విధ్వంసక అభివృద్ధి – అసమానతల భారతం

Disruptive Development - India of Inequalitiesఆంబానీల ఇంట పెండ్లి వేడుకలు అట్టహాసంగా, అత్యంత వైభవోపేతంగా జరిగాయి. ఈ పెండ్లిలో జరిగిన సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియా వేదికగా పెండ్లి దృశ్యాల రీల్స్‌ తెగ వైరలై ఊదరగొట్టాయి. హాలీవుడ్‌, బాలీవుడ్‌, టాలీవుడ్‌ల నుంచి ప్రముఖ హీరోలు హాజరయ్యారు. రాజకీయ నాయకులు, క్రికెటర్లు, ఇతర సెలబ్రిటీలు కూడా వచ్చారు. పెండ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఎంతో ఖరీదైన విలాస వస్తు బహుకరణలు, వేడుకలు, అందుకు చేసిన ఖర్చు అందరిని ఆశ్చర్యపరిచాయి. ఈ పెండ్లికి రూ.5వేల కోట్లు ఖర్చు పెట్టారన్న వార్తలతో అంతా ముక్కున వేలేసుకున్నారు. దేశం మారిపోతోంది. వెలిగిపోతోంది అంటే ఇదేనేమో! ఇక పెట్టుబడికి పుట్టిన విషపు మీడియా దేనికి ఇవ్వని ప్రధాన్యతనిస్తూ ఈ పెండ్లి వేడుకల చుట్టూ తిరిగింది. ఈ పెండ్లికి చేసిన ఖర్చుపై దేశమంతటా చర్చ జరుగుతున్నది. ఆర్థిక అసమానతలు ఎంత తీవ్రస్థాయికి చేరుకున్నాయో ఇలాంటి ఘటనలు తెలియజేస్తున్నాయని మేధావుల విశ్లేషణ. 1991 నుంచి దేశంలో అమలౌతున్న ప్రపంచీకరణలో భాగంగా మొత్తం జాతి సంపదను (వనరులు) బడా బాబులకు కట్టపెట్టిన కారణంగా దేశ సంపద కొద్ది మంది చేతుల్లో పోగుబడింది. ధనవంతులు మరింత ధనవంతులు కాగా, పేదల స్థితి రానురానూమరింత దిగజారి పోతూ ఉంది. దేశపాలకులు అనుసరిస్తున్న ప్రయివేటీకరణ విధానాల వల్లనే దేశంలో ఆర్ధిక అసమానతలు మరింత పెరిగిపోతున్నాయి. ఆకలి, ఆరోగ్యం, విద్య, వైద్యం, న్యాయం, చట్టంతో సహా అన్నింట్లోనూ అసమానతలు ఎక్కువవుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక అసమానతలను పెంచటమే ప్రపంచీకరణ ముఖ్య లక్షణం.
దాదాపు రెండు దశాబ్దాల పాటు బ్రిటీష్‌ వలస పాలకులు మన వనరులు దోచుకొని ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన తర్వాత 1947లో స్వాతంత్య్రం వచ్చినా దేశ పునర్మిణం జరగలేదు. దేశ ప్రజలకు ఏం కావాలి? తినేందుకు ఇంత ముద్ద… కట్టుకొనేందుకు కాస్త బట్ట.. ఉండేందుకు ఒక గూడు… కావాలి. తర్వాత ఉచిత విద్య, వైద్యం కావాలి. ఇవేమి ప్రజలకు అందలేదు. ఇప్పటికీ ఇవే ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. అంటే సరైన ప్రజా ఆర్థిక విధానాలు అనుసరించటం లేదని తేలిపోయింది. దేశ ప్రజల దుర్భర జీవితాలను అనేక అంతర్జాతీయ నివేదికలు చెబుతునే ఉన్నాయి. ఆక్స్‌్‌ఫాం నివేదిక ప్రకారం దేశంలో అత్యంత ధనవంతులైన కొద్ది మంది వద్దే దేశ సంపదలో 90శాతం పోగుపడింది. ఇందులో ఐదు శాతంగా ఉన్న అపర కుబేరుల వద్ద 62 శాతం సంపద ఉంది. ఒక్క శాతంగా ఉన్న ఆదానీ, అంబానీల వద్ద 40.6 శాతం సంపద కేంద్రీకృతమై ఉంది. మిగతా దేశంలోని అశేష ప్రజానికం వద్ద కేవలం మూడు శాతం సంపద మాత్రమే ఉందని పై నివేదిక ప్రకటించింది. 2012-2021 మధ్య దేశంలో సృష్టించిన బడిన సంపదలో 40శాతం ఈ సంపన్నులే దోచుకున్నారు. ప్రపంచాన్ని ఆర్థికంగా కుదిపేసిన కరోనా మహమ్మారీ కాలంలో కూడా ఈ కుబేరుల లాభాలు తగ్గకపోగా 121 శాతం పెరిగాయి. నిమిషానికి రూ.2.5 కోట్లు, రోజుకు రూ.3.068 కోట్లు ఈ కుబేరుల ఖాతాల్లోకి చేరాయి. కండ్లు బైర్లు కమ్మే ఈ నిజాన్ని నివేదిక బయట పెట్టింది.
