ఇందూరు బాల కథల ‘మందారం’

'Mandaram' of Indoru children's storiesదారం గంగాధర్‌ వృత్తిరీత్యా సాంఘికశాస్త్ర విశ్రాంత ఉపాధ్యాయుడు. ప్రవృత్తిరీత్యా వ్యవసాయంతో పాటు సాహితీ వ్యవసాయం చేస్తారు. సామాజిక మాధ్యమాల్లో ఉన్నవారికి ‘నేటి దారం సూక్తి’ పేరుతో ప్రతిరోజు పొద్దు పొడవకముందే తన సూక్తోక్తులతో మేలుకొలిపే దారం గంగాధర్‌ పరిచితులే.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుండి బాల సాహిత్యకారులు ఇప్పుడు ఎక్కువగానే కనిపిస్తున్నారు. ఇక్కడి తొలి, మలి తరం వారిలో మెండా వంటి యితర ప్రాంతాలు, జిల్లాల వారు కూడా ఉన్నారు. దీనికి తోడు ప్రస్తుతం బాలల రచనల వెల్లువ కూడా నిజాం సాగర్‌ డ్యామ్‌ మత్తడి ప్రవాహంలాగే విశేషంగా ప్రవహిస్తోంది. యిది చక్కని పరిణామం. ఈ నేపథ్యంలోనే బాలల కోసం బాధ్యతగా రాస్తున్న పెద్దల్లో ‘మందారం’ కలం పేరుతో వెలుగుతున్న దారం గంగాధర్‌ కనిపిస్తారు. రచయిత, కార్యకర్త, వివిధ సంస్థలకు సన్నిహితులుగా అయన ఇందూరు ప్రాంతంలో ప్రసిద్ధులు. దారం గంగాధర్‌ 15 జులై 1948న నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం, బినోల గ్రామంలో పుట్టారు. తల్లిదండ్రులు శ్రీమతి దారం లక్ష్మీ, శ్రీ గంగారాం. కోరుట్ల, నిజామాబాద్‌ ఆ పై ప్రాంతంలోని అనేక మందికి గంగ, గంగాధర్‌, గంగారాం, గణేశ్‌ పేర్లు సాధారణం. గోదావరి నదిని గంగగా తలిచి, పిలిచి, కొలవడం తెలంగాణ ప్రజల సంప్రదాయం. ఆ ‘గంగ’ ఒడ్డున ఉన్నవాళ్ళందరు పేర్లు పెట్టుకోవడం, పుట్టువెంట్రుకలు గంగ ఒడ్డున తీయడం కద్దు. జీవనది గోదారి తెలంగాణకు జీవధార కదా. మా అమ్మ పేరు ‘గంగాబాయి’ అక్కడి సాంప్రదాయమే!
రచయిత దారం గంగాధర్‌ వృత్తిరీత్యా సాంఘికశాస్త్ర విశ్రాంత ఉపాధ్యాయుడు. ప్రవృత్తిరీత్యా వ్యవసాయంతో పాటు సాహితీ వ్యవసాయం చేస్తారు. బహుశః సామాజిక మాధ్యమాల్లో ఉన్నవారికి ‘నేటి దారం సూక్తి’ పేరుతో ప్రతిరోజు పొద్దు పొడవకముందే తన సూక్తోక్తులతో మేలుకొలిపే దారం గంగాధర్‌ పరిచితులే. రచయితగా దారం కథలు, నవలలు వెలువరించారు. వాటిలో తొలి కథా పుస్తకం ‘మందారం’ పేరుతో వెలువరించిన కథల సంపుటి. తరువాత ఆ కోవలోనే వచ్చిన రచనలు ‘సంస్కృతి’ కథలు, ‘మాతృదేవోభవ’, ‘మహమ్మారి’ పేర వచ్చిన కరోనా కథల సంపుటాలు. ఇటీవల వచ్చిన తాజా కథల పుస్తకం ‘తిత్లీ’. సామాజిక సమస్యలు, ఆధునిక ఇతివృత్తాలు భూమికగా కథలు రాసే దారం కథా వస్తువులన్నీ అట్టడుగు వర్గాల జీవితాలు, ఆయా జీవితాల సమస్యలు, సమాధానాలు కావడం విశేషం. కథకునిగానే కాక నవలా రచయితగా పరిచితులైన ఈయన తెచ్చిన నవల ‘ఆరాటం’. తన రచనల్లో తెలంగాణ ప్రజల భాషను, వివిధ మండలాల్లో ప్రజలు ఉపయోగించే యాససలను, సామెతలను చక్కగా పాత్రోచితంగా వాడుకునే వీరికి చారిత్రక ప్రదేశాల సందర్శన, విహార యాత్రలంటే ఇష్టం. సాహిత్య, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలతో పాటు ఎన్‌.సి.సి ద్వారా తన ఆలోచనలకు కార్యరూపం కల్పించుకున్నారీయన. అప్పటి దేశాధ్యక్షుడు డా.జాకీర్‌ హుస్సేన్‌తో కరచాలనం చేయడం గొప్ప అనుభూతిగా చెప్పుకునే వీరు ఉపాధ్యాయునిగా గుర్తింపు, సత్కారాలతో పాటు రచయితగా వివిధ సంస్థల పురస్కారాలు, గౌరవాలు అందుకున్నారు. కళా నిలయం సంస్థ వీరిని ‘కళా వాచస్పతి’గా గౌరవించి సత్కరించగా, వ్యాసపురి వాసవి కన్యకాపరమేశ్వరి వారి రాష్ట్రస్థాయి సాహిత్య పురస్కారం, విశ్వసాహితీ పురస్కారం, గిడుగు రామ్మూర్తి పంతులు సాహితీ పురస్కారం అందుకున్నారు.
