– వీడియో షేర్ చేసిన అమెరికా అధికారి
వాషింగ్టన్: అమెరికాలో చట్టబద్ధమైన పత్రాలు లేకుండా నివసిస్తున్న భారతీయుల్లో మొదటి బ్యాచ్‌ను తీసుకుని అమెరికా విమానం భారత్‌కు వచ్చిన వేళ వారిపట్ల అమెరికా ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశాయి. అలాంటిదేమీ లేదంటూ కేంద్రం దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం కూడా చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా అధికారి ఒకరు కాళ్ళకు, చేతుళ్ళకు బేడీలు వేసిన భారతీయుల వీడియోనొకదాన్ని షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. అమెరికా సరిహద్దు గస్తీ బృందం (యూఎస్ బోర్డర్ పెట్రోల్) చీఫ్ మైఖేల్ డబ్ల్యు బాంక్స్ 24 సెకన్ల నిడివి గల వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు. దానితో పాటు తన ప్రకటన కూడా జతపరిచారు. ”చట్టవిరుద్ధంగా అమెరికాలో నివసిస్తున్న వారిని విజయవంతంగా భారత్‌కు తిప్పి పంపించాం.
సైనిక రవాణా విమానాన్ని ఉపయోగించి అంత దూరం, దాదాపు 24గంటల పాటు ప్రయాణించి వారిని గమ్యానికి తిప్పి పంపించగలిగామంటే ఇమ్మిగ్రేషన్ చట్టాల అమలు పట్ల మా నిబద్ధత స్పష్టమవుతోంది.” అని ఆ ప్రకటనలో వ్యాఖ్యానించారు. ఆ వీడియోలో సి-17 రవాణా విమానం వెనుక తలుపు తెరిచి వుండగా, పెద్ద కార్గోను ఎక్కించారు.
ఆ తర్వాత వరుసగా కొంతమంది విమానంలోకి ఎక్కుతుండడం కనిపిస్తోంది. వీడియో ముందుకు సాగుతున్న కొద్దీ విమానంలోకి ఎక్కుతున్న వారి కాళ్ళకు సంకెళ్ళు వేసినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. కరడుగట్టిన నేరస్తులు, యుద్ధ ఖైదీలను తరలించేటపుడు సాధారణంగా కనిపించే పరిస్థితులు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి.