– ఈ ఫోరానికి 295కి పైగా సీట్లు
– ఇండియా ఫోరం నేతల భేటీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఇండియా మారుతుందని, ‘ఇండియా’ గెలుస్తుందని ప్రతిపక్షాల ఇండియా ఫోరం నేతలు స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల ఏడు దశల పోలింగ్ ముగిసిన సందర్భంగా శనివారం నాడిక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఇండియా ఫోరం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ (కాంగ్రెస్), సీతారాం ఏచూరి (సీపీఐ(ఎం)), డి. రాజా (సీపీఐ), శరద్ పవర్ (ఎన్‌సీపీ), ఫరూక్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), అఖిలేశ్ యాదవ్, రామ్ గోపాల్ యాదవ్ (ఎస్పీ), తేజస్వి యాదవ్ (ఆర్‌జేడీ), అనిల్ దేశారు (శివసేన), ఢిల్లీ, పంజాబ్, జార్ఖండ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవత్ మాన్ (ఆప్), చంపారు సోరెన్ (జెఎంఎం), సంజరు సింగ్, రాఘవ్ చద్దా (ఆప్), కల్పనా సోరెన్ (జెఎంఎం), టిఆర్ బాలు (డీఎంకెే), దీపాంకర్ భట్టాచార్య (సీపీఐఎంఎల్ న్యూడమోక్రసీ), ముఖేష్ సహాని (వికాశీల్ ఇన్సాన్ పార్టీ), జితేంద్ర అవద్ (ఎన్‌సీపీ) తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలోని కొన్ని లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగ నున్నందున తాము సమావేశానికి హాజరు కాబోమని టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ సమావేశానికి హాజరుకాలేదు. దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన సమావేశంలో లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించిన సన్నాహాలు, వ్యూహాలపై చర్చించారు. అలాగే టీవీల్లో ఎగ్జిట్ పోల్ చర్చలలో పాల్గొంటామని ‘ఇండియా’ బ్లాక్ ప్రకటించింది.
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు గెలుస్తాం : మల్లిఖార్జున్ ఖర్గే
సమావేశనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు గెలుస్తామని, ఇండియా ఫోరానికి 295కు పైగా సీట్లు వస్తాయని అన్నారు. కౌంటింగ్ రోజు సన్నాహాలను పరిశీలించడానికి ఇండియా ఫోరం నేతల సమావేశాన్ని నిర్వహించామన్నారు. పోరాటం ఇంకా ముగిసిపోలేదన్నారు. ఓట్ల లెక్కింపు రోజున అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, కౌంటింగ్ పూర్తయ్యే వరకూ కౌంటింగ్ హాల్ నుంచి బయటకు రాకూడదని సూచించినట్లు తెలిపారు. తాము తమ పూర్తి బలంతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశామని, దేశ ప్రజలు తమకు మద్దతు ఇస్తున్నందున సానుకూల ఫలితాలు వస్తాయనే విశ్వాసం ఉందని ప్రతిపక్ష నేతలు సమావేశంలో చెప్పారని తెలిపారు. కౌంటింగ్ సమయంలో ఫారం 17సి విషయంలో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు తమ ఆందోళనలను లేవనెత్తడానికి, వాటిని పరిష్కరించాలని ఎన్నికల సంఘాన్ని కోరడానికి నేడు (ఆదివారం) ఎన్నికల కమిషన్‌ను కలుస్తామని తెలిపారు. ”ఇది ప్రజల సర్వే. ప్రజలు ఈ సమాచారాన్ని మా నాయకులకు ఇచ్చారు. ప్రభుత్వ సర్వేలు ఉన్నాయి. వారి మీడియా స్నేహితులు కూడా లెక్కలు పెంచి బయటపెడతారు. కాబట్టి, మేము మీకు వాస్తవాల గురించి చెప్పాలనుకుంటున్నాం” అని ఖర్గే అన్నారు. ”బీజేపీ ప్రభుత్వం ఎగ్జిట్ పోల్స్‌తో ప్రచారానికి ప్రయత్ని స్తుందని, మేము ప్రజలకు నిజం చెప్పాలనుకుంటున్నాము” అని అన్నారు.
సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యకు చేరుకోగానే కనీస ఉమ్మడి కార్యక్రమం అమలులోకి వస్తుందని, అదే కొత్త ప్రభుత్వానికి పునాది అవుతుందని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ అన్ని చోట్ల నుండి అభిప్రాయాన్ని తీసుకున్న తరువాత ”ఇండియా ఫోరం 295 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తుందని మేము నమ్ముతున్నాం. బీజేపీకి దాదాపు 220 సీట్లు వస్తాయని అనుకుంటున్నాం. అదే సమయంలో ఎన్డీఏకు దాదాపు 235 సీట్లు వస్తాయి. ఇండియా ఫోరం బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు సాగుతుంది” అని అన్నారు.
సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ ”ఇండియా ఫోరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ప్రధాని మోడీ సముద్రం చూడటానికి వెళ్ళాడు. తనకు వ్యతిరేకంగా ఉన్న ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు” అని అన్నారు. ఫలితాలు ఇండియా ఫోరానికి అనుకూలంగా ఉన్నాయని, బీజేపీ ఓడిపోవడమే పెద్ద విషయమని ఆయన అన్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపారు సోరెన్ మాట్లాడుతూ జార్ఖండ్‌లో మేం (ఇండియా ఫోరం) చాలా మెరుగ్గా రాణిస్తామని, పది సీట్లకు పైగా గెలుస్తామని, ఇండియా ఫోరం 295 సీట్లు గెలుచు కుంటుందని అన్నారు. ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ ”ప్రజలు గెలుస్తున్నారు. ఇండియా గెలుస్తుంది. మాకు 295 ప్లస్ సీట్లు వస్తాయని మేము చెబుతున్నాం” అని అన్నారు. తమ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు ”జూన్ 4 తరువాత మిగిలిన వారితో కలిసి నిర్ణయిస్తాము” అని ఆయన చెప్పారు