ఆగస్టు 9 అంతర్జాతీయ మూలవాసుల హక్కుల పరిరక్షణ దినోత్సవం. 1994 డిసెంబర్ 23 న ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ ఆగస్టు 9 న మూలవాసుల దినోత్సవం జరపాలని తీర్మానించింది. అప్పటి నుండి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో మూలవాసుల హక్కులు గౌరవిస్తూ, వారి గొంతుకలను గుర్తిస్తూ, వారి హక్కుల పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా ఏటా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాం.
ప్రతి ఏడాదీ ఐక్యరాజ్యసమితి ఒక సందేశంతో పనిచేస్తున్నది. అలాగే ఈ ఏడాది ‘ఒంటరిగా ఎవరితో సంబంధం లేకుండా ఉండే స్థానిక సమూహాల హక్కులు పరిరక్షించడం’ అంశంగా ప్రకటించింది.
ఒంటరి సమూహాలు అంటే..?
మనం హైటెక్ ప్రపంచంలో ఉన్నాం. విషయాలు సులభతరం అవుతున్నాయి. జీవితం సరళంగా మారుతోంది. సాంకేతికతకు లొంగిపోయి అవసరం లేని అనేక విషయాలు పట్టించుకుంటున్నాం.
కానీ, మన ప్రపంచానికి ఆవలి వైపు ఉన్న మరో ప్రపంచంలో ప్రజలు ఇంకా ఆదిమ పద్ధతుల్లో నివసిస్తున్నారని, ఆదిమ సమాజాలు ఉన్నాయని మనకు తెలియదు. నాగరిక ప్రపంచం అని మనం పిలుచుకునే పరిధికి మించి ఇంకా అక్కడ సమాజాలు ఉన్నాయని అనుకోవడం చాలా మందికి నమ్మశక్యం కాని విషయం.
”ఒంటరి సమూహాలు మనతో ఉండరు. వారు మన గురించి ఏమీ అడగరు. వారి గురించి మనకు ఏమీ తెలియకుండానే వారు జీవిస్తారు. మరణిస్తారు”
– సిడ్నీ పోస్సులో
ఒంటరి సమూహాలు మనదేశంలో కూడా ఉన్నాయా?
2018లో అండమాన్‌లో సాహస యాత్రికుడైన అమెరికన్ మిషనరీ చౌ అనే 26 ఏళ్ల యువకుడు సెంటినలిస్ సమూహం చేతిలో హతమవడం గుర్తుండే ఉంటుంది.
ప్రపంచంలోనే అత్యంత ఒంటరి సమూహంగా గుర్తించబడిన సమూహం సెంటినలిస్. వీరు వేలాది ఏళ్లుగా ఒంటరి సమూహంగా జీవిస్తున్నారు. అండమాన్ దగ్గరలోని ఉత్తర సెంటినల్ ద్వీపంలో నివసించే సెంటినలిస్ ప్రజలు సమాజంతో సంపర్కాన్ని తిరస్కరిస్తారు. చౌ వారిని సంప్రదించే ప్రయత్నాలు చేశాడు. అతనితో సంబంధం వద్దనుకున్నారు వాళ్ళు.
ప్రపంచంలోని ఇతర సమూహాల, సమాజాలతో సంబంధం లేకుండా ఉన్న స్థానిక ప్రజా సమూహాలు, ఇతరులతో సంబంధం ఉండాలో వద్దో నిర్ణయించుకునే సమూహాలను స్వచ్ఛంద ఐసోలేషన్‌లో ఉన్న సమూహాలుగా చెబుతారు.
ఇతర సమాజానికి దూరంగా ఉండే ఆదిమ జాతుల సంఖ్య ఎంత ఉంటుందో అంచనా వేయడం ఆధునిక సమాజానికి ఒక సవాలే.
సభ్య సమాజానికి దూరంగా ఉండడం వల్ల వాళ్లు అందుకునే హక్కులు, చట్టపరమైన రక్షణ దూరంగానే ఉన్నాయి.
