భారతీయ పోర్టులు – జాతి సంపదకు నిలయాలు

భారతీయ పోర్టులు -
జాతి సంపదకు నిలయాలుపోర్చుగీసు నుంచి ‘వాస్కో డా గామా’ 1498లో సముద్రమార్గం ద్వారా భారత్‌ భూభాగంలో కాలు మోపడం ద్వారా ఆధునిక సముద్రమార్గానికి ద్వారాలు తెరిచారు. మే 20, 1498లో వాస్కో డా గామా ఆధ్వర్యంలోని బృందం మలబార్‌ తీరంలో ఉన్న కప్పడ్‌ బీచ్‌ కాలికట్‌ (ప్రస్తుతం కోచికుడ్‌) దగ్గర కాలు మోపారు. దీంతో ప్రపంచ సముద్రయానంతో భారత్‌ బంధం మరోసారి బలపడినట్లు అయింది. సుమారు 7,517 కి.మీ సముద్ర తీరం కలిగిన అతిపెద్ద ద్వీపకల్పాల్లో ఒకటిగా భారత్‌ నిలిచింది.
భారత్‌ పోర్ట్‌, షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం భారత వాణిజ్యం మొత్తం వ్యాపారంలో 68% శాతం సముద్ర మార్గాన జరుగుతుంది. ముఖ్యంగా 12 మేజర్‌ ప్రభుత్వ పోర్టులు, ఒక మేజర్‌ ప్రైవేటు పోర్ట్‌, 187 చిన్న, మధ్యతరహా పోర్టుల ద్వారా భారత వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఒక్క 2023 సంవత్సరంలో 795 మిలియన్ల టన్నుల వ్యాపారం జరిగింది. కాండ్లా, మర్మగోవా, మంగుళూరు, విశాఖపట్నం, ముంబై, కోల్‌కత్తా, చెన్నై వంటి మేజర్‌ పోర్టులు భారత్‌ వాణిజ్యంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అంతేకాకుండా చిన్న, మధ్యతరహా పోర్టులు మహారాష్ట్రలో 53, గుజరాత్‌లో 40, కేరళలో 21, తమిళనాడులో 15, ఆంధ్రప్రదేశ్‌లో 13, కర్ణాటకలో 10, ఇంకా 50 వరకు ఇతర ప్రాంతాల్లో ఉన్న పోర్టులు భారత్‌ వాణిజ్యంలో సముచిత స్థానం పోషిస్తున్నాయి. మరెన్నో గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టులు, రైలు మార్గాలతో అనుసంధానం చేస్తూ భారత్‌ వ్యాపార వాణిజ్య కార్యకలాపాలను ఉరకలెత్తిస్తున్నారు.
భారత సంస్కృతి సంప్రదాయాలు, వాణిజ్యం, ఆర్థికాభివృద్ధి సముద్రయానంతో ముడిపడి ఉందన్న విషయం చారిత్రాత్మక వాస్తవం. సుమారు క్రీ.శ. 2400 క్రితమే హరప్పా నాగరికత కాలంలో గుజరాత్‌లోని ‘లోథల్‌ పోర్ట్‌’ ద్వారా ‘మొసపటోమియా’ తో వాణిజ్య సంబంధాలున్నాయని ఆధారాలు ఉన్నాయి. హరప్పా ప్రజలు తయారు చేసిన హస్తకళలు, బొమ్మలు, మట్టి పాత్రలు (పాటరీ), పూసలు, సుగంధ ద్రవ్యాలు, విలువైన రాళ్ళు ఎగుమతయ్యేవి. ‘ముజరీస్‌’ ప్రస్తుతం కేరళలో ఉన్న ఈ పోర్ట్‌ ద్వారా రోమ్‌, ఈజిప్టు, అరేబియా, చైనా దేశాలతో వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. రోమన్‌ చక్రవర్తులకు వస్త్రాలు, పూసలు, రత్నాలు, సుగంధ ద్రవ్యాలు ఇక్కడి నుంచే ఎగుమతయ్యేవని చరిత్ర చెబుతోంది.
