– సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయాలి
– మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ భేటీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
త్వరలో ఇందిరమ్మ కమిటీలను నియమించడం ద్వారా సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి కోరారు. ఇందు కోసం నియోజకవర్గాల్లో నిజాయితీ, నిబద్ధత ఉన్న అధికారులను నియమించుకోవాలని సూచిం చారు. మంగళవారం హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో ఐదు జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమయ్యారు. తాజా రాజకీయాలు, పార్లమెంటు ఎన్నికలు, గ్యారంటీలు తది తరాంశాలపై చర్చించారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల నేతలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ నిజమైన లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. అవినీతి అధికారులను ప్రోత్సహించేది లేదని తెలిపారు. అధికారులు, పోలీసుల బదిలీల్లో పైరవీలకు తావు లేదన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే పనులు చేయొద్దని కోరారు. ప్రతీ నియోజకవర్గానికి రూ.10 కోట్ల స్పెషల్ డెవలెప్‌మెంట్ నిధులు (ఎస్‌డీఎఫ్) కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జి మంత్రులకు ఈ నిధుల బాధ్యతను అప్పగిస్తున్నట్టు వివరించారు. ఇన్‌చార్జి మంత్రులతో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. స్థానికంగా తలెత్తే సమస్యలను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పార్టీనీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని కోరారు. 12 ఎంపీ స్థానాలకు తగ్గకుండా గెలిపించుకోవాలని దిశానిర్దేశం చేశారు.