చట్టపరమైన రక్షణ అందని ఒంటరి సమూహాల/ స్థానిక ప్రజల పర్యావరణం, భూములు, వారి ఆరోగ్యం రక్షించాల్సిన ఆవశ్యకతను, దోపిడీ నుంచి వారిని రక్షించాల్సిన ప్రాముఖ్యతను అంతర్జాతీయ సంస్థలు గుర్తించాయి.
తనకంటూ ప్రత్యేకమైన సంస్కృతి, ప్రకృతితో పర్యావరణంతో అవినాభావ సంబంధం ఉన్న మార్గదర్శకులు, అభ్యాసకులు మూలవాసులు. మిగతా సమాజానికి భిన్నమైన సామాజిక, సాంస్కృతిక, రాజకీయ ఆర్థిక లక్షణాలు నిలుపుకున్నారు వారు. మూలవాసుల తెగలు, జాతుల, సమూహాల మధ్య సాంస్కృతిక వ్యత్యాసాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ, వారి హక్కుల పరిరక్షణకు సంబంధించిన సాధారణ సమస్యలు పంచుకుంటారు.
మూలవాసుల స్థితిగతులు
‘ఏ దేశ చరిత్ర చూసిన ఏముంది గర్వకారణం’ అన్నట్లుగా ప్రపంచవ్యాప్తంగా మూలవాసుల భూమి, జీవనోపాధి దోపిడీకి గురయ్యాయి. వేలవేల ఏళ్లుగా నడయాడిన తమ నేల వారి నుండి దొంగిలించబడింది. వారి వనరులు ప్రమాదంలో ఉన్నాయి. తమ నేలకు దూరంగా తరిమి వేస్తున్నారు. వారిని కనీసం మనుషులుగా కూడా చూడటం లేదు. నిర్వాసితులై ఒడ్డున పడ్డ చేపల్లా గిలగిలా కొట్టుకుంటున్నారు.
తమను తాము రక్షించుకునే క్రమంలో తమ హక్కుల కోసం నిరసన తెలిపే క్రమంలో వేలాదిమంది అడవి బిడ్డలు హత్యకు గురయినా ఆ వార్తలు పతాక శీర్షికల్లో రావు. సభ్యసమాజానికి తెలియదు. తెలిసినా పట్టింపు ఉండదు. ఏ రకంగా చూసినా వారి మనుగడకు విపత్తు ఏర్పడుతూనే ఉంది.
మూలవాసులు తమ గుర్తింపు, జీవన విధానం, సాంప్రదాయ భూములు, భూభాగం సహజ వనరులపై వారి హక్కును గుర్తించాలని చాలా ఏళ్లుగా కోరుతున్నారు. అయినప్పటికీ చరిత్రనంతా తిరగేసి చూస్తే, వారి హక్కులు ఎల్లప్పుడూ ఉల్లంఘనకు గురవుతూనే వున్నాయి.
అనాదిగా మానవుడు చేసుకున్న చట్టాలు, ఏర్పరచుకున్న కట్టుబాట్లు ఆ పద్ధతికి, భాషకి ఆ విధానానికి చాలా దూరం.
చీకటి సామ్రాజ్యాలు అందుకు ఒప్పుకుంటాయేమో.. అలా ప్రవర్తిస్తాయేమో కానీ, ప్రాంతం ఏదైనా, దేశం ఏదైనా, పలికే భాష ఏదైనా మూలవాసీ సంస్కారం మాత్రం ఒప్పుకోదు.
కూలిపోయిన తమ అస్తిత్వ శిథిలాల మధ్య తమ జీవితాలతో సంప్రదింపులు చేసే మనస్తత్వం, సంస్కృతి మూలవాసులకు లేదు. అటువంటి అనుభవాలు తెలియదు. నిర్వాసితురాలై వలసపోయిన చోట తమ మునుపటి నైపుణ్యాలను ఉపయోగించలేరు. అందువల్ల తరతరాల వారి నైపుణ్యాలు, జ్ఞానం నిరుపయోగమవుతున్నాయి.
ఆదివాసులు నేడు ప్రపంచంలో అత్యంత వెనుకబడిన, బలహీనమైన సమూహాలుగా ఉన్నారు. వారి హక్కులను పరిరక్షించడానికి, వారి విభిన్న సంస్కృతి, జీవన విధానం నిర్వహించడానికి ప్రత్యేకమైన చర్యలు అవసరమని అంతర్జాతీయ సమాజం ఇప్పుడు గుర్తించింది.
యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ‘ట్రాన్సోర్మింగ్ వరల్డ్ ది 2030 ఫర్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్’ పేరుతో సుస్థిర అభివృద్ధి కోసం 2030 అజెండా ఆమోదించింది. 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది ఒక విస్తృతమైన, సార్వత్రిక విధాన అజెండా. 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, 169 అనుబంధ సుస్థిర లక్ష్యాలు ఉన్నాయి. ఇవి సమగ్రమైనవి. విడదీయలేనివి.
ప్రపంచవ్యాప్తంగా 476 మిలియన్ల ఆదివాసీలు ఉన్నారు. అది ప్రపంచ జనాభాలో 6 శాతం. వీరు దాదాపు 90 దేశాలలో ఉన్నారు. 5000 రకాల సంస్కతి సంప్రదాయాలలో నివసిస్తున్నారు. మూలవాసీ భాషలు 4000 వేల పైనే. ప్రపంచవ్యాప్తంగా 19 శాతం మూలవాసీలు కటిక దరిద్రంలో మగ్గుతున్నారు.
చారిత్రకంగా అణచివేతకు భౌగోళికంగా ఉన్నచోటు నుంచి నెట్టివేతకు గురవుతున్నారు. వారి భూములు, ప్రాంతాలకు సరైన రక్షణ లేదు. వారి పూర్వీకులు నడయాడిన నేల, వనరులు చాలా తక్కువ మందికి అందుబాటులో ఉన్నాయి.
అడవిబిడ్డల కాళ్ళ కింద, వాళ్ళు నడయాడిన నేల కింద ఉన్న విలువైన ఖనిజాల కోసం కార్పొరేట్ గద్దలు అక్కడ వాలి భయపెట్టో, బలవంతానో నిర్వాసితులను చేస్తున్నారు. పెద్ద ఎత్తున అడవులను నరికి వేస్తున్నారు. ఇష్టారాజ్యంగా అడవి నరికి పోడు చేయడం వల్లనే పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని నింద మోసేది మాత్రం అమాయక సమూహాలు. తరిగిపోతున్న అడవుల వల్ల, ఖనిజాల వెలికితీత వల్ల నష్టపోతున్నది ఆ తల్లి బిడ్డలతో పాటు జీవవైవిద్యానికి కూడా నష్టం వాటిల్లుతున్నది. ఆదివాసీలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తున్నది.
మారుమూల ఉన్న ఒంటరి తెగలు/ సమూహాల ఉనికికే అతిపెద్ద ముప్పు వాటిల్లుతున్నది. ఇప్పటికే చాలా సమూహాలు తమ ఉనికిని కోల్పోయాయి.
సభ్య సమాజంతో సంపర్కంలో ఉన్న ఆదివాసీల భూములు ఆదివాసీ యేతరులు నిరంతరం ఆక్రమించుకోవడం, కోర్టు ఇచ్చిన తీర్పులను అధికారులు అమలు చేయకపోవడం, ఆదివాసీలకు అప్పు ఇచ్చి అప్పు తీర్చలేదని భూములు లాక్కుంటున్నారు. వారు సొంత భూముల్లోనే కూలీలుగా మారుతున్నారు.
కోర్టులో ఉన్న ఆదివాసీల భూమి తగాదాలు త్వరగా పరిష్కారం కావటం లేదు. ఆదివాసీ యేతరులు ఆక్రమించిన ఆదివాసీల భూములు ఖాళీ చేయించకపోవటం, ఆక్రమించిన వారికి శిక్ష పడకపోవడం వల్ల ఆదివాసీ యేతరులు సులభంగా ఆదివాసీల భూములు తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు.