ప్రస్తుతం గుజరాత్‌లో ఉన్న ‘బారిగాజా’ ఓడరేవు ద్వారా రోమన్‌ చక్రవర్తులకు విలువైన వస్త్రాలు, వజ్రాలు, సుగంధ ద్రవ్యాలు ఎగుమతి అయ్యేవని ఆధారాలు ఉన్నాయి.
ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌ లో ఉన్న ‘తామ్రలిప్త’ ఓడరేవు పట్టణం ద్వారా దక్షిణాసియా దేశాలతో వర్తక వాణిజ్య సంబంధాలు ఉన్నాయని ‘మహాభారతం’ గ్రంథం తెలుపుతుంది. తమిళనాడులోని ‘కోర్కై’ ఓడరేవు పాండ్యుల కాలంలో ఇతర దేశాలకు ముత్యాలు, సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు ఎగుమతి అయ్యేవని తమిళ చరిత్ర గ్రంథాల ద్వారా తెలుస్తోంది.
మధ్యయుగ కాలంలో కాలికట్‌, సూరత్‌, కాంబే పోర్టులు అరబ్‌, పర్షియా, చైనా, ఇతర యూరోపియన్‌ దేశాలతో వర్తక వాణిజ్య కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా వర్ధిల్లాయి. ఇతర దేశాల వారు కూడా వచ్చి సుగంధ ద్రవ్యాలు, మిరియాలు, వస్త్రాలు, ఏనుగు దంతాలు (ఐవరీ) వస్తువులు కొనుగోలు చేసి వెళ్లేవారట. ఈ విధంగా అనేక వస్తువులు కొనుగోలు, ఎగుమతి దిగుమతులు జరుగుతూ భారత సముద్ర తీరం, ఓడరేవులు వ్యాపార లావాదేవీలకు కేంద్ర బిందువుగా విరాజిల్లునట్లు చరిత్ర చెబుతోంది.
‘సూరత్‌ ఓడరేవు’ అతిపెద్ద పోర్ట్‌గా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా సిల్క్‌ వస్త్రాలు, వజ్రాలు, విలాసవంతమైన వస్తువులు అరబ్‌ దేశాలకు ఎగుమతి అయ్యేవి. అందుచేతనే ఈ ఓడరేవు ‘గేట్‌ టు మక్కా’గా ప్రసిద్ధి చెందింది. 16వ శతాబ్దం వరకూ పోర్చుగీసు ఆధ్వర్యంలో ఉన్న గోవా పోర్ట్‌ యూరప్‌, ఆఫ్రికా, ఆసియా దేశాలకు వాణిజ్య వ్యాపార లావాదేవీలకు కేంద్ర బిందువుగా విరాజిల్లింది. ముఖ్యంగా విలువైన కలప, బియ్యం, సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు ఎగుమతి అయ్యేవి. కేరళలో ఉన్న ‘కొల్లాం’ పోర్ట్‌ ద్వారా సుగంధ ద్రవ్యాలు, అల్లం, మిరియాలు, కలప అరబ్‌ దేశాలకు, చైనా దేశానికి ఎగుమతి అయ్యేవి.
