భారత రాజ్యాంగం-వ్యవసాయ సంబంధాలు

Indian Constitution-Agricultural Relationsరాజ్యాంగ విరుద్ధంగా మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కేంద్రం అధీనంలోకి తీసుకొని రాష్ట్రాల హక్కు లను కాజేస్తున్నది. రాష్ట్రాల హక్కులలో భూ సమస్య, విద్య, వైద్య, సాగునీరు, తదితర అంశాలు ఉన్నప్పటికీి వాటిని కేంద్రం ఆధీనంలోకి తీసుకోవడానికి పార్లమెంట్‌లో చట్టాలు చేశారు. లోక్‌సభ, రాజ్యసభ చట్టాలు ఆమో దించిన తీరు కూడా మూజు వాణి ఒటుతో ఆమోదింపజేసుకున్నవే. ఇలాంటి కీలక బిల్లుపై చర్చ జరగకుండానే ఆమోదించి చట్టాలు చేశారు. వీటికి వ్యతిరేకంగా సంవత్సరానికి పైగా లక్షల సంఖ్యలో రైతులు చేసిన పోరాటానికి 2021 నవంబర్‌ 19న పార్లమెంట్‌లో చేసిన చట్టాలను ఉపసంహరిస్తూ ప్రధాని ప్రకటించారు. పార్ల మెంట్‌లో నవంబర్‌ 29న మూడు చట్టాలను ఉప సంహరిస్తూ సవరణ ప్రతిపాదించారు. అయిన ప్పటికీ పరోక్షంగా నల్ల చట్టాల భావాలను అమలు జరిపే విధంగా కేంద్ర ప్రభుత్వం జీవోలు విడుదల చేసున్నది. నియంత్రణ తొలగించడంతో నిత్యా వసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాను కోరుకున్న విధంగా ఫెడరలిజానికి హాని కలిగిస్తున్నది.
భూ సంస్కరణలు-కేంద్రం అనుసరించిన విధానం
భూ సంస్కరణల చట్టాలు చేయడం రాష్ట్ర జాబితాలో ఉన్న ప్పటికీ కేంద్రం ఒత్తిడి మేరకు రాష్ట్రాలు చట్టాలు చేశాయి. సీలింగ్‌ను కుటుంబ అవసర ప్రాతిపదికకు మించి నిర్ణయిం చడం వలన పేదలకు భూములు దక్కలేదు. 1973లో చట్టాలు చేసి 1975లో అమలు చేశారు. 2005 నాటికి మొత్తం దేశంలో 73,35,937 ఎకరాలు మిగులు భూమిగా తేల్చి, 64,96,471 ఎకరాలు సేకరించారు. అందులో 54,02,101 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశారు. నేటికీ లక్షల ఎకరాలు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. పట్టణ సీలింగ్‌ చట్టాన్ని సుస్తవస్థలో పెట్టారు. గ్రామీణ సీలింగ్‌ చట్టాలను అనేక రాష్ట్రాలు రద్దు చేయ డానికి కేంద్రం ఒత్తిడి తెస్తున్నది. ప్రభుత్వ అవసరాల పేరుతో రైల్వేలైన్లు, రవాణా హైవేలకు ఆనుకొని కిలోమీటర్‌ వరకు భూ సేకరణ చేయడానికి కేంద్రం చట్టం రూపొందించింది. ఈ విధంగా సేకరిస్తే మొత్తం భూమిలో 33శాతం భూమిని కేంద్రం సేకరించే హక్కు ఏర్పడుతుంది. రైతులకు తగిన పరిహారం ఇవ్వకుండా ఈ భూములను కార్పొరేట్‌లకు హస్తగతం చేస్తారు. స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత వ్యవసాయ ఉత్పత్తులలో స్వయం సమృద్ధి సాధించడానికి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో కేంద్రం, పంచవర్ష ప్రణాళికలను రూపొందించి పథకాలు కొనసాగించింది. 3వ పంచవర్ష ప్రణాళిక (1961- 66) రూ.11,600 కోట్లు, 4వ పంచవర్ష ప్రణాళిక రూ.24,880 కోట్లు వ్యయం చేసి అధికోత్పత్తి సాధించారు. బ్యాంకులు జాతీయం చేయడం, సంకరజాతి విత్తనాలు రూపొందించడం, మార్కెట్‌లలో గిట్టుబాటు ధర కల్పించడం, సాగునీటి వనరుల కల్పన, భూ సంస్కరణల అమలు తదితర చర్యలు చేపట్టడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతుల నుండి ఎగు మతుల స్థాయికి దేశం చేరుకుంది. అలాంటిది గత అనుభవాలను తమకు అనుకూలంగా మార్చుకొని బీజేపీ ప్రభుత్వం ఎగుమతుల స్థాయి నుండి దిగు మతుల స్థాయికి మార్చింది.
