సైనిక కూటమిలోకి జారుతున్న భారత్‌!

అమెరికా నేతృత్వంలోని వ్యూహంలో, భద్రతా
కూటముల్లో చిక్కుకోవడమంటే భారత్‌కు
దూరదృష్టి లేకపోవడమే అవుతుంది. చైనాతో
భారత్‌కు ఉన్నది ప్రాథమికంగా సరిహద్దు
వివాదమే. చైనా ఇటీవల తీసుకున్న చర్యల
కారణంగా వాస్తవాధీన రేఖ వద్ద శాంతి భద్రతల
పరిరక్షణ అనేది దిగజారుతోంది. రెండు దేశాలు
కూర్చుని మాట్లాడుకుని, పరస్పరం
పరిష్కరించుకోవాల్సిన సమస్యే ఇది. అయితే
ఓపికతో, కృత నిశ్చయం, దృఢదీక్షతో ఈ
ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది.
అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, ఇండియా ఈ నాలుగు దేశాలతో కూడిన క్వాడ్‌ క్రమంగా భద్రతా కూటమిగా రూపు దిద్దుకుంటోంది. ఈ గ్రూపునకు మొదట పెట్టిన పేరు – క్వాడ్రిలేటరల్‌ సెక్యూరిటీ డైలాగ్‌ – ఉద్దేశ్యం కూడా ఇదే. మే 15-17 తేదీల్లో కాలిఫోర్నియాలోని సన్నీల్యాండ్స్‌లో నాలుగు క్వాడ్‌ దేశాల మిలిటరీ చీఫ్‌లు జరిపిన సమావేశం ద్వారా ఈ భద్రతా కోణం ప్రముఖంగా తెరపైకి వచ్చింది. భారత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ అనీల్‌ చౌహాన్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు. ‘ఇండో-పసిఫిక్‌ కమాండ్‌’ కమాండర్‌ అడ్మిరల్‌ జాన్‌ సి.అక్విలినో అమెరికా తరపున పాల్గొన్నారు. హిరోషిమాలో జి-7 దేశాల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా క్వాడ్‌ సదస్సును కూడా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మిలిటరీ చీఫ్‌ల మొదటి సమావేశం జరిగింది. తొలుత మే 24న ఆస్ట్రేలియాలో ఈ సదస్సు జరగాల్సి ఉంది. అయితే అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తన పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. క్వాడ్‌ దేశాల నేతలు ముఖాముఖి సమావేశం కావడం ఇది మూడోసారి. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. అమెరికాకు సంబంధించి నంతవరకు, క్వాడ్‌ అనేది చైనాకు వ్యతిరేకంగా నిర్దేశించబడిన భద్రతా కూటమిగా ఉద్దేశించబడింది. ”స్వేచ్ఛా, బహిరంగ ఇండో-పసిఫిక్‌”, సముద్ర జలాల భద్రత, మానవతా, విపత్తు సహాయ కార్యకలాపాలకు సహకారం వంటి సాధారణ సూత్రీకరణల చాటున భారత్‌ క్వాడ్‌లో చేరింది.
గతేడాది ఫిబ్రవరిలో క్వాడ్‌ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌ మాట్లాడుతూ… క్వాడ్‌ అనేది ‘ఒకదాని కోసం, అంతేకానీ మరొకరికి వ్యతిరేకంగా కాదు’ అని వ్యాఖ్యానించారు. కానీ ఇదంతా కేవలం కుతంత్రం. చైనాను ఒంటరిని చేసి, ఎదుర్కొనేందుకు అమెరికా అనుసరించిన ఇండో-పసిఫిక్‌ వ్యూహానికి అనుగుణంగా భారత్‌ ఆ వలలో పడిపోయిందన్నది వాస్తవం. ఈ ఏడాది ఆగస్టులో మలబార్‌ నావికా విన్యాసాలు నిర్వహించాలన్నది సైనిక సహకారం పొడిగింపునకు సంబంధించిన మరో అంశం. ఈ విన్యాసాల్లో ఆస్ట్రేలియాను కూడా కలుపుకోనున్నారు. కాలిఫోర్నియా సమావేశంలో భారత్‌ పాల్గొనడంపై భారత్‌ భద్రతా సంస్థకు సంబంధించిన అధికారి ఒకరు మీడియాకు వివరించారు. ”సరిహద్దుల్లో చైనా దూకుడు వైఖరిని గమనంలోకి తీసుకుంటే సరిహద్దు సమస్యను ద్వైపాక్షికంగా పరిష్కరించుకునే ఉద్దేశ్యం లేనట్లు కనిపిస్తున్నందున, సరిహద్దుల్లో పిఎల్‌ఎ విశృంఖలమైన దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు క్వాడ్‌ వంటి బహుముఖ వేదికల నుండి సాయం తీసు కోవాలని భారత్‌ నిర్ణయించాల్సి వచ్చింది” అని చెప్పారు. అమెరికాతో, ఇండో-పసిఫిక్‌లోని అమెరికా మిత్ర దేశాలతో సైనిక సహకారంతో ముందుకు సాగడాన్ని భారత్‌ ఈ రకంగా సమర్థించుకుంది.
ఇండో-పసిఫిక్‌ వ్యూహంలో భారత్‌ను ఎందుకు కావాలనుకుందో, అసలు ఎలాంటి పాత్ర పోషించాలనుకుందో చెప్పడానికి అమెరికా వద్ద కచ్చితమైన కారణం లేదా సమాచారం లేదు. అమెరికాతో మోడీ ప్రభుత్వం పొత్తు పెట్టుకుంది కేవలం ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలోనే కాదు, పశ్చిమాసియాలో ఏర్పాటు చేసిన క్వాడ్‌లోనూ భారత్‌ చేరింది. ఇందులో భారత్‌, ఇజ్రాయిల్‌, అమెరికా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఉన్నాయి. దీన్నే ఐ2యు2గా కూడా పిలుస్తారు. మళ్ళీ అమెరికా ఆధ్వర్యంలోనే మే 7న సౌదీ అరేబియాలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సౌదీ ప్రధాని మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అమెరికా, భారత్‌, యుఎఇ జాతీయ భద్రతా సలహాదారులతో భేటీ అయ్యారు. భారత్‌కు అనుసంధానించబడే ప్రాంతంలో మౌలిక వసతులను నిర్మించడం, సహకారాన్ని బలోపేతం చేయడం ఈ సమావేశం ఎజెండాగా ఉన్నాయి. చైనా ప్రభావం పెరుగుతుండడం, పైగా దౌత్య సంబంధాలను పునరుద్ధరించు కోవడానికి, సాధారణ సంబంధాలను నెలకొల్పుకునేందుకు సౌదీ అరేబియా, ఇరాన్‌ల మధ్య ఒప్పందం కుదిరేలా చైనా దౌత్యపరమైన జోక్యం చేసుకోవడం పట్ల అమెరికా ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ చర్యను చూడాల్సి ఉంది.
చైనాకు వ్యతిరేకంగా అమెరికా తీసుకుంటున్న దూకుడు విన్యాసాలకు, భారత్‌ను కట్టడి చేసేందుకు తీసుకుంటున్న చర్యలకు వ్యూహాత్మక నిపుణులు, కార్పొరేట్‌ మీడియాలోని వ్యాఖ్యాతల నుండి ప్రశంసలు వచ్చాయి. భారత్‌-అమెరికా కూటమి ప్రయోజనాల గురించి, వారి ఆసక్తులు కలవడం గురించి ఆర్భాటంగా చెప్పుకుంటున్నారు. కానీ దానికి విరుద్ధంగా ప్రత్యామ్నాయ వైఖరికి ప్రజా కార్యాచరణలో ఎలాంటి స్థానం దక్కడం లేదు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో తన గుత్తాధిపత్యాన్ని పరిరక్షించుకోవడంలోనే అమెరికా ఆసక్తి కనబరుస్తోందన్నది ఇక్కడ గ్రహించాలి. ఎందుకంటే, చైనాకు పెరుగుతున్న బలం, దాని ప్రభావంతో అమెరికా గుత్తాధిపత్యం రాన్రానూ అధికంగా సవాలు చేయబడుతోంది. ప్రపంచంలో బహుళ ధృవ ప్రభావం పెరుగుతున్నప్పుడు, అమెరికాకు మిత్రపక్షాలుగా ఉన్న ఒక మోస్తరు దేశాలు కూడా తమ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని ధృఢంగా చెప్పుకోవాలని భావిస్తున్నప్పుడు, అమెరికా నేతృత్వంలోని వ్యూహంలో, భద్రతా కూటముల్లో చిక్కుకోవడమంటే భారత్‌కు దూరదృష్టి లేకపోవడమే అవుతుంది. చైనాతో భారత్‌కు ఉన్నది ప్రాథమికంగా సరిహద్దు వివాదమే. చైనా ఇటీవల తీసుకున్న చర్యల కారణంగా వాస్తవాధీన రేఖ వద్ద శాంతి భద్రతల పరిరక్షణ అనేది దిగజారుతోంది. రెండు దేశాలు కూర్చుని మాట్లాడుకుని, పరస్పరం పరిష్కరించుకోవాల్సిన సమస్యే ఇది. అయితే ఓపికతో, కృత నిశ్చయం, దృఢదీక్షతో ఈ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది.
అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య సంబంధాల్లో చైనా చాలా కీలక పాత్ర పోషిస్తున్నదన్న వాస్తవాన్ని గమనంలోకి తీసుకుంటే చైనాతో వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు బలహీనపడడం వల్ల భారత్‌కు కలిసొచ్చేది ఏమీ లేదు. గల్వాన్‌ ఘర్షణల అనంతరం కూడా సంబంధాల్లో కాస్తంత విరామం వచ్చినప్పటికీ 2022లో ద్వైపాక్షిక వాణిజ్యం పెరిగి 135.98 బిలియన్ల డాలర్లుగా ఉంది. చైనా ఆర్థిక వ్యవస్థ నుండి విడిపోవడం గురించి, బదులుగా ముప్పులేని ఆర్థిక సంబంధాల గురించి అమెరికా కూడా మాట్లాడడం ఆపేసింది. అయితే చైనాతో ఆర్థిక సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలని భారత్‌లోని కొన్ని వర్గాల్లో నెలకొన్న ప్రస్తుత ఆలోచనా ధోరణి కచ్చితంగా మనకే హాని కలిగిస్తుంది.
ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌కు అపారమైన ఆర్థిక అవకాశాలు ఉన్నాయి. తన స్వంత ప్రయోజనాలను మరింత ముందుకు తీసుకుని వెళ్ళేందుకు బహుళ ధృవ ప్రభావాన్ని పెంచుకుంటూ, ఇతర అన్ని ప్రధాన దేశాలతో, ప్రాంతాలతో ఫలవంతమైన సంబంధాలు నెలకొల్పుకునే స్థానంలో భారత్‌ ఉంది. అంతేకానీ అమెరికా ఒక్క దేశానికే కట్టుబడి ఉండిపోవడమనేది ముందుకు సాగే మార్గం కాదు.
(‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)