భారత్‌, విండీస్‌ వంద సవాల్‌

– క్వీన్స్‌ పార్క్‌లో ఇరు జట్ల మైలురాయి టెస్టు
– క్వీన్‌స్వీప్‌పై భారత్‌, సమంపై విండీస్‌ గురి
– నేటి నుంచి రెండో టెస్టు పోరు
– రాత్రి 7.30 నుంచి డిడి స్పోర్ట్స్‌లో
         భారత్‌, విండీస్‌ ‘వంద’ సమరానికి సిద్ధమయ్యాయి. 1948లో మొదలైన ఇరు జట్ల టెస్టు సవాల్‌.. 2023లో వంద సవాల్‌కు చేరుకుంది. మైలురాయి మ్యాచ్‌లో పుంజుకుని సిరీస్‌ సమం చేయాలని కరీబియన్లు, వంద టెస్టులో మరో ఏకపక్ష విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని టీమ్‌ ఇండియా భావిస్తున్నాయి. సిరీస్‌తో పాటు విలువైన డబ్య్లూటీసీ పాయింట్లపై కన్నేసిన రోహిత్‌ సేన నేడు క్వీన్స్‌పార్క్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. భారత్‌, వెస్టిండీస్‌ రెండో టెస్టు నేటి ఆరంభం.
నవతెలంగాణ-పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌
చారిత్రక వందో టెస్టుకు రంగం సిద్ధం. డొమినికాలో స్పిన్‌ మాయ నడువగా.. క్వీన్స్‌పార్క్‌లో పూర్తిగా పేస్‌ హవా కనిపించనుంది. క్వీన్స్‌పార్క్‌ మైదానంలో భారత్‌, వెస్టిండీస్‌ ముఖాముఖి వందో టెస్టుకు సిద్ధమవగా.. బ్యాటింగ్‌ మాంత్రికుడు విరాట్‌ కోహ్లి కెరీర్‌ 500వ మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్నాడు. మూడు ఫార్మాట్లలో కలిపి విరాట్‌ కోహ్లికి ఇది 500వ మ్యాచ్‌ కానుంది. దీంతో కోహ్లి స్పెషల్‌ మ్యాచ్‌లో ప్రత్యేక ప్రదర్శన చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. తొలి టెస్టులో తేలిపోయిన కరీబియన్లు రెండో టెస్టులోనైనా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలని భావిస్తుంది. పేస్‌కు అనుకూలించే పిచ్‌పై టెస్టు మ్యాచ్‌ మూడు రోజుల్లోనే ముగుస్తుందా? ఐదు రోజుల పోటీ కనిపిస్తుందా? ఆసక్తికరం.
కోహ్లిపైనే ఫోకస్‌
భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి కెరీర్‌ 500వ మ్యాచ్‌ ఆడనున్నాడు. దీంతో నేటి టెస్టులో ఫోకస్‌ మొత్తం కోహ్లిపైనే నెలకొంది. డొమినికాలో అర్థ సెంచరీ సాధించిన కోహ్లి.. మరీ నెమ్మదిగా ఆడాడు. మరి క్వీన్స్‌పార్క్‌లో ఎప్పటి నుంచో ఊరిస్తున్న శతకాన్ని పూరిస్తాడేమో చూడాలి. యువ బ్యాటర్లు శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌లకు తొలి టెస్టులో మెరిసే అవకావం రాలేదు. ఈ ఇద్దరు బ్యాటర్లు క్రీజులో నిలవాలని జట్టు మేనేజ్‌మెంట్‌ కోరుకుంటుంది. అవసరమైతే కిషన్‌ను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు పంపించినా ఆశ్చర్యం లేదు. విండీస్‌ టూర్‌ ముగిసిన ఐదు నెలల తర్వాత భారత్‌ మరో టెస్టు ఆడనుంది. దక్షిణాఫ్రికా పర్యటన రేసులో నిలవాలంటే అజింక్య రహానె ఓ మంచి ఇన్నింగ్స్‌ ఆడాల్సిన అవసరం ఉంది. లేదంటే, సఫారీ పర్యటనకు రహానెకు చోటు కష్టమే!. స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై అశ్విన్‌, జడేజా మాయ చేయగా.. ఇప్పుడు రెండో టెస్టులో పేసర్ల వంతు. మహ్మద్‌ సిరాజ్‌, జైదేవ్‌ ఉనద్కత్‌, శార్దుల్‌ ఠాకూర్‌లపై వికెట్ల వేట బాధ్యత ఉండనుంది. ఈ సవాల్‌ను పేసర్లు ఏ మేరకు తీసుకుంటారో చూడాలి.