రాజ్యాంగం-హక్కులు
రాజ్యాంగం అర్టికల్‌ 246 ప్రకారం కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలను ప్రకటించడం జరిగింది.దేశంలో వ్యవసాయ పరిశోధనలను సంస్కరణల పేరుతో ఉపసంహరించి విదేశీ టెక్నాలజీని దిగుమతి చేసుకుంటు న్నాము. బడా కార్పొరేట్‌ కంపెనీలైన మాన్‌షాంటో, డూ- పాయింట్‌, కార్గిల్‌, సింజెంటాలకు అవకాశం కల్పించారు. దేశంలో 80 శాతం విత్తనరంగం ఈ కంపెనీల చేతిలోనే ఉన్నది. మాన్‌షాంటో తన కంపెనీని బేయర్‌కు అమ్మడం ద్వారా, బేయర్‌ కంపెనీ వ్యవసాయరంగంపై తమ పట్టును కొనసాగిస్తున్నది. ప్రస్తుతం దేశంలో వ్యవసాయ పరిశోధనలు పూర్తిగా తగ్గిపో యాయి. ఇతర దేశాల ఉత్పత్తులు ఇక్కడ సక్రమమైన ఫలితా లివ్వడం లేదు.
కేంద్రం రాష్ట్రాల మార్కెట్లపై పట్టు సాధించడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నది. గతంలో 580 మార్కెట్లలో ”ఈ-నామ్‌” మార్కెట్‌ పద్ధతిని తెచ్చింది. దేశంలో ఎక్కడినుండైనా వ్యాపారులు పాల్గొనవచ్చని చేసిన ప్రయత్నం విఫలమైనదని ప్రధాన మోడీ అంగీ కరించాడు. తర్వాత మార్కెట్లలో కార్పొరేట్‌ సంస్థల పెత్త నాన్ని సుస్థిరపర్చడానికి ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర జాబితాలో ఉన్న మార్కెట్లపై కేంద్రం చట్టాలు చేస్తున్నది. ఏటా 18 లక్షల కోట్ల వ్యవసాయ మార్కెట్‌ లావాదేవీలు సాగుతున్నవి. కనీస మద్ధతు ధరల అమలు జరుగకపోవడం వల్ల ఏటా రైతులు రూ.4 లక్షల కోట్లు నష్టపోతున్నారని ఆర్థిక వేత్త అశోక్‌ గులాటి ప్రకటించారు.
సహకార వ్యవస్థను ఇప్పటికే కేంద్రం హస్తగతం చేసు కుంది. దేశంలోని 92 వేల సహకార సంఘాలను విస్తరిం చడానికి చట్టాలలో మార్పులు తెచ్చింది. మరో 2 లక్షల సంఘాలను ఏర్పాటు చేస్తానని ప్రకటించింది. బహుళ రాష్ట్రాల సహకార సంఘాలను ఏర్పాటు చేయడానికి చట్టం చేసి, దాని నిర్వహణను కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్‌షాను నియ మించింది. గతంలో అమిత్‌ షా గుజరాత్‌ సహకార మంత్రిగా వున్నప్పుడు అక్కడి వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశాడు. ఎఫ్‌.పి.ఓ (ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ ఆర్గనైజేషన్‌)ను 10 వేల సంఘాలను ఏర్పాటు చేసి, వాటి వ్యాపార లావాదేవీలు కార్పొరేట్లకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలను మభ్య పెట్టడానికి సహకార రంగాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెబుతూనే ప్రజల భాగస్వామ్యాన్ని రద్దు చేసి, కార్పొరేట్ల హక్కులను సుస్థిరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం సహకార సంఘాల్లో గల 12 కోట్ల సభ్యుల వాటా ధనాన్ని కాజేయడానికి కేంద్రం పథకం రూపొందించి, అనుకూలంగా చట్టాలు చేస్తున్నది. ఇది సూటిగా రాష్ట్రాల హక్కులను కాజేయడమే.
ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలను కేంద్రం కార్పొరేట్‌లకు అనుకూలంగా పార్లమెంట్‌లో చట్టాలు చేస్తున్నది. ఈ మధ్య అడవుల్లో గనుల తవ్వకాలకు అనుకూలంగా చట్టం చేసింది. దీని వలన అడవుల్లో నివసిస్తున్న గిరిజనులకు ప్రమాదం ఏర్పడింది. వారు సాగుచేస్తున్న పోడు భూముల నుండి గెంటి వేస్తున్నారు. అడవులలోనే పుట్టి అక్కడే ఉంటున్న కోట్లాది మంది గిరిజనులకు ఈ చట్ట సవరణ ప్రమాదకరంగా మారింది. ఆహార పదార్థాల కల్తీ, జంతువులపై క్రూరత్వ నిషేదాలకు అనుగుణంగా చట్టా లను రూపొందించి గోవధ నిషేధం పేరుతో దళిత, గిరిజన, మైనార్టీలపై దాడులు చేస్తున్నారు. ఆహారపు ఆలవాట్లను మార్చివేస్తున్నారు. స్వయంపోషకత్వం పెంపుదల చేయకుండా దిగుమతులపై ఆధారపడుతున్నారు. అధికోత్పత్తి జరిగినప్పటికీ వంటనూనెలు, పప్పులు, పత్తి, పంచదార, జూట్‌, మాంసం, పాలు, పాల ఉత్పత్తులు ఏటా 5 లక్షల కోట్ల రూపాయల విలువ కలవి దిగుమతి చేసుకుంటున్నాము. తద్వారా మన ఉత్పత్తులపై ప్రభావం పడి రైతులు దెబ్బతింటున్నారు. 41 కోట్ల ఎకరాల సాగు భూమితో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న దేశంలో దిగుమతులు చేసుకోవడం వలన స్వదేశీ ఉత్పత్తులు దెబ్బ తింటున్నాయి. చివరికి హార్టికల్చర్‌ పంటలు, కూరగాయలు కూడా దిగుమతులు చేసుకుంటున్నాము.
రాష్ట్ర పట్టికను పరిశీలిస్తే భూమి హక్కులు రాష్ట్ర జాబితాలో ఉన్నాయి. కానీ కేంద్రం భూ సేకరణ చట్టానికి సవరణ తేవ డానికి ప్రయత్నించి విఫలమైంది. రాష్ట్రాలకే సవరణల బాధ్యతలను అప్పగించింది. ప్రణాళికా బోర్టులు రద్దుచేసి, నిటి ఆయోగ్‌ను ఏర్పాటు చేసి కౌలు చట్టాలను రూపొందించి అమలు చేయాలని రాష్ట్రాలను కోరింది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలలో కౌలు చట్టాలు ఉన్నాయి. వ్యవసాయ రుణాలు ఇవ్వ డంపై రిజర్వుబ్యాంక్‌ రాష్ట్రాలకు సూచనలు చేసింది. ఆ సూచ నల ప్రకారం రాష్ట్రాలలోని బ్యాంకులు తమ వ్యాపార ధనంలో 40 శాతం వ్యవసాయ రుణాలివ్వాలి. కానీ కేంద్రం అడ్డుపడి, రుణాలివ్వకుండా విధానాలు రుపొందిస్తున్నది. రాష్ట్ర ప్రభు త్వాలు రైతుల రుణాలు మాఫీ ప్రకటించినప్పుడు బ్యాంకుల నుండి నిధులు విడుదల కాకుండా కేంద్రం అడ్డుపడుతున్నది. ఫలితంగా రాష్ట్రాలు రుణ మాఫీ ప్రకటించినప్పటికీ, రైతుల వడ్డీ భారం పెరుగుతున్నది. బ్యాంకులు రుణాలివ్వకపోవడంతో ప్రయివేటు రుణాలపై ఆధారపడి వ్యవసాయం సాగిస్తున్నారు. వ్యవసాయ భూములు అన్యాక్రాంతం చేయడం, భూముల కొలతలు, రిజిస్ట్రేషన్‌ తదితర అంశాలన్నీ రాష్ట్రాల హక్కుల కిందికే వస్తాయి. పంటల ధరలు నిర్ణయిం చడం, సేకరించడం రాష్ట్రాలే చేయాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ఆశాస్త్రీయంగా వ్యవ సాయ ఉత్పత్తుల ధరలను నిర్ణయించి దేశ రైతులకు ఏటా రూ.4 లక్షల కోట్ల నష్టం కలిగిస్తూ, కార్పొరేట్‌లకు లాభాలు చేకూర్చి పెడుతున్నది. మార్కెట్‌లపై కార్పొరేట్‌ల అధికారాన్ని సుస్థిరం చేయడానికి జీవోలు విడుదల చేస్తున్నది. విత్తనాల పరిశోధన, విస్తరణ, బాధ్యతలు రాష్ట్రానికే ఉన్నప్పటికి రాష్ట్రాలు విత్తన చట్టం చేయకుండా కేంద్రం అడ్డుపడుతున్నది. 