పిల్లల కోసం దారం రాసిన కథల సమాహారం ‘నానమ్మ కథలు’ బాల కథల సంపుటి. యిది దారం తెలుగు పిల్లలకు అందించిన ఇరవయ్యొక్క కథల తీపి తాయిలం. పిల్లల కోసం పెద్దలను, వాళ్ళ విషయాలను, పిల్లల కోసం పిల్లలకు నచ్చిన విషయాలను రాయడం ఈ కథల్లో చూడొచ్చు. నిజానికి భిన్నమైన రెండు విషయాలను ఒకే ‘దారం’లో గుచ్చడం కష్టమే. దాన్ని సుసాధ్యం చేసిన రచయిత దారం గంగాధర్‌. కథల గురించి మాట్లాడుకునే ముందు ఈ పుస్తకంలో రచయిత చేసిన ఒక విశేష ప్రయోగాన్ని చూద్దాం. సాధారణంగా కథా సంపుటాలు కథలతో, లేదా కథల చివర నీతి వాక్యాలతో, కాదంటే రచయిత యిచ్చే వివిధ స్టేట్‌మెంట్లు ఉండడం చూస్తాం. యిందులో దారం ప్రతి కథ చివర ప్రతేకంగా ఒక పేజీని కేటాయించి ‘గణిత గుర్తులతో మనిషి తత్వ గణన’ పేరుతో గణితశాస్త్రంలోని గుర్తుల నేపథ్యంగా మనిషి గురించి వివరిచడం వల్ల ఇది వినోదాత్మకంతో పాటు విజ్ఞానదాయకమైన రచనగా కనిపిస్తుంది. ఉదాహరణకు ‘సూపర్‌సెట్‌’ను వివరిస్తూ ‘మనుషులంతా ఒక్కటే నన్న భావన ఉండడం మనలో ఉన్న సమితికి లెక్క’ అంటారు. ఇలా ప్రతి గుర్తుకు ఒక వివరణ యివ్వడం బాగుంది. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన దారం ప్రతి ఈ పరిశీలనాశక్తిని తన కథలకు ఇందనంగా వాడుకున్నారు. ‘మందమతులు’ కథ మిడిమిడి జ్ఞానం వల్ల కలిగే నష్టాల గురించి చక్కగా తెలిపితే, వృద్ధులపట్ల బాధ్యతను, ఒక్క స్పర్శ వారిని వార్ధక్యంలో ఎంతగా ప్రభావితం చేస్తుందో పిల్లలకు తెలిసేలా చెప్పే కథ ‘మట్టిచిప్ప.’ అంతస్తుల కన్నా ఆదర్శంతమైన జీవనమే విలువైందని నిరూపించే కథ ‘జ్ఞానోదయం’. బాలికల పట్ల మనం ఎలా ఉండాలో చెబుతూ, సంకల్పిస్తే ఆడపిల్లలు ఎంత ఎత్తుకు ఎదుగుతారో చెప్పే కథ ‘బేటీ బచావో…’ కథ, ఈ కథ దారం బాలల కథల దండకు పూలచెండు లాంటిది. పర్యావరణం, వయోజనవిద్య, పెద్దలపట్ల గౌరవం వంటివి వీరి కథల్లో చూడొచ్చు. ఇందూరు నుండి బాలల కథల జండా ఎగరేస్తున్న పెద్దలు ‘బాల కథా ‘మందారం’ గంగాధర్‌ దారం’కు ముబారక్‌ బాద్‌.
– డా|| పత్తిపాక మోహన్‌
9966229548