మనసులను రంజింపచేసే భారతీయ వాయిద్యాలు

Mind blowing Indian instrumentsహరిప్రసాద్‌ చౌరాసియా, పండిట్‌ రవిశంకర్‌, ఉస్తాద్‌ అబ్దుల్‌ ఆలీఖాన్‌, బిస్మిల్లా ఖాన్‌, జాకీర్‌ హుస్సేన్‌, మన తెలుగు కిన్నెర వాయిద్య కారుడు మొగిలయ్య వంటి వారు మదిలో మెదలగానే మనసు ఆనందంతో పులకరిస్తుంది. ”ప్రజా నాట్య మండలి” కళాకారులు ఎన్నో చైతన్య గీతాలు ఆలపిస్తూ, స్థానికంగా లభ్యమయ్యే సంగీత వాయిద్యాలతో సమాజాన్ని చైతన్యవంతం చేయడం మనం చూస్తూనే ఉన్నాం.. అటువంటి సంగీత కళాకారులు వివిధ వాయిద్యాల ద్వారా భారతీయులనే కాకుండా ప్రపంచ సంగీత ప్రియులను అలరించారు.
మన దేశంలో శాస్త్రీయ సంగీతం, జానపద సంగీతం శతాబ్దాల కాలం నుంచి మతపరమైన క్రతువుల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, కర్మ కాండల సమయంలో, వినోదాత్మక సమయాల్లో, వివాహాలు, పండుగల వేళ, అనేక కార్యక్రమాల్లో వివిధ సంగీత వాయిద్యాలు ద్వారా భార తీయ సంస్కృతిలో కీలకపాత్ర పోషి స్తున్నాయి. వివిధ సంగీత విద్వాంసులు సంగీతంతో మన నైపుణ్యా లను అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకుని వచ్చారు. ఇళయరాజా, కే.వి.మహదేవన్‌, ఘంటసాల, ఆదినారాయణ రావు, చక్రవర్తి, ఏ.ఆర్‌.రెహమాన్‌, బాలీవుడ్‌ ఆర్‌.డి.బర్మన్‌, ఓ.పి.నయ్యర్‌, బప్పి లాహిరి, కళ్యాణ్‌ జీ ఆనంద్‌ జి వంటి ప్రముఖ సంగీత దర్శకులు జ్ఞప్తికి వస్తే మన భారతీయ సంగీత వాయిద్యాలకు ఆధునికిత జోడించి దేశ ప్రజలను, ప్రపంచ వాసులను తమ తమ సంగీ తాలతో ఓలలాడించారు. ముఖ్యంగా మన దేశంలో సంగీత వాయిద్యాలు, న్రత్యం వంటి అంశాలు వేదాల్లో, న్రత్య శాస్త్రంలో లిఖించబడినట్టు తెలుస్తోంది. సంగీత దర్శకులకైనా, సంగీత కళాకారులకైన కొన్ని ప్రత్యేకమైన వాయిద్యాలు అంటే ఇష్టం ఉంటుంది. అటువంటి వాటిలో మనదేశంలో అనాదిగా కొన్ని సంగీత వాయిద్యాలు ముఖ్యంగా వీణ, మ్రదంగం, తబలా, వేణువు (ఫ్లూట్‌), సితార, తంబుర, సరోద్‌, సారంగి, ఘటం వంటివి వివిధ ధ్వనులు చేస్తూ సమయానుకూలంగా ప్రజలకు తన్మయత్వాన్ని, ఆధ్యాత్మిక చింతనను కలుగజేస్తున్నాయి. మానసిక ప్రశాంతతకు ఉల్లాసానికి ప్రతీకగా సంగీత వాయిద్యాలు పేరు పొందాయి.
సితార వాయిద్యం ఉత్తర భారతదేశంలో, మృదంగం దక్షిణ భారతదేశంలో ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకు న్నాయి. భారత నృత్య రీతులు ఉత్తర భారత దేశంలో హిందూస్తానీ, దక్షిణ భారతదేశంలో కర్ణాటక బాగా అభివృద్ధి చెందుట మూలంగా దానికి అనుగుణంగా వివిధ సంగీత వాయిద్యాలు కూడా అభివృద్ధి చెందాయి. అంతే కాకుండా వివిధ దేవాలయాల్లో పూజా సమయంలో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వివిధ వాయిద్యాలు, సంగీత కళాకారుల పాత్ర ఆనాటి నుంచి నేటి వరకూ అప్రతిహతంగా కొనసాగుతోంది. భారతదేశంలో దాదాపు అన్ని దేవాలయాల్లో, దేవుని మందిరాల్లో సంగీత వాయిద్యాలు, ధ్వనులు లేనిదంటూ ఉండదు అంటే అతిశయోక్తి కాదు. భక్తి గీతాల ఆలపనలో, దేవున్ని మేలుకొలుపుటలో, వివిధ మతపరమైన క్రతువుల్లో సమయానుకూలంగా సంగీత వాయిద్యాలు వాడుతూ ఉంటారు. ఇక పండుగలు, పర్వదినాలు, వేడుకలు, పెండ్లిండ్లు ఫంక్షన్‌ సందర్భాల్లో వివిధ సంగీత వాయిద్యాలతో ప్రజలకు సంతోషం, ఆనందం, ఆహ్లాదం కల్పిస్తుంది . ఇక సినిమాల్లో టాకీ సినిమాలు ప్రారంభమైన నాటి నుండి సంగీతం మమేకం అయింది.
బ్రిటిష్‌ వారు రాక తరువాత భారతీయ సంగీతంలో ఆధునిక పోకడలు సంతరించుకుంది. అంతేకాకుండా ఎలక్ట్రానిక్‌ సంగీత వాయిద్యాలు అభివృద్ధి చెందాయి. జాజ్‌, రాక్‌ వంటి వివిధ సంగీతాలు కూడా భారతీయ సంగీతంలో మమేకమయ్యాయి. భారతీయ సంగీత కళాకారులు కూడా వివిధ కొత్త సంగీత వాయిద్యాలపై పట్టు సాధిస్తూ ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నారు. అందులో ప్రస్తుతం ఏ.ఆర్‌.రెహమాన్‌ ఒకరు. అనాదిగా భారతీయ సంగీత వాయిద్యాలు దాదాపు అన్నీ ”తీగ వాయిద్యాలే” .. ఒకో వాయిద్యం ఒకో రకమైన ధ్వని/ శబ్దం చేస్తూ మనలను అలరిస్తుంది.
”సితార” వాయిద్యం ప్రపంచ ప్రసిద్ధిగాంచినది. అంతే కాకుండా గ్రామాల్లో డ్రమ్ములు, డోలు, సన్నాయి, డోలక్‌, కంజిర, బూర వంటివి వివిధ సందర్భాల్లో వినియోగిస్తారు. ఆధునిక కాలంలో టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందడంతో మరింత చక్కని సంగీతం అందుబాటులోకి వచ్చింది. కొంతమందికే అందుబాటులో ఉన్న సంగీతం ఈరోజు ఆసక్తి ఉన్న వారందరికీ అందుబాటులోకి రావడంతో కొత్త కొత్త సంగీత కళాకారులు, దర్శకులు తమ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. భరతనాట్యం, కూచిపూడి, కథాకళీ వంటి అనేక నృత్య రీతులు దేశంలో నేటికీ ఆదరణ ఉండటంతో, దీనికి అనుగుణంగా కూడా సంగీత వాయిద్యాలు అభివృద్ధి చెందుతున్నాయి. సంగీత విభావరి, వేడుకలు, రకరకాల శాస్త్రీయ, జానపద సంగీత పోటీలు నిర్వహిస్తున్నారు. మ్యూజికల్‌ కన్సర్ట్‌ నిర్వహిస్తూ, కొన్ని సంస్థలు అవార్డులు ఇస్తున్నారు. సంగీత అకాడమీలు, సంస్థలు, మీడియా, ఛానెల్స్‌, ఆధ్యాత్మిక కేంద్రాలు సంగీతాన్ని ప్రోత్సాహించడం వల్ల సంగీత వాయిద్యాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇక చలనచిత్రాల్లో పాటలు, డాన్స్‌ ఒరవడి అర్ధ శతాబ్దపు కాలంగా పెరుగుతున్నది. దీంతో సంగీతానికి మరింత గిరాకీ పెరిగింది. కొత్త కొత్త సంగీత వాయిద్యాలతో పాటు నూతన సంగీత రీతులు సంతరించుకున్నాయి. వీణ, గిటార్‌, పియోనో, హార్మోనియం, వయోలిన్‌ వంటివి విరివిగా వాడుతున్నారు.