గట్టి పోటీ ఇవ్వాలని..
తొలి టెస్టులో తేలిపోయిన ఆతిథ్య వెస్టిండీస్‌.. వైట్‌వాష్‌ ప్రమాదంలో పడింది. భారత స్పిన్నర్లను విండీస్‌ బ్యాటర్లు ఎదుర్కొలేకపోయారు. విండీస్‌ స్పిన్నర్లు భారత బ్యాటర్లకు సవాల్‌ విసరలేకపోయారు. అయితే క్వీన్స్‌పార్క్‌ పేస్‌ స్వర్గధామం కావటం.. విండీస్‌కు అనుభవజ్ఞులైన పేసర్లు ఉండటంతో రెండో టెస్టులో గట్టి పోటీ ఇచ్చేందుకు ఎదురు చూస్తుంది. యువ బ్యాటర్‌ అలిక్‌ అతానెజ్‌ తొలి టెస్టులో రాణించాడు. కఠిన పరిస్థితుల్లో 47, 28 పరుగుల ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. చివరి టెస్టులో అతానెజ్‌ విండీస్‌ బ్యాటింగ్‌కు సారథ్యం వహించనున్నాడు. బ్రాత్‌వేట్‌, చందర్‌పాల్‌, బ్లాక్‌వుడ్‌, కిర్క్‌ మెకెంజె, హోల్డర్‌ సైతం అంచనాల మేరకు రాణిస్తే కరీబియన్లు గట్టి పోటీ ఇవ్వగలరు.
తుది జట్లు (అంచనా) :
భారత్‌ : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, అజింక్య రహానె, రవీంద్ర జడేజా, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, శార్దుల్‌ ఠాకూర్‌, జైదేవ్‌ ఉనద్కత్‌, మహ్మద్‌ సిరాజ్‌.
వెస్టిండీస్‌ : క్రెయిగ్‌ బ్రాత్‌వేట్‌ (కెప్టెన్‌), చందర్‌పాల్‌, అలిక్‌ అతానెజ్‌, జెర్మెన్‌ బ్లాక్‌వుడ్‌, కిర్క్‌ మెకెంజె, జేసన్‌ హోల్డర్‌, జోషువ డ సిల్వ (వికెట్‌ కీపర్‌), రహీం కార్న్‌వాల్‌/కెవిన్‌, అల్జారీ జొసెఫ్‌, కీమర్‌ రోచ్‌, షానన్‌ గాబ్రియల్‌.
100
భారత్‌, వెస్టిండీస్‌కు టెస్టుల్లో ఇది 100వ ముఖాముఖి పోరు. కరీబియన్లు 30, టీం ఇండియా 23 టెస్టుల్లో నెగ్గగా.. 46 మ్యాచులు డ్రాగా ముగిశాయి.
500
విరాట్‌ కోహ్లికి ఇది కెరీర్‌ 500వ మ్యాచ్‌ కానుంది. కోహ్లి 110 టెస్టులు, 274 వన్డేలు, 115 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. కెరీర్‌ ఐదొందల మ్యాచ్‌ను నేడు విండీస్‌పై ఆడనున్నాడు.

21
భారత్‌పై వెస్టిండీస్‌ ఓ టెస్టు విజయం సాధించి 21 ఏండ్లు అవుతోంది. చివరగా 2002లో కరీబియన్లు భారత్‌పై టెస్టులో నెగ్గారు. ఆ తర్వాత ఇరు జట్లు 24 టెస్టుల్లో తలపడగా భారత్‌ 15 విజయాలు సాధించింది. 9 టెస్టులు డ్రాగా ముగిశాయి.