మరోవైపు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సంఖ్యలో పేదలు 228.9 మిలియన్‌ మంది భారతదేశంలోనే ఉన్నారని, గత నాలుగు సంవత్సరాల్లో దేశంలో నిరుపేదల సంఖ్య 19 కోట్ల నుంచి 35 కోట్లకు చేరిందని చెప్పింది. పై పెచ్చు 2020-21 సంవత్సరాలలో బీజేపీ ప్రభుత్వం బడా పారిశ్రామిక వేత్తలకు పన్నుల మినహాయింపు ద్వారా రూ.1,03,285.44 కోట్లు లబ్ది చేకూర్పిందని వివరించింది. దేశంలో 100 మంది కుబేరుల దగ్గర 54.12లక్షల కోట్లు, అపరకుబేరులైన ఆదానీ, అంబానీ లాంటి వారికి 27.52 లక్షల కోట్లు అదపపు లాభం చేకూర్చి ‘మేమున్నది సంపన్నులకు సేవ చేయడానికేనని’ చాటుకుంది మోడీ ప్రభుత్వం. బీజేపీకి అత్యంత ఆప్తుడైన అదానీకి కరోనా కాలంలో కూడా 8 రెట్లు ఆదాయం పెరిగి 10.98 లక్షల కోట్లకు అధిపతి అయి దేశంలోనే అత్యంత ధనవంతునిగా అవతరించాడు. పూనావాల, శివనాడర్‌, బిర్లాలు 2022లో ఇరవై శాతం ఎక్కువ సంపదను పోగేసుకున్నారు.
కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత్‌ వృద్ధి సాధిస్తుందని ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నదని గోది మీడియా పెద్ద ఎత్తున్న ప్రచారం చేస్తున్నది. కాని వాస్తవం ఇందుకు విరుద్ధంగా ఉంది. ప్రపంచ ఆకలి సూచిలో భారత్‌ స్థానం క్రమంగా క్షీణిస్తుంది. దేశంలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. 67 లక్షల పసిపిల్లలు రోజు మొత్తం పస్తులుండే పరిస్థితి దేశంలో ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ జాతీయ కుటుంబ సర్వే (2019-21) తేల్చి చెప్పింది. ఆకలి బాధలో పశ్చిమ ఆఫ్రికా దేశాల తర్వాత స్థానం భారతేనని పేర్కొంది. ముఖ్యంగా బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్‌లో ఈ సంఖ్య ఎక్కువ. ఇక్కడ 24.7 శాతం పిల్లలు పస్తులుంటున్నారు. అలాగే ఛత్తీస్‌గఢ్‌లో 24.6 శాతం, జార్ఖండ్‌లో 21 శాతం, రాజస్థాన్‌లో 19.8 శాతం, అస్సాంలో 19.4శాతం మంది పిల్లలు ఆకలితో అలమ టిస్తున్నారని సర్వే వెల్లడించింది. మొత్తంగా దేశంలో రోజంతా ఏమి తినని పిల్లల సంఖ్య 19.3 శాతంగా ఉంది. దేశంలో పది మంది చిన్నారుల్లో కనీసం ఇద్దరికి రోజు మొత్తం భోజనం లభించని దుస్థితి నెలకొంది. 2016 నుంచి ఈ పరిస్థితిలో మార్పు లేదని ఈ అధ్యయనం పేర్కొంది.
అలాగే సంతోష సూచికలో మన దేశ స్థానం గత పది సంవత్సరాల్లో దిగజారింది తప్ప ప్రజలకు ‘అచ్చేదిన్‌’ ఏమిలేవు. మానవ అభివృద్ధి సూచిక-2022లో కూడా 191 దేశాల్లో మనది 132వ స్థానం. శ్రీలంక 73, బంగ్లాదేశ్‌ 129, భూటాన్‌ 127వ స్థానాల్లో ఉండి మనకంటే మెరుగ్గా ఉన్నాయి. మోడీ తాను అధికారంలోకి వస్తే ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తానని హామీ ఇచ్చారు. కాని గడిచిన పదేళ్లలో నిరుద్యోగిత బాగా పెరిగిపోయింది. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. సెంటర్‌ ఫర్‌ ఇండియన్‌ ఎకానమీ నివేదిక-2022 ప్రకారం దేశంలో నిరుద్యోగిత రేటు 7.7 శాతంగా ఉంది.గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ నిరుద్యోగిత రేటు 8.04 శాతంగా ఉంది. పనిచేయగలిగే సత్తా ఉన్నా, తగిన ఉపాధి దొరకక పొట్ట కూటి కోసం దేశ యువత అల్లాడి పోతున్నారు. ఈ పదేళ్లలో 23 కోట్ల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోగా, కేవలం 7లక్షల మందికే ఉపాధి దొరికింది. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏటా ఇస్తానన్న 2 కోట్ల ఉద్యోగాలు ఏమయయ్యో? మోడీ జవాబు చెప్పాలి. ఇలా ఉపాధి కల్పనలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. దేశంలో గత 20 ఏళ్లుగా ఉపాధి రహిత అభివృద్ధి జరిగింది. దీని మూలంగా ప్రజల కొనుగోలు శక్తి క్షీణించి ప్రాధమిక అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నిరుద్యోగం కారణంగా యువత ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు పెరిగాయని జాతీయ నేర గణాంకాల బ్యూరో పేర్కొంది. 1991 నుంచి మొత్తం ప్రభుత్వ రంగాన్ని ప్రయివేటీకరణ చేయడంతో దేశ సంపద కొద్ది మంది చేతుల్లో పోగుపడి తీవ్ర ఆదాయ అసమానతలకు దారి తీసింది.
బడాబాబులకు పన్ను రాయితీలు ఇచ్చి వారి సంపద పెరిగేటట్టు చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. మరోవైపు సామాన్య ప్రజలపై భారీగా వివిధ పన్నుల రూపంలో భారం మోపి నడ్డి విరిచేస్తున్నారు. ఇలా కాక దేశ సంపదను దోచుకుంటున్న 167 అపరకుబేరుల కుటుంబాల సంపదపై రెండు శాతం పన్ను విధిస్తే జాతీయ ఆదాయం 0.5 శాతం పెరిగి దేశంలోని దారిద్రాన్ని కొంతైన తగ్గించవచ్చు. రానురాను వట్టిపోతున్న ప్రభుత్వ ఖజానాను ప్రభుత్వరంగ పెట్టుబడుల ఉపసంహరణ (ప్రజల ఆస్తులు) ద్వారా నింపుకుంటున్నారు. ఈ దివాళా కోరు ఆర్ధిక విధానాల ద్వారా సామాన్య ప్రజల జీవించే హక్కును హరించి వేస్తూ, కార్పొరేట్లకు దేశ సంపదను దోచి పెడుతున్నారు. వాస్తవ పరిస్థితి ఇదైతే ‘దేశం వెలిగిపోతోంది, వికసిత భారత్‌, అచ్చేదిన్‌’ అంటూ అబద్ధాలను గోది మీడియాలో ఊదర గొడుతున్నారు. గత పదేళ్లలో పెరిగినంతగా ఆర్థిక అసమానతలు బ్రిటీష్‌ పాలనలో కూడా పెరగలేదని ప్రపంచ అసమానతల ప్రయోగశాల-2024 ప్రకటించింది. సామాజిక, ఆర్థిక, న్యాయ, విద్య, వైద్య రంగాల్లో ఉన్న తీవ్ర అసమానతలను పాలకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా మన సంస్కృతి, విలువలు పూర్తిగా పతనమై పోతున్నాయి. నేటి ప్రభుత్వాలు రాజ్యాంగ లక్ష్యమైన ప్రజా సంక్షేమ బాధ్యత నుంచి పూర్తిగా వైదొలిగి పోయాయి. ఈ మొత్తం సమస్యల పరిష్కారానికి మరో స్వతంత్ర పోరాటం చేసి మనిషిని మనిషి దోచుకోలేని సోషలిస్టు ఆర్థిక వ్యవస్థను ప్రజలు నిర్మించుకోవాలి.

– షేక్‌ కరిముల్లా, 9705450705