ఫ్లూట్‌ వాయిద్యకారుడు హరిప్రసాద్‌ చౌరాసియా, పండిట్‌ రవిశంకర్‌ సితార, బిస్మిల్లా ఖాన్‌ షెహనారు, జాకిర్‌ హుస్సేన్‌ తబలా, పన్నాలాల్‌ ఘోష్‌ వేణువు ఊదటంలో, సరోద్‌ వాయిద్య కారుడు ఉస్తాద్‌ అంజాద్‌ ఆలీఖాన్‌, ఘటం వాయిద్యకారుడు వినాయకవర్మ, మన తెలంగాణా కిన్నెర వాయిద్యకారుడు మొగిలయ్య వంటి వారు ఎందరో భారతీయ సంగీత వాయిద్యాలకు పేరు ప్రఖ్యాతులు తెచ్చారు. ఇంకా చెప్పాలంటే రాజస్థాన్‌లోని ఖర్తాల్‌, జల తరంగ్‌, గుమ్మడికాయ, వెదురుతో చేసే అనేక వాయిద్యాలు సంగీతాన్ని అందిస్తున్నాయి. దేశంలో జరిగే అనేక గిరిజన ప్రాంతాల్లో జాతరల్లో, వివిధ నృత్యాల్లో స్థానికంగా లభ్యమయ్యే అనేక
వస్తువులతో సంగీత వాయిద్యాలు
తయారు చేసి సందర్భానుసారంగా సంగీతం అందిస్తున్నారు. కర్మకాండలు సమయంలోను కొన్ని రకాల ప్రత్యేక వాయిద్యాలతో సంగీతం అందించుట జరుగుతుంది.. అనగా మానవుని జీవిత గమనంలో జరిగే భక్తి, ఆధ్యాత్మిక, వినోదం, విప్లవ, విషాద , ఆధ్యాత్మిక , వివాహాలు పుట్టినరోజు, పండుగల, వివిధ వేడుకలు సమయంలో సందర్భానుసారంగా అనాదిగా భారతీయ వాయిద్యాలు, కళాకారులు ప్రజలకు సంగీతం అందిస్తున్నారు… మానసిక ప్రశాంతతకు, ఆధ్యాత్మిక చింతనకు, ఆహ్లాదం ఆనందం కలిగిస్తున్న సంగీత వాయిద్యాలు భారతీయ సమాజంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి అని అనుటలో అతిశయోక్తి లేదు… వీటిని సంరక్షించుకుంటూ, అనేక మంది కళాకారులు తయారవ్వాలి అని, ప్రభుత్వాలు సరైన ప్రోత్సాహం అందివ్వాలి అని కోరుకుందాం.
ఇప్పటికే మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంగీత కళాకారులకు తగిన రీతిలో ప్రోత్సహం ఉంది. మొగలయ్యను తెలంగాణ ప్రభుత్వం కొన్ని నెలలు క్రితం ఆర్థికంగా ఆదుకుంది. కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులతో సత్కరిస్తోంది. హైదరాబాద్‌లో రవీంద్ర భారతి, విజయవాడలో ”తుమ్మలపల్లి కళాక్షేత్రం” కాకినాడలో ”సరస్వతి గాన సభ” రాజమండ్రిలో ”ఆనం కళాక్షేత్రం” వంటి ప్రదేశాల్లో తరచూ సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తూ సంగీతాన్ని, నృత్యాన్ని ప్రోత్సాహిస్తున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువుతో పాటు సంగీత వాయిద్యాలు పట్ల పిల్లలకు ఆసక్తి కల్పించాలి. సంగీతం ద్వారా మానసిక అనారోగ్యాలు నశించి, నూతన ఉత్తేజం, ఉత్సాహం కలిగిస్తుంది అని కూడా వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో దాదాపు అందరూ అన్ని రంగాల్లో ఒత్తిడి స్ట్రెస్‌తో ఉంటున్నారు. దీనికి తక్షణ పరిష్కారం సంగీతమే.. మానసిక ప్రశాంతతకు, ఉల్లాసానికి, ఆథ్యాత్మిక చింతనకు సంగీతమే పరమ ఔషధం అని భావిద్దాం.!!
ఐ.ప్రసాదరావు 6305682733