డిజిటల్‌ చెల్లింపుల్లో భారత్‌ టాప్‌

– ప్రపంచంలోనే అగ్ర స్థానం
– రెండో స్థానంలో బ్రెజిల్‌
న్యూఢిల్లీ : డిజిటల్‌ చెల్లింపుల్లో ప్రపంచంలోనే భారత్‌ అగ్రశ్రేణీ దేశంగా ఉంది. 2022లో 8.95 కోట్ల లావాదేవీలను నమోదు చేసిందని మైగవ్‌ఇండియా తన గణంకాల్లో వెల్లడించింది. దీంతో డిజిటల్‌ చెల్లింపుల జాబితాలో భారత్‌ టాప్‌లో ఉంది. భారత్‌ తర్వాత బ్రెజిల్‌ 2.92 కోట్లతో రెండో స్థానంలో, చైనా 1.76 కోట్ల లావాదేవీలతో మూడో స్థానంలో ఉండగా.. థాయిలాండ్‌ 1.65 కోట్లతో నాలుగో స్థానంలో, ఐదో స్థానంలో సౌత్‌ కోరియా 80 లక్షల లావాదేవీలను నమోదు చేసిందని మైగవ్‌ ఇండియా వెల్లడించింది. ”డిజిటల్‌ చెల్లింపుల విభాగంలో భారత్‌ ఆధిపత్యం చెలాయిస్తోంది. వినూత్న పరిష్కారాలు, విస్తృతమైన స్వీకరణ తో, నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు దారి చూపుతున్నాము. ” మైగవ్‌ ఇండియా పేర్కొంది. డిజిటల్‌ చెల్లింపుల్లో భారత్‌ ప్రథమ స్థానంలో ఉందని, దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రూపాంతరం చెందుతుందని ఇటీవల ప్రధాని మోడి పదే పదే చెబుతున్నారు. కానీ.. ప్రపంచంలోనే అతిఎక్కువ జనాభా కలిగిన భారత ప్రజల నిష్పత్తితో పోల్చితే.. చిన్న దేశాలు అంతకంటే మెరుగ్గా ఉండటం గమనార్హం. ఉదాహరణకు బ్రెజిల్‌ జనాభా 21 కోట్లు ఉంటే.. దాదాపు మూడు కోట్ల లావాదేవీలు జరిగాయి. అదే 140 కోట్ల జనాభా కలిగిన భారత్‌లో 8 కోట్ల లావాదేవీలు నమోద య్యాయి. ఈ రెండింటిని పోల్చి చూస్తే భారత్‌ ఇంకా వెనుకబడే ఉందని స్పష్టం అవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు.