– ఎస్‌అండ్‌పి విశ్లేషణ
– ఆర్‌బిఐ అంచనాల కంటే తక్కువ
– అధిక వడ్డీ రేట్ల ప్రభావం
న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థ పెరుగుదల ఏడు శాతం దిగువకే పరిమితం కానుందని గ్లోబల్ రేటింగ్ ఎజెన్సీ ఎస్‌అండ్‌పి అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో భారత వృద్థి 6.8 శాతంగా ఉండొచ్చని సోమవారం ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. అధిక వడ్డీ రేట్లు, వ్యవసాయేతర రంగాలలో మందగమనం డిమాండ్‌ను దెబ్బతీయనున్నాయని తెలిపింది. ”భారత జిడిపి వృద్థి పురోగమనం ఆశ్చర్యకరంగా కొనసాగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 8.2 శాతం వృద్థి నమోదయ్యింది. అధిక వడ్డీ రేట్లు, వ్యవసాయేతర రంగాలలో తక్కువ ఆర్థిక వృద్థితో ఈ ఏడాది జిడిపి 6.8 శాతానికి పడిపోవచ్చని అంచనా వేస్తున్నాము” అని ఎస్‌అండ్‌పి గ్లోబల్ రేటింగ్స్ ఆసియా ఫసిపిక్ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 2025-26లో 6.9 శాతం, 2026-27లో 7 శాతంగా నమోదు కావొచ్చని ఎస్‌అండ్‌పి అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) తన పాలసీ రేటును 6.5 శాతం నుండి 6 శాతానికి తగ్గించవచ్చని పేర్కొంది. 2025-26, 2026-27లో రుణ రేటును వరుసగా 5.5 శాతం మరియు 5.25 శాతానికి తగ్గించే అవకాశాలున్నాయని విశ్లేషించింది. ఎస్‌అండ్‌పి వృద్థి అంచనాలు ఆర్‌బిఐ కంటే తక్కువగా ఉన్నాయి. తాజా ద్రవ్య పరపతి విధాన సమీక్షలో, ఆర్‌బిఐ 2024-25కు గాను 7.2 శాతం వృద్థిని అంచనా వేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉండొచ్చని తెలిపింది.”ద్రవ్యోల్బణం, అధిక నిరుద్యోగం, సామాజిక, ఆర్థిక అసమానతలు వంటి దీర్ఘకాలిక సవాళ్లను ఎదుర్కోవడంలో.. అదే విధంగా కొత్త పొత్తులను ఏర్పరచడంలో బిజెపి ఎంత బాగా పని చేస్తుందో.. దాన్ని బట్టి వచ్చే ఐదేళ్లలో భారత వృద్థి ఉండొచ్చని ఎస్‌అండ్‌పి పేర్కొంది.