉంది. గత మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన మయాంక్‌ యాదవ్‌ తన పేస్‌ పదును చూపిస్తే బంగ్లా బ్యాటర్లకు తిప్పలు తప్పవు. ఈ మ్యాచ్‌లో భారత్‌ తుది జట్టులో మార్పులేమీ చేయకపోవచ్చు.
సిరీస్‌ కాపాడుకునేందుకు..
తొలి టీ20లో బ్యాటింగ్‌ వైఫల్యంతో దారుణంగా ఓడిన బంగ్లాదేశ్‌.. ఢిల్లీలో మాత్రం పుంజుకోవాలని చూస్తోంది. లిటన్‌ దాస్‌, నజ్ముల్‌ హౌసేన్‌ శాంతో, మహ్మదుల్లా, తౌవిద్‌ వంటి హిట్టర్లు ఉన్నా వాళ్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు. మిరాజ్‌ ఒక్కడే ఉన్నంతలో ఫర్వాలేదనిపించాడు. కానీ ఢిల్లీలో మాత్రం ఆ తప్పులను మళ్లీ చేయకుండా పక్కా ప్రణాళికతో భారత్‌కు షాకిచ్చి సిరీస్‌పై ఆశలు కాపాడుకోవా లని పర్యాటక జట్టు భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో బంగ్లా బౌలింగ్‌ కూడా నాసిరకంగా ఉండటం ఆ జట్టుకు ఆందోళన కలిగించేదే.