జూన్‌ 9న భారత్‌, పాక్‌ ఢీ

జూన్‌ 9న భారత్‌, పాక్‌ ఢీ– న్యూయార్క్‌లో దాయాదుల సమరం
– ఐసీసీ 2024 టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌
న్యూఢిల్లీ : అంచనాలు నిజమయ్యాయి. అభిమానులు ఊహించినదే ఐసీసీ చేసింది!. దాయాది జట్లు భారత్‌, పాకిస్థాన్‌ ఒకే గ్రూప్‌లో చోటు చేసుకున్నాయి. భారత్‌, పాకిస్థాన్‌ పొట్టి ప్రపంచకప్‌లో జూన్‌ 9న న్యూయార్క్‌ వేదికగా తలపడనున్నాయి. ఈ మేరకు 2024 టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను ఐసీసీ శుక్రవారం విడుదల చేసింది. 20 జట్లు పోటీపడుతున్న మెగా ఈవెంట్‌ జూన్‌ 1న ఆరంభ మ్యాచ్‌తో మొదలై, జూన్‌ 29న బార్బడోస్‌లో ఫైనల్స్‌తో ముగియనుంది. 2024 టీ20 ప్రపంచకప్‌కు వెస్టిండీస్‌, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. టీ20 ప్రపంచకప్‌లో 20 జట్లు పోటీపడుతుండగా, తొమ్మిది వేదికల్లో 55 మ్యాచులు జరుగనున్నాయి. వెస్టిండీస్‌లోని బార్బడోస్‌, ట్రినిడాడ్‌, గుయాన, ఆంటిగ్వా, సెయింట్‌ లూసియా సహా అమెరికాలోని న్యూయార్క్‌, లాడర్‌హిల్‌, టెక్సాస్‌లు ప్రపంచకప్‌కు వేదికగా నిలువనున్నాయి. ప్రపంచకప్‌లో గ్రూప్‌ దశ మ్యాచులు జూన్‌ 1-18 వరకు జరుగనుండగా.. సూపర్‌8 మ్యాచులు 19-24 వరకు, సెమీఫైనల్స్‌ 26-27 వరకు జరుగుతాయి. టీమ్‌ ఇండియా తన తొలి మ్యాచ్‌లో పసికూన నేపాల్‌ను ఢకొీట్టనుంది. న్యూయార్క్‌లో జూన్‌ 5న నేపాల్‌తో ఆడనుంది. అదే వేదికపై పాకిస్థాన్‌తో 9న, యుఎస్‌ఏతో 12న ఆడనుంది. జూన్‌ 15న ఫ్లోరిడాలో కెనడాతో చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో తలపడనుంది. భారత్‌ గ్రూప్‌ దశ మ్యాచులు అన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనే జరుగనున్నాయి.
టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌లు :
గ్రూప్‌-ఏ : భారత్‌, పాకిస్థాన్‌, ఐర్లాండ్‌, కెనడా, అమెరికా
గ్రూప్‌-బి : ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్‌, ఓమన్‌
గ్రూప్‌-సి : న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, అఫ్గనిస్తాన్‌, ఉగాండ, న్యూగునియా
గ్రూప్‌-డి : దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌, నేపాల్‌