భారత ఎగుమతులు బలహీనం

భారత ఎగుమతులు బలహీనం– దిగుమతుల్లో 7.5 శాతం వృద్ధి
– పెరిగిన వాణిజ్య లోటు
న్యూఢిల్లీ : ప్రపంచ మార్కెట్‌లో భారత ఉత్పత్తులకు డిమాండ్‌ తగ్గింది. ప్రస్తుత ఏడాది జులైలో దేశీయ సరుకుల ఎగుమతులు 1.4 శాతం తగ్గి 33.98 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇదే సమయంలో దిగుమతులు 7.5 శాతం పెరిగి 57.48 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఎగుమతులు తగ్గి.. దిగుమతులు పెరగడంతో భారత వాణిజ్య లోటు 23.5 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఇంతక్రితం జూన్‌ మాసంలో ఈ లోటు 20.98 బిలియన్లుగా నమోదయ్యింది. గతేడాది ఇదే జులై మాసంలో భారత ఎగుమతులు, దిగుమతులు వరుసగా 34.39 బిలియన్లు, 53.49 బిలియన్లుగా చోటు చేసుకున్నాయి. 2024 జులైలో భారత వాణిజ్య లోటు 21.35 బిలియన్లుగా ఉండొచ్చని ఆర్థిక నిపుణులు వేసిన అంచనాల కంటే ఎక్కువగా చోటు చేసుకోవడం గమనార్హం.
”ప్రపంచవ్యాప్తంగా పలు సవాళ్లు నెలకొన్నప్పటికీ భారత ఎగుమతులు కొనసాగుతున్నాయి. ఇంజనీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో మంచి పెరుగుదల ప్రతిబింబిస్తుంది. ముడి చమురు ధరల వల్ల ఎగుమతుల్లో నెలవారీ హెచ్చు తగ్గులు ఎక్కువగా ప్రభావితమవుతాయి” అని వాణిజ్య కార్యదర్శి సునీల్‌ బర్త్వాల్‌ అన్నారు. గడిచిన జులైలో సేవల రంగం ఎక్స్‌పోర్ట్స్‌ 28.43 బిలియన్లుగా, దిగుమతులు 14.55 బిలియన్లుగా నమోదయ్యాయి. ఇంతక్రితం జూన్‌లో ఈ ఎగుమతులు 28.82 బిలియన్లుగా, దిగుమతులు 15.02 బిలియన్లుగా చోటుచేసుకున్నాయి. అంతర్జాతీయంగా అనేక సవాళ్లు నెలకొన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 800 బిలియన్‌ డాలర్ల ఎగమతులను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వాణిజ్య శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ ఇటీవల పేర్కొన్నారు.