భారత స్టార్టప్‌లకు పైసల కష్టాలు

Indian startups are struggling with money– ఫండింగ్‌కు విదేశీ సంస్థల విముఖత తగ్గించుకుంటున్న పెట్టుబడులు
– నిరుత్సాహంలో ఔత్సాహికవేత్తలు
భారత్‌లోని స్టార్టప్‌ సంస్థలు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. నిధుల సమీకరణలో తీవ్ర సవాళ్లను చవి చూస్తున్నాయి. గతేడాది నిధుల లభ్యత భారీగా తగ్గిపోయింది. భారత ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోందని మోడి ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి.. స్టార్టప్‌ల్లో పెట్టుబడులకు పొంతన లేకుండా పోతోంది. ఒకప్పుడు భారతీయ టెక్‌ వెంచర్లలో వందల కోట్ల డాలర్ల పెట్టుబడికి ఆసక్తిని చూపిన ఇన్వెస్టర్లు ఇటీవల నెమ్మదించారు. దీంతో నిధుల కొరతతో ఔత్సాహిక వ్యాపారవేత్తలు నిరాశ చెందుతున్నారు.
న్యూఢిల్లీ : ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల వేదిక పేటియంలో చోటు చేసుకున్న పరిణామాలు ఇన్వెస్టరల్లో విశ్వాసాన్ని మరింత దెబ్బతీశాయి. వందలాది ప్రారంభ దశ స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెట్టిన ఇండియాస్‌ బ్లూమ్‌ వెంచర్స్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ కార్తిక్‌ రెడ్డి గతేడాదిలో 12 డీల్‌లతో పోలిస్తే ఈ ఏడాది దాదాపు ఎనిమిది మాత్రమే కొత్త ఒప్పందాలు చేయాలని తమ సంస్థ యోచిస్తోందని చెప్పారు. మరిన్ని కంపెనీలలో నిధులను విస్తరించడానికి బదులుగా తనకు నమ్మకంగా ఉన్న సంస్థలలో పెద్ద మొత్తాలను పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నామన్నారు. ప్రస్తుతం పోర్టుపోలియో లాభాలను పరిశీలించినప్పుడు మరింత ఇన్వెస్ట్‌ చేయడానికి ఉత్సాహంగా లేమని రాయిటర్స్‌తో ఆయన అన్నారు. రాయిటర్స్‌ ఇటీవల విదేశీ, స్వదేశీ పెట్టుబడి సంస్థల్లోని ఆరుగురు ఎగ్జిక్యూటివ్‌లు, ఇద్దరు సీఈఓలను ఇంటర్యూ చేసింది. ప్రస్తుత ఏడాది జనవరి, ఫిబ్రవరిలో భారత స్టార్టప్‌లు 900 మిలియన్‌ డాలర్ల (రూ.7500 కోట్లు)ను సేకరించాయి. ఇది ఆరేండ్ల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. కాగా 2023లో 8 బిలియన్ల (రూ.64వేల కోట్లు) నిధులు సమీకరించాయని వెంచర్‌ ఇంటెలిజెన్స్‌ డేటా చూపిస్తోంది. ఇది 2021లో సేకరించిన రికార్డు 36 బిలియన్లు లేదా 2022లో 24 బిలియన్లకు చాలా దూరంగా ఉంది. గతేడాది భారతీయ స్టార్టప్‌లకు మూడింట రెండు వంతుల నిధులు తగ్గాయని సీబీఐఇన్‌సైట్స్‌ డేటా వెల్లడించింది. అమెరికాలోని స్టార్టప్‌లలో 36 శాతం తగ్గుదలతో పోల్చితే భారత స్టార్టప్‌లు చాలా వెనుకబడి పోయాయి. ప్రస్తుత వాతావరణంలో స్టార్టప్‌ల్లో పెట్టుబడుల ద్వారా పెద్ద రాబడిని పొందగలమని తాను భావించడం లేదని కార్తిక్‌ రెడ్డి పేర్కొన్నారు.
పేటీఎం షేర్లు 80 శాతం మేర పడిపోవడం, ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ విలువ 22 బిలియన్ల నుంచి 2 బిలియన్ల దిగువకు పడిపోవడం భారత స్టార్టప్‌లపై సానుకూలాంశాలను దెబ్బతీశాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ రంగంలో ఫండింగ్‌ తగ్గిపోవడంతో పాటు భారీగా ఉద్యోగాలు ఊడుతోన్న విషయం తెలిసిందే. స్టార్టప్‌లకు నిధుల మద్దతులో బీజేపీ ప్రభుత్వం సరైన విధానాన్ని అనుసరించకపోవడం, బడా కార్పొరేట్లకు కొమ్ము కాయడం వల్లే అవి ఒత్తిడిలోకి జారుకుంటున్నాయనే విమర్శలు పెరుగుతున్నాయి.