2004లో కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విత్తన బిల్లు నేటికి పెండింగ్‌లోనే ఉంది. రాష్ట్రాలు చట్టం చేయకుండా కేంద్రం బెదిరింపులు సాగి స్తున్నది. ప్రోసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేసి రైతులకు అదనపు ఆదాయం రాబట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలకు కేంద్రం విఘాతం కలిగిస్తున్నది. ముడి వ్యవసాయ ఉత్పత్తులను అమ్మడం వలన రైతులు నష్టపోతున్నారు.
ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమ తులు- దిగుమతుల ద్వారా రైతులు ఆర్థికంగా దెబ్బతింటున్నారు. మిగులు పంటలు ఎగుమతులు చేసి అవసరమైన పంటల ఉత్పత్తులను దిగుమ తులు చేయాలి. కానీ ప్రపంచంలోనే మొదటి స్థానంలోఉత్పత్తి అవుతున్న పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, కోళ్ళు, పత్తి, పంచదార ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాము. ఫలితంగా ఇక్కడి పంటలకు ఉత్పత్తి వ్యయం కన్నా తక్కువ లభిస్తు న్నది. దివాళా తీసిన రైతులు ఏటా 12,600 మంది 13 రాష్ట్రాల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యల నివారణకు ఏ ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. ఈ మధ్య బియ్యం ఎగుమతులను నిషేధించడంతో ఇక్కడ ధరలు తగ్గడమే కాక విదేశాలలో ధరలు పెరిగి అక్కడ ఉన్న వ్యాపారులకు కోట్ల డాలర్ల లాభాలు వచ్చాయి. జి-7 దేశాల ఆదేశాలకు లొంగి మన వ్యవసాయ విధానాన్ని రూపొందిస్తున్నారు. గతంలో తెచ్చిన మూడ నల్ల వ్యవసాయ చట్టాలను డబ్ల్యూటిఓ డైరెక్టర్‌ జనరల్‌ ఒత్తిడి మేరకే తేెవడం జరిగింది. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల దృష్ట్యా పార్లమెంట్‌లో ఆమోదించిన నల్ల చట్టాలను ఉపసంహరించుకోవడం చారిత్రా త్మకమే. సెజ్‌ల పేరుతో (పారిశ్రామిక) కేంద్రాలు ఏర్పాటు చేయాడానికి లక్షల ఎకరాల భూములను రాష్ట్రాలతో సంబంధం లేకుండా సేకరిస్తున్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా దశాబ్దాల తరబడి బీళ్లుగా పెడుతున్నారు. 140 కోట్ల జనాభా కలిగి ప్రపంచంలో మొదటి స్థానంలో వున్న దేశం ఆహార ధాన్యాల దిగుమతులకు చేరడం ఆందోళనకరం. ఆహారకొరత వలన ఇప్పటికే 40 కోట్ల మంది ఇబ్బందులు పడుతున్నారు. 80 కోట్ల మంది పౌష్టికాహార లోపంతో రక్తహీనతకు గురయ్యారు. అందువలన రాజ్యాంగ సూత్రాలు అదేశించిన ప్రకారం రాష్ట్రాల జాబితాలో ఉన్న వ్యవసాయాన్ని కేంద్రం హస్తగతం చేసుకోరాదు. రాష్ట్రాల హక్కులను కాపాడాలి.
సెల్‌ : 990098660
సారంపల్లి మల్లారెడ్డి