ప్రపంచానికి తలమానికం భారత ప్రజాస్వామ్యం

– గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి తలమానికమని రాష్ట్ర గవర్నర్‌ జిష్టుదేవ్‌ వర్మ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఇంజినీర్స్‌ భవన్‌లో జరిగిన ఫోరంఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (ఎఫ్‌ఎఫ్‌జీజీ) 15వ ఆవిర్భావ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 90 కోట్ల ఓటర్లున్న ఈ దేశంలో ఎన్నికల నిర్వహణ నుంచి మొదలుకుని పాలన వరకు ఎదురయ్యే సమస్యలన్నింటినీ ఎప్పటికప్పుడు అధిగమిస్తూ దేశం అన్ని రంగాల్లో ముందుకు పోతున్నదని పేర్కొన్నారు. ఒక్క ఓటు తేడాతో అటల్‌బిహారి వాజ్‌పేయి ప్రభుత్వం పార్లమెంట్‌ విశ్వాస పరీక్షలో ఓడిపోయిందనీ, అందువల్ల ప్రజాస్వామ్యానికి ఎవరూ అతీతులు కారని అభిప్రాయపడ్డారు. కార్యనిర్వాహక వ్యవస్థలో మరింత పారదర్శకత రావాల్సిన అవసరముందని చెప్పారు. అందుకు, విద్యార్థులు, యువకులు, మేధావులతో పాటు మొత్తం పౌర సమాజం చొరవ చూపాల్సిన అవపసర ముందని పేర్కొన్నారు. దేశంలో, రాష్ట్రంలో సుపరిపాలన, పౌరహక్కుల రక్షణకు ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ చేస్తున్న సేవలు మరింతగా విస్తరించాలని ఆకాంక్షించారు. లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్‌ జయప్రకాష్‌ నారాయణ మాట్లాడుతూ ప్రజల సామాజిక స్థితిగతులను మార్చే విద్య, వైద్యం ఉపాధి రంగాలపై కాకుండా పాలకవర్గాలు అనవసరమైన పథకాల పేరుతో సంపదను పక్కదారి పట్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లోనే మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని సూచించారు. తెలంగాణ విద్యాకమిషన్‌ చైర్మెన్‌ ఆకునూరి మురళి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతీ ఏటా రూ.18 వేల కోట్లు ఉపాధ్యాయుల జీతభత్యాలకు ఖర్చు చేస్తున్నా, విద్యా ప్రమాణాలు ఎందుకు పెరగడం లేదని ప్రశ్నించారు. ఇంకా 6వేల సూళ్లల్లో సింగిల్‌ టీచర్లు కొనసాగుతుండగా, 7వేల స్కూళ్లు ఒకే ఒక్క గదిలో నడుస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యావ్యవస్థలో సమూల మార్పు రావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎఫ్‌జీజీ అధ్యక్షులు ఎం. పద్మనాభరెడ్డి, కార్యదర్శి సోమ శ్రీనివాస్‌, మాజీ ఐపీఎస్‌ అధికారి అంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.