– గ్రామసభలు ద్వారానే లబ్దిదారులను ఎంపిక చేయాలి…
– వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్…
నవతెలంగాణ – అశ్వారావుపేట
భూమిలేని, నిరుపేదలైన రోజువారీ వ్యవసాయ కార్మికులుకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అనుబంధ సంఘం అయిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అశ్వారావుపేట మండల కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం బాధ్యులు బి.చిరంజీవి ఆద్వర్యంలో బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారులను గ్రామసభలు ద్వారానే ఎంపిక చేయాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు 12 వేల రూపాయలు ఇస్తానని చేసిన వాగ్దానం అమలు చేయాలని కోరుతున్నామని, భూమి లేని వ్యవసాయ కార్మికులను గ్రామసభల్లో గుర్తించి వారికి మాత్రమే రూ.12 వేలు చెల్లించాలని ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఉపాధి హామీలో 100 రోజులు పూర్తి చేసుకున్న వారికి రూ.12 వేలు ఇస్తాం అనడం సరైనది కాదని అభ్యంతరం తెలిపారు. వ్యవసాయ కార్మికులే కాక రైతాంగం, ఇతర ప్రజలు కూడా ఉపాధి పనులు చేస్తున్నందున ఉపాధి పనికి లింక్ పెట్టడంతో దుర్వినియోగం అవుతుందని తెలిపారు.ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన కుల గణన,కుటుంబ సర్వేలో ప్రతీ ఒక్కరి వివరాలు ఉన్నాయని దాని ఆధారంగా వ్యవసాయ కార్మికులుకే రూ.12 వేల రూపాయలు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముల్లగిరి గంగరాజు, ఎం.దుర్గారావు లు పాల్గొన్నారు.