ఇక బ్రిటిష్‌ కాలంలో కూడా పోర్టులను అభివృద్ధి చేశారు. పోర్చుగీసు, డచ్‌, ఫ్రెంచ్‌ పాలనలో ఏర్పాటు చేసిన పోర్టులే కాకుండా నూతనంగా బొంబాయి, కలకత్తా, చెన్నై, కేరళా పోర్టులను అభివృద్ధి పరిచి, ఇతర దేశాలతో ఎగుమతి దిగుమతులు భారీగా చేయడానికి పునాదులు వేశారు. బ్రిటన్‌ దేశానికి మనదేశం నుంచి చాలా వస్తువులు తరలించారు.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత పోర్టులు ఆధునీకరణకు, విస్తరణకు కృషి ప్రారంభించారు. 1963లో ‘ది మెజర్‌ పోర్ట్‌ ట్రస్ట్‌ ఏక్ట్‌’ చేశారు. జె.యన్‌.పి.టి అతిపెద్ద ట్రస్ట్‌గా పేరుగాంచింది. 20వ శతాబ్దం నుండి నేటి వరకూ పోర్టులు అభివృద్ధి చేయడమే కాకుండా, విదేశాలతో వాణిజ్యం పెంపొందించే విధంగా తయారు చేశారు.
మనదేశ ఆర్ధికాభివృద్ధిలో పోర్టులు కీలక పాత్ర పోషిస్తున్నాయనేది వాస్తవం. వికసిత భారత్‌ సాధ్యం కావాలంటే దేశ సముద్రయానాన్ని సరికొత్తగా అభివృద్ధి పథంలో నడిపించాలి. అందుకే ‘సాగరమాల’ అనే కార్యక్రమం ప్రవేశపెట్టి, అమలు చేస్తున్నారు. పారిశ్రామికాభివృద్ధికి పోర్టులే మూల స్తంభాలని గ్రహించాలి. ముంద్ర, దీనదయాళ్‌, పారదీప్‌, విశాఖపట్నం, ముంబై, కోల్‌కత్తా, చెన్నై వంటి మేజర్‌ పోర్టులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మేజర్‌ పోర్టులను, రాష్ట్ర ప్రభుత్వాలు మైనర్‌ పోర్టులను అభివృద్ధి పరుస్తున్నాయి. 2018-19లో ఒక్క గుజరాత్‌ రాష్ట్రంలో మైనర్‌ పోర్టులు ద్వారా 542 యమ్‌.యమ్‌.టి, మహారాష్ట్రలో 2022-23 లో 71 మిలియన్‌ టన్నుల వ్యాపారం జరిగింది. సముద్ర తీర రాష్ట్రాల్లో సుమారు 187 పోర్టులు మనదేశ వర్తక వాణిజ్య కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుత భారత పోర్టుల సామర్థ్యం 2604.99 యమ్‌.ఈ.పి.ఏ గా ఉన్నట్లు తెలుస్తోంది. 17 మిలియన్ల టి.ఈ.యీ కంటైనర్లు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఈ విధంగా పూర్వ కాలం నేటి వరకు దేశ వర్తక వాణిజ్య కార్యకలాపాల్లో, విదేశాలతో వాణిజ్యం పెంపొందించేందుకు, ఎగుమతి దిగుమతులు ద్వారా భారీ ఆదాయం సంపాదించడానికి, ఉపాధి అవకాశాలు పెంచడంలో మన సముద్రయానం కీలక పాత్ర పోషిస్తున్నాయనేది నిర్వివాదాంశం. ప్రభుత్వ రంగంలో ఉండవలసిన పోర్టులు నేడు మనదేశంలో ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడంతో ప్రభుత్వ రాబడికి గండి పడుతుంది.
ముఖ్యంగా కార్మికులు, ఉద్యోగుల భవిష్యత్తు ఆందోళనకరంగా మారుతుంది. దేశ సంపద కార్పొరేట్‌ సంస్థలకు, వ్యక్తుల పరం అవుతుంది. చారిత్రికంగా భారతీయ పోర్టులు జాతి సంపదకు, అందరికీ, అన్ని రంగాల అభివృద్ధికి ఆలంబనగా ఉన్నాయి. ఇదే వరవడి కొనసాగాలని మనందరం ఆశిద్దాం.. సముద్రయానం మన అందరికీ చంద్రయానంతో సమానం.

– ఐ.ప్రసాదరావు,
6305682733