ప్రమాదంలో భారత ప్రజాస్వామ్యం

Indian democracy at stake– దేశంలో అనధికార అత్యయిక పరిస్థితి
– విద్యార్థులు, న్యాయవాదులు క్రియాశీల పాత్ర పోషించాలి : ఐలూ జాతీయ ప్రధాన కార్యదర్శి పివి.సురేంద్రనాథ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆల్‌ఇండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలూ) జాతీయ ప్రధాన కార్యదర్శి పివి.సురేంద్రనాథ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఐలూ, లా స్టుడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎల్‌ఎస్‌ఎఫ్‌ఐ) హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం సయుక్తంగా నిర్వహించిన రాష్ట్ర సదస్సును ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ భారత రాజ్యాంగం మౌలిక సూత్రమైన లౌకిక భావన, ప్రజాస్వామ్య విలువలను రక్షించుకోవాల్సిన బాధ్యత విద్యార్థులు, న్యాయవాదులపై ఉందని గుర్తు చేశారు. ఫ్రొఫెసర్‌ జి.మోహన్‌ గోపాల్‌ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో అనధికార అత్యయిక పరిస్థితి నెలకొందని అన్నారు. ఇందిరాగాంధీ చీకటి పాలనను ప్రస్తుత పాలకులు గుర్తు చేస్తున్నారని విమర్శించారు. న్యాయవ్యవస్థకు, సమాజానికి మధ్య సంబంధాలను దెబ్బతీసే విధంగా పాలకులు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని 80 శాతం మంది ప్రజలను 20 శాతం ఉన్నత వర్గాలు పాలించే వ్యవస్థను రూపుమాపాలని పిలుపునిచ్చారు. ప్రజలందరికి సమాన రాజకీయ, సామాజిక ప్రాతినిధ్యం ఉండేలా చూడాల్సిన బాధ్యత చట్టసభలు, న్యాయవ్యవస్థపై ఉందని గుర్తు చేశారు. ఐలూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి నర్ర శ్రీనివాసరావు మాట్లాడుతూ కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చే వారు నిబద్ధతతో పని చేయాలని సూచించారు. ఐలూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పార్థసారధి, ఉపాధ్యక్షులు కొల్లి సత్యనారాయణ మాట్లాడుతూ న్యాయ విద్యను అభ్యసించే వారికి ఐలూ వృత్తి విలువల్ని నేర్పడానికి ఎప్పుడూ కృషి చేస్తుందని అన్నారు. ఈ సదస్సులో లా స్టుడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర కన్వీనర్‌గా అలీహైదర్‌, కో కన్వీనర్‌గా క్రాంతి రణదీవే, సభ్యులుగా సంపత్‌, అనిల్‌, అలీజాన్‌, అశోక్‌, సాయితేజతో పాటు మొత్తం 36 మంది ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఐలూ హైదరాబాద్‌ అధ్యక్ష, కార్యదర్శులు సి.రామచంద్రరెడ్డి, డి.ప్రవీణ్‌, రంగారెడ్డి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.వనజ, ఎ.వెంకటేశ్వర్లు, మాధవరెడ్డి, ఎం.వెంకటేశ్వర్లు, ఎన్‌,వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.