ఇండియా విజయం సాధించి తీరాలి

stalin– లేదంటే దేశమంతా మణిపూర్‌, హర్యానాలా తగలబడుతుంది : స్టాలిన్‌
చెన్నై: మోడీ ప్రభుత్వంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ తీవ్ర తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష కూటమి ఇండియా విజయం సాధించి తీరాలని లేకుంటే.. దేశమంతా మణిపూర్‌, హర్యానాలా తగలబడిపోతుందని అన్నారు. ‘స్పీకింగ్‌ ఫర్‌ ఇండియా’ అనే పాడ్‌కాస్ట్‌లో ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించారు. సోమవారం ఉదయం ప్రసారమైన ఈ ఎపిసోడ్‌ తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రసారమవుతున్నది. బీజేపీ వాగ్దానం చేసినట్టుగా ఒక్కొక్కరికి రూ.15 లక్షలు ప్రజలందరి ఖాతాల్లోనూ జమ కాలేదని, రైతుల ఆదాయం రెట్టింపు కాలేదని, రెండు కోట్ల ఉద్యోగాలు కల్పించలేదని అన్నారు. మత విద్వేషాల ముసుగులో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను తన కార్పొరేట్‌ స్నేహితులకు దోచిపెడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎయిర్‌ ఇండియా, విమానాశ్రయాలు, ఓడరేవులు బీజేపీకి సన్నిహితంగా ఉండే ప్రయివేట్‌ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని కప్పిపుచ్చేందుకు పలు రాష్ట్రాల్లో కుల, మతవిద్వేషాలను రెచ్చగొడుతోందని ధ్వజమెత్తారు. 2002లో గుజరాత్‌లో నాటిన ద్వేషం మణిపూర్‌, హర్యానాకు విస్తరించిందని అన్నారు.భారతదేశం మొత్తం మణిపూర్‌, హర్యానాగా మారకుండా ఉండాలంటే ప్రతిపక్ష కూటమి ఇండియా కచ్చితంగా విజయం సాధించితీరాలని అన్నారు. భిన్న సంస్కృతులతో కూడిన భారతదేశ వైవిధ్యాన్ని కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, మత సామరస్యం, ఫెడరలిజం, లౌకిక విధానాలు, సోషలిజం పునరుద్ధరణ కోసమే ఇండియా కూటమి ఏర్పడిందని అన్నారు.