– నార్కొటిక్స్ కంట్రోల్ బోర్డుకు జగ్‌జిత్ పవాడియా కీలక విజయం
న్యూయార్క్ : ఐక్యరాజ్య సమితికి చెందిన అనేక కీలకమైన సంస్థలకు భారత్ ఎన్నికైంది. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ మాదకద్రవ్యాల నియంత్రణా బోర్డు (ఐఎన్‌సిబి) కు మూడో పదవీ కాలానికి భారత్ నామినీ జగ్‌జిత్ పవాడియా అధిక ఓట్లతో తిరిగి ఎన్నికవడం ఇందులో ముఖ్య విజయం. 2025-2030 వరకు ఐదేళ్ళ పదవీకాలానికి రహస్య బ్యాలెట్ ద్వారా పవాడియా ఎన్నికయ్యారు. పోటీ ఎక్కువగా వున్న ఈ ఎన్నికలో పవాడియాకు అధిక సంఖ్యలో 41 ఓట్లు లభించడం విశేషం. రెండో స్థానంలో వచ్చిన అభ్యర్ధికి 30ఓట్లు లభించాయి. ఐదు సీట్లకు గానూ 24మంది అభ్యర్ధులు బరిలో వున్నారు. భారత్ అభ్యర్ధిపై వుంచిన విశ్వాసానికి, విలువైన మద్దతును అందించినందుకు సభ్య దేశాలకు భారత్ కృతజ్ఞతలు తెలియచేసింది. ఈ మేరకు భారత్ శాశ్వత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. 1954లో జన్మించిన జగ్‌జిత్ పవాడియా భారత ప్రభుత్వంలో 35ఏళ్ళ పాటు వివిధ కీలక పదవులు నిర్వహించారు. 1968లో ఏర్పాటు చేసిన ఐఎన్‌సిబి, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మాదకవ్య్రాల ఒప్పందాల అమలుకు స్వతంత్ర, క్వాసీ జ్యుడీషియల్ పర్యవేక్షకా సంస్థగా పనిచేస్తుంది.
యుఎన్ మహిళా కమిషన్‌కు భారత్ ఎన్నిక
ఇదే సమయంలో 2025-2029 కాలానికి మహళల స్థితిగతులపై కమిషన్‌కు కూడా భారత్ ఎన్నికైంది. దీనితో పాటు ఐక్యరాజ్య సమితికి చెందిన పలు కార్యక్రమాల కార్యనిర్వాహక బోర్డులకు కూడా ఎన్నికైంది. 2025-2027 పదవీ కాలానికి యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డుకు, జనాభా నిధి, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ బోర్డులకు కూడా ఎన్నికైంది. ఐక్యరాజ్య సమితి సంస్థల పరిధిలో చేపట్టే కార్యాచరణలో భారత్ చురుకుగా పాల్గొనడానికి నిబద్ధతతో వుందని ఐక్యరాజ్య సమితిలో భారత్ శాశ్వత రాయబారి రుచిరా కాంభోజ్ తెలిపారు. ఈ మేరకు ఆమె ఎక్స్‌లో పోస్టు పెట్టారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే చర్చలు, కార్యాచరణలో భారత్ నిర్మాణాత్మకంగా, సహకార స్ఫూర్తితో పనిచేయడానికి కట్టుబడి వుందని చెప్పారు. వసుధైక కుటుంబం అన్న తమ సిద్ధాంతానికి అనుగుణంగా ప్రజల అభ్యున్నతి కోసం సమైక్యతా స్ఫూర్తితో, బాధ్యతలను పంచుకోవడాన్ని ఇది పెంచుతుందని చెప్పారు. ఐక్యరాజ్య సమితిలో ఈనాడు భారత్‌కు గణనీయమైన విజయం లభించిందని రుచిరా కాంభోజ్ వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్య సమితి లింగ సమానత్వం, మహిళా సాధికారతా ఎగ్జిక్యూటివ్ బోర్డుకు కూడా భారత్ ఎన్నికైంది. ప్రపంచ ఆహార కార్యక్రమ బోర్డుకు ఎన్నికైంది.
ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల్లో గల 17ఖాళీలను భర్తీ చేయడానికి ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక మండలి (ఇసిఓఎస్‌ఓసి) మంగళవారం ఎన్నికలు నిర్వహించింది. ప్రశంసల ద్వారా, రహస్య బ్యాలెట్, నామినేషన్ ద్వారా ఈ ఖాళీలు భర్తీ చేయబడ్డాయి. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కూడా ఇదే విషయాన్ని ఎక్స్‌లో పోస్టు ద్వారా తెలియచేశారు. ఇతర సభ్య దేశాల కన్నా భారత్‌కు అధిక సంఖ్యలో ఓటు రావడాన్ని ఆయన ప్రశంసించారు. ఇసిఓఎస్‌ఓసిలో 53 మంది ఓటింగ్ సభ్యులు వుండగా, భారత్‌కు 41 ఓట్లు లభించాయి. ఐక్యరాజ్య సమితిలోని ఆరు ప్రధానమైన సంస్థల్లో ఇది ఒకటి.