భారత దేశం బంగారు దేశంగా మారాలి

– సెలబ్రిటీ రిసార్ట్స్ గణతంత్ర వేడుకల్లో రిజర్వ్ బ్యాంకు మేనేజర్ శ్రీమతి పరిమళ జయ లక్ష్మి
– మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
నవతెలంగాణ – హైదరాబాద్ : భారతదేశం బంగారు దేశంగా మారాలని సెలబ్రిటీ రిసార్ట్స్ లో గణతంత్ర వేదికలో పాల్గొన్న రిజర్వ్ బ్యాంక్ మేనేజర్ శ్రీమతి పరిమళ జయ లక్ష్మి పిలుపునిచ్చారు. వికసిత భారత్ 2047 లక్ష్యంగా భారతదేశ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని దానికోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. విద్యా,  వైద్యం చాలా ముఖ్యమైన అంశాలని ఈ రంగాలలో అభివృద్ధి సాధిస్తే అన్ని రంగాలు ముందుకు వెళ్తాయని ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని కోరారు. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందని దాని ఫలితాలు సాధారణ ప్రజలు పొందినప్పుడే రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు నెరవేరినట్లుగా భావించాలని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన అనేక హక్కుల ద్వారా ప్రజలు అభివృద్ధి చెంది దేశానికి ధీటైన పౌరులుగా ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్ అనేక వైవిధ్యాలకు నిలయమని ఈ క్రమంలో ఆడపిల్లలను రక్షించుకోవడం, కాపాడుకోవడం ప్రధాన కర్తవ్యం గా ఉండాలని మహిళలు అభివృద్ధిలో భాగమైనప్పుడే దేశం సర్వతో ముఖాభివృద్ధితో ముందుకు వెళుతుందని తెలిపారు. మహాత్మా గాంధీ బాబాసాహెబ్ అంబేద్కర్ లాలా లజపతిరాయ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి ఎందరో మహనీయుల త్యాగాల వల్ల లభించిన స్వాతంత్రాన్ని మనం భావితరాలకు అందించాలని యువత దారుల్లో వెళ్లకుండా విజయాలు సాధించేలా కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. విద్యార్థినీ విద్యార్థులు మరియు యువత ఎటువంటి కష్టాలు వచ్చినా ఎదిరించి నిలబడి పోరాడి ముందుకు సాగాలని క్షణికావేశంతో తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని తెలిపారు. కష్టాలు అందరికీ ఉంటాయని వాటిని అధిగమించి విజయాలు సాధించినప్పుడే జీవితం పరిపూర్ణమవుతుందని సూచించారు. రానున్న కాలంలో టూరిజం బలంగా విస్తరించే అవకాశం ఉన్నందున ఈ రంగంలో యువత మహిళలు కేంద్రీకరించి అభివృద్ధిలో భాగం కావాలని పిలుపనిచ్చారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా రిజర్వ్ బ్యాంక్ మేనేజర్ శ్రీమతి పరిమళ జయలక్ష్మి జెండావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సెలబ్రిటీ రిసార్ట్స్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ సేనా రెడ్డి, ఎండి రోహిత్ రెడ్డి, జనరల్ మేనేజర్ అమిత్ మండల్, రిసార్ట్స్ మేనేజర్ హారీ జోసెఫ్, ఫోటోగ్రాఫర్ మైకేల్ రాక్ లతోపాటు రిసార్ట్స్ సిబ్బంది పాల్గొన్నారు.