ఆస్తిపై హక్కు లేదా తాము పండించిన భూమిపై హక్కులు లేకపోవడం వల్ల ఆర్థికంగా అట్టడుగున ఉన్నారు. వీళ్ళ వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జనాభాకు నిలయం భారతదేశం. 10.4 మిలియన్లకు పైగా ఆదివాసీ జనాభా ఉంది. దేశ జనాభాలో 8.6%, గ్రామీణ జనాభాలో 11.3% (2011 సెన్సస్ ప్రకారం).
అడవిని నమ్ముకుని బతికిన అడవితల్లి బిడ్డలు జీవన భద్రత కోల్పోయి, అతి తక్కువ వేతనాలకు కూలీలుగా మారిపోయే పరిస్థితి వేగంగా వుంది. వారి స్థానభ్రంశం వారి భూముల నుండి మాత్రమే కాదు, వారి జీవనోపాధి, సంస్కృతి సంప్రదాయాలు, విస్తృత సామాజిక వాతావరణం నుంచి కూడా. అంతర్గతమైన ఈ నష్టాలను ఎలా భర్తీ చేయగలరు ఎవరైనా?! కాబట్టి అభివృద్ధి గురించి ప్రత్యామ్నాయ ఆలోచనలు చేయాల్సిన అవసరం అనివార్యం.
ఇప్పటికే కొన్ని మూలవాసీ సమూహాలు, ఆ సముదాయాల భాషలు అంతమైపోయాయి. మరికొన్ని ఆ దిశలో ఉన్నాయి. కొన్ని సమూహాలను కోల్పోవడం అంటే మానవ వారసత్వంలో కొంత భాగం కోల్పోయినట్లే. ఆ సమూహాల ఆర్థిక, రాజకీయ, సామాజిక, పర్యావరణ అవగాహన, అమూల్యమైన నైపుణ్యాలను ప్రపంచం కోల్పోయినట్లే.
ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం రానురాను కుచించుకుపోతున్నది. ప్రాజెక్టులకు, పారిశ్రామికీకరణకు, గనుల తవ్వకానికి అనుకూలంగా ప్రభుత్వం చేసే భూసేకరణ సాధారణంగా గిరిజన తెగలకు సంబంధించిన వారిదే. అది వారిని అలవాటైన విధంగా జీవించనీయడం లేదు. ప్రభుత్వాలు మూలవాసుల జీవితాల వైపు నుంచి ఆలోచించకపోవడం వల్ల వాళ్ళ పరిస్థితి భయంకరంగా ఉంది. అభివృద్ధి పేరిట నిర్వాసితుల్ని చేస్తున్న ప్రభుత్వ నిర్ణయాలు మూలవాసులలో తీవ్ర అసంతృప్తికి కారణం అవుతున్నది. ఈ క్రమంలో తమ కుటుంబాలు, తమ మాతృభూమిని, తమ వనరులను, తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం పెద్ద ఎత్తున వ్యతిరేకత తెలుపుతూనే ఉన్నారు మూలవాసులు, ఆదిమ జాతులు. ప్రకృతి వైపరీత్యాలకు, సహజంగా వచ్చే ప్రమాదాలకు మొదట బలయ్యేది ఆదివాసులే. మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు అందుబాటులో లేవు.
మానవ హక్కులు అమలు కావు
అడవి బిడ్డలు కూడా మనతో సమానంగా శక్తివంతులు, సాంస్కృతికంగా సంపన్నులు. భారతదేశంలో దాదాపు 705 స్థానిక సమూహాలు/ తెగలు/ జాతులు ఉన్నాయి. ఎవరి ప్రత్యేకత వారిదే. ఈ జాతులన్నీ మన సమాజానికి దూరంగా ఉండొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం జరుగుతున్న పరిణామాలు, అభివృద్ధి నమూనాలు వారికి తెలియకపోవచ్చు. విభిన్న సంస్కతులు, సంప్రదాయాలు, జీవన శైలులు, భాషలు, నమ్మకాలూ, ఆహారం వంటి విధానాలన్నీ మనకు పూర్తి భిన్నంగా ఉండొచ్చు. అంతమాత్రాన రాజ్యాంగపరంగా సంక్రమించిన హక్కులు కాలరాసి, ఆ శిథిలాలపై ప్రజాస్వామ్య సౌధాలు నిర్మిస్తారా?
భారతీయ వారసత్వ మానవ సంపదకు ఉదాహరణగా ఉన్న వీరిలో కొందరు అంతరించిపోతున్న జాతులలో ఉన్నారు. వారి జీవనం ప్రత్యేకం కావచ్చు కానీ వారు భారతీయ సమాజంలో భాగం. వారికి గతం ప్రాముఖ్యత తెలుసు. భవిష్యత్ తరాలను కాపాడుకోవడం కోసం ఎలా ఉండాలో తెలుసు. ప్రకృతితో సహజీవనం తెలుసు. ప్రకృతి ప్రకోపిస్తే ఏమవుతుందో తెలుసు.
ఏది ఎంత అవసరమో అంతే తీసుకుంటూ సమతుల్యతను కాపాడడం తెలుసు. ఈ జీవావరణంలో ఉన్న జీవులన్నిటి కంటే మనిషి గొప్పవాడేం కాదని, అందరూ దగ్గరి బంధువులేనని వారి నమ్మకం. మానవుడు ఒంటరిగా ఏమీ చేయలేడని మూలవాసులు ఆనాడే గ్రహించారు.
ఆఫ్రికన్ ఆదిమ మానవులైనా, ఆస్ట్రేలియాన్ అబోరిజినల్స్ అయినా, ఆసియన్ ఆదివాసీలైనా, అమెరికన్ మూలవాసులైనా అందరి జీవన విధానం దాదాపు ఒకటే. పర్యావరణ హితమైన జీవితం. పూర్వీకుల జ్ఞానాన్ని, అనుభవాల్ని మరో తరానికి ప్రవహింప చేయడం అని ఆస్ట్రేలియన్ నేషనల్ మ్యూజియం చూసిన తర్వాత నాకు అర్థమైంది.
దేశం ఏదైనా ఆదిమ జాతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయా దేశాల ప్రభుత్వాలపై ఉంది.
భారతదేశంలో ఆదివాసీలు తమ స్వయం నిర్ణయాధికారం, స్వయంప్రతిపత్తి, గుర్తింపు, సామూహిక హక్కును రక్షించడం, భూమి, భూభాగాలు, వనరులపై తమ హక్కును తిరిగి పొందడం కోసం శతాబ్దాలుగా పోరాడుతూనే ఉన్నారు.
ఆదివాసీల సంస్కృతి, భాష, జీవన విధాన పరిరక్షణ కోసం…
– ఆదివాసీల జీవన గాధలు, చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు రాయడం, ఫొటోలు, వీడియో ద్వారా భద్రపరచాల్సిన అవసరం ఉంది.
ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు గారు మూలవాసుల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను తెలిపే కళాకృతులు, పనిముట్లు, హస్తకళలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. నిజానికి ఇది ఒక వ్యక్తి పని కాదు. మన ప్రభుత్వం చేయవలసిన పని.
దేశంలో అక్కడక్కడ చిన్న చిన్న ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి కానీ అది ప్రైవేటు రంగంలో.
కదిలే కాలంతో పాటు మారని మూలవాసుల సమాచారం, జీవన విధానం తెలిపే ఒక చోటు అవసరం ఉంది. వ్యక్తులుగా ఒకరు చేయలేని పని ఒక వ్యవస్థగా ప్రభుత్వం సులభంగా చేయగలుగుతుంది.
– ఆదివాసీ భాషల పరిరక్షణ, భాషలకు లిపి ఏర్పరచడం, డిక్షనరీ తయారుచేయడం, బోధనకు అవసరమైన విద్యా మెటీరియల్స్ పరిరక్షించుకోవాలి.
– సాంస్కృతిక విద్య: బడులు నెలకొల్పాలి. పాఠాల్లో మూలవాసుల సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర వంటివి పొందుపరచాలి. (ఆస్ట్రేలియా, అమెరికాలలో ఆది చూశా).
– ఆదివాసీల చరిత్ర, సంస్కృతిని పరిరక్షించే కార్యక్రమాలకు సంస్థలకు, వ్యక్తులకు ప్రభుత్వం సహకరించాలి.
– ఈ తరం పిల్లలకు తమ పెద్దల నుంచి సంస్కృతి, భాష అందిపుచ్చుకునే అవకాశాలు కల్పించాలి.
– ఒక తరం నుంచి మరో తరానికి అందివచ్చిన సాంప్రదాయ విజ్ఞానాన్ని పరిరక్షించడం. ఆదివాసీల మేధో హక్కుల కింద పరిగణించాలి.
– వారికి సంబంధించిన చారిత్రక ప్రదేశాలు, వస్తువులు, వగైరా లాంటి వారసత్వపు సంపదను పరిరక్షించుకోవాలి.
– స్థానిక ఆదివాసీల ఆదాయం పెంచే కార్యక్రమాలు చేపట్టాలి.
– ఆదివాసీల భాషలు, సంస్కృతి, హక్కులు గుర్తించి రక్షించే చట్టాలు, పాలసీలు తేవాలి.
– మూలవాసీ పెద్దల జ్ఞానం, నైపుణ్యాలు, కళలు తరువాతి తరాలకు అందించే విధంగా ప్రోత్సహించాలి.
– సాధారణ పౌరులతో పోల్చుకున్నప్పుడు అడవిబిడ్డల జీవితం 20 ఏళ్ళు తక్కువ. మాతా శిశు మరణాలు చాలా ఎక్కువ. 35 ఏళ్ళు దాటిన వారిలో 50 శాతం మంది టైపు 2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. టీబీ, పోషకాహార లోపం, పేదరికం, ఆరోగ్య సదుపాయాలు లేకపోవడం, మందులు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యల నుండి బయట పడాలి.
– అడవులను ప్రొటెక్టెడ్ ఏరియాస్‌గా ప్రకటించక ముందు నుంచి అడవుల్లో ఉండే ఆదివాసీల ఆధీనంలో ఉన్న భూమి వారిదే. అడవి బిడ్డల కోసం ఏర్పాటైన చట్టాలను సక్రమంగా అమలు పరచాలి.
– ఆధునిక సమాజానికి దూరంగా ప్రకృతితో మమేకమై ఆదిమ సంస్కృతిని అనుసరిస్తూ అడవుల్లో జీవించే అడవిబిడ్డలపై బయట సమాజంలో జరుగుతున్న అభివృద్ధి మోడల్స్ రుద్దకుండా చేయాలి.
ఆదివాసీ సాంప్రదాయ జీవన విధానాన్ని, సంప్రదాయాలు ఆధునిక విజ్ఞానం ద్వారా మెరుగుపరుస్తూ కొనసాగిస్తూనే, వారి అవసరాలు, విలువలు, ఆశలు, ఆశయాలు దష్టిలో పెట్టుకుని, వాటికీ ప్రాధాన్యతనిస్తూ ఆధునిక విజ్ఞానం ద్వారా వారి అభివద్ధి కార్యక్రమాలు, ఆధునిక సౌకర్యాలు రూపొందించాలి. వారి సామర్ధ్యాలు పెంచాలి.
మూలవాసిల కోసం ప్రత్యేక దినోత్సవాలు జరపడం, చట్టాలు పాలసీలు తయారు చేయడం, ప్రణాళికలు రూపొందించడంతోనే సరిపోదు. అందుకు తగ్గ కార్యాచరణ ముఖ్యం.
ఏ కార్యక్రమం చేపట్టినా అభివృద్ధి సౌధాల కింద నలిగిపోతున్న మూలవాసులు తమ అస్తిత్వాన్ని తాము గౌరవించుకుంటూ కాపాడుకుంటూ హక్కులు, సంక్షేమ, సంరక్షణ కార్యక్రమాలు వ్యవహారాలు ఉన్నప్పుడు అనుకున్న ఫలితాలు సాధ్యం.
– వి. శాంతి ప్రబోధ, 9866703223