– విరాళాల సేకరణలో ఇండియా, అమెరికాలో తేడా
– కమలాహారిస్ వైపు నల్లజాతి ఓటర్లు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ పోటీ చేస్తున్నట్టు ప్రకటన వెలువడిన తర్వాత ఆ పార్టీకి భారతీయ అమెరికా దాతల నుంచి విరాళాలు వచ్చి పడ్డాయి. ట్రంప్‌తో చర్చ జరిగిన తర్వాత బైడెన్ పోటీ నుంచి వైదొలగడం, కమలా హారిస్‌ను డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం వరించడం తెలిసిందే. అయితే విరాళాల వెల్లువ పోటీలో నిలిచిన హారిస్ వల్లనా లేక రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టేందుకు బైడెన్ ఆసక్తి చూపకపోవడం వల్లనా అనేది తెలియడం లేదు. పోటీ నుంచి బైడెన్ వైదొలిన తర్వాత కమలా హారిస్ కాకుండా డెమొక్రటిక్ పార్టీ తరఫున వేరే అభ్యర్థి బరిలో నిలిస్తే నల్లజాతి ఓటర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమై ఉండేది. భారతీయ అమెరికన్ ఓటర్లను చిన్నచూపు చూశారన్న చర్చ జరిగేది.
అమెరికాలో నివసిస్తున్న నల్లజాతి వారు నేటికీ నిర్ణయాత్మక శక్తిగా అవతరించలేదు. నల్లజాతి వారు అమెరికా అంతటా విస్తరించారు. అలా కాకుండా వారు కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉంటే ప్రాతినిధ్యం లభించి ఉండేది. అయితే ఏదైనా ఒక సమాజానికి ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి ఎన్నికలు జరగవు. భారతీయ అమెరికన్లు తగిన సంఖ్యలో ఓటు వేయరని దీని అర్థం కాదు. 2020 ఎన్నికలలో 74 శాతం పోలింగ్ జరిగింది. ఇతర అమెరికా జాతి సమూహాలతో పోలిస్తే నల్లజాతి వారు రాజకీయంగా క్రియాశీలకంగానే ఉంటున్నారు. అమెరికా పౌరసత్వం పొందిన (అమెరికాలో జన్మించిన వారు కాకుండా) భారతీయ సంతతికి చెందిన వారిలో అత్యధికులకు ఓటు హక్కు ఉంది. వీరిలో ఎక్కువ మంది విద్యావంతులే. మెట్రోపాలిటన్ నగరాలలో నివసిస్తున్న వారే. భారత్‌లో ఇలాంటి వారి ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంటుంది.
అమెరికా రాజకీయాలలో తమదైన ముద్ర వేసుకోవడానికి భారతీయ అమెరికన్లు అనుసరిస్తున్న వ్యూహంపై గత రెండు దశాబ్దాలుగా చర్చ నడుస్తోంది. ఉదాహరణకు జనాభాలో యూదు అమెరికన్లు 2.4 శాతం మాత్రమే ఉన్నప్పటికీ వారి ప్రభావం అధికంగా ఉంటోంది. రాజకీయ విరాళాల విషయంలో వైఖరులను ప్రభావితం చేసే అంశాలు అనేకం ఉంటాయి. ముఖ్యంగా తొలి తరం వలసదారులకు ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే స్వదేశాలలో వారి అనుభవాలను బట్టి రాజకీయ నిధుల విషయంలో వైఖరిని నిర్ణయించుకుంటారు.
ఇప్పుడు మన దేశంలో కొన్ని మినహాయింపులకు లోబడి పార్టీలు విరాళాలు సేకరించడం ఓ దోపిడీగా మారిపోయింది. మన దేశంలో అంత కాకపోయినా అమెరికా రాజకీయాలలో కూడా డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తోంది. అయితే కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. ముఖ్యంగా చట్టపరమైన లాబీయింగ్‌తో దానికి సంబంధం ఉంది. ఆ లాబీయింగ్ రాజకీయ ప్రమేయాన్ని